ఆరో “దశ” ఎవరికి తిరుగుతుంది…?

bharathiya-janatha-party-insixth-phase-election

ఆరో దశ పోలింగ్ అధికార భారతీయ జనతా పార్టీకి కీలకంగా మారనుంది. ఈ దశలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటేనే అధికార పీఠం దక్కే వీలుంటుంది. అయితే ఆరోవిడతలో జరిగనున్న 59 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా తాము కైవసం చేసుకుంటామని కమలనాధులు బయటకు చెబుతున్నప్పటికీ అంత తేలికగా అయ్యే పనికాదన్నది క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. మరోవైపు విపక్షాల మధ్య సఖ్యత లేకపోవడం బీజేపీకి కలసి వచ్చే అంశమని చెబుతున్నారు.

ఓట్లు చీలిపోతేనే….

ముందుగా ఉత్తరప్రదేశ్ ను తీసుకుంటే ఇక్కడ మే 12వ తేదీ ఆరో విడత ఎన్నికలు 14 స్థానాల్లో జరగనున్నాయి. ఇందులో 12 సీట్లు కమలం పార్టీ సిట్టింగ్ సీట్లు. దీంతో వీటిని నిలబెట్టుకునేందుకు కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈ 14 స్థానాల్లోనూ బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పోటికి దింపినా నామమాత్రమేనని చెబుతున్నప్పటికీ ప్రియాంక గాంధీ ప్రచారంతో ఓట్లు చీలిపోయి తమకు లాభం చేకూరుతుందని కమలం పార్టీ అంచనా వేస్తోంది. పథ్నాలుగు స్థానాల్లో పదమూడింటిని గెలుస్తామన్న ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు.

కుటుంబ విభేదాలే….

ఇక బీహార్ రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ ఆరో విడతలో 18 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏడు స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలున్నారు. ఇక్కడ కూడా ఆర్జేడీ కూటమి బలమైన పోటీ ఇస్తుంది. కానీ లాలూ యాదవ్ కుటుంబంలోని విభేదాలతో పాటు హిందూ ఓటు బ్యాంకును గంపగుత్తగా కైవసం చేసుకునే పనిలో ఉంది కమలం పార్టీ. నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు వెళుతున్నట్లు కనపడుతున్నా మోదీ వ్యూహాలను ఇక్కడ పక్కాగా అమలు చేస్తున్నారు. హిందుత్వ నినాదంతో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఎవరిది పై చేయి…?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కమలం పార్టీ గత వైభవాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ గత లోక్ సభఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని అన్ని లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు. అలాగే ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో తమకు అనుకూలమని బీజేపీ భావిస్తోంది. ఆరో విడతలో జరుగుతున్న మొత్తం 59 స్థానాల్లో ఎవరు అధిక స్థానాలను కైవసం చేసుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Ravi Batchali
About Ravi Batchali 19203 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*