ఛేంజ్….మంచికేనా…?

లోక్ సభ ఎన్నికలకంటే ముండుగా జరిగే రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల కు ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నాయి. అయితే వీటిలో మధ్యప్రదేశ్ లో కొంతవరకూ పార్టీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. కొంత కష్టపడితే మళ్లీ అధికారాన్ని చేపట్టే వీలుంటుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో కూడా మరోసారి అధికారాన్ని చెమటోడ్చి సాధించుకునే వీలుందని కమలం పార్టీ జరిపిన అంతర్గత సర్వేల్లో స్పష్టమవుతోంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సయితం వివాద రహితుడిగా, సమర్థుడైన ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు.

అంతర్గత సర్వేల్లో…..

భారతీయ జనతా పార్టీ జరిపిన అంతర్గత సర్వేల్లో రాజస్థాన్ లోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లు కేంద్ర నాయకత్వం గుర్తించింది. ఒకవైపు ముఖ్యమంత్రి వసుంధర రాజేపై ఉన్న అసంతృప్తి, ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో రాజస్థాన్ ఎన్నికల్లో సమూల మార్పులు చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం రాజస్థాన్ లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన కమలదళం ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలియడంతో అప్రమత్తమయింది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలను….

ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ 160 స్థానాలను గెలుచుకుంది. ఇందులో దాదాపు 60 మంది వరకూ టిక్కెట్లు దక్కవన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సిట్టింగ్ లకే టిక్కెట్లు ఇస్తే ఓటమి ఖాయమని తేలడంతో కొత్త ముఖాలను రంగంలోకి దించి వాటిల్లో కనీసం నలభై స్థానాలనైనా చేజిక్కించుకోవాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కన్పిస్తోంది. దీంతో ఎమ్మెల్యేల్లో దడ ప్రారంభమైంది.

వసుంధరపైన కూడా…..

మరోవైపు గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ట్రంలో గౌరవ్ యాత్ర పేరట పర్యటన చేస్తున్నారు. దీనిపై కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటోంది. వసుంధర రాజే పర్యటన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? యాత్రకు వచ్చే స్పందన ఎలా ఉంది? ప్రభుత్వంపై వ్యతిరేకతా? లేక వసుంధర రాజే పనితీరుపై అసంతృప్తి ఉందా? అన్న సమాచారం కూడా సేకరిస్తున్నారు. దీంతో వసుంధరలో వణుకు ప్రారంభమయిందంటున్నారు. త్వరలో జరగబోయే రాజస్థాన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కమలం పార్టీ అన్ని వ్యూహాలను అమలుపర్చేందుకు సిద్ధమయింది. కాని రాజస్థాన్ లో ఒకసారి విజయం సాధించిన పార్టీ మరోసారి గెలవని పరిస్థితి. ఈసారి ఆ ట్రెండ్ ను కమలనాధులు మారుస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 35928 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*