జగన్ ను కట్టడి చేయాలని

వైసీపీ

అధికార వైఎస్సార్ కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల లెక్కలు తేల్చాలనుకుంటోంది బీజేపీ. ఈరెండు పార్టీలకున్న ప్రధాన బలహీనత కులం. దానినే రాజకీయ తూణీరం చేయాలనుకుంటోంది. ఎడాపెడా ఏదో రకంగా పద్దు తేల్చాలనుకుంటోంది . తన పార్టీ ప్రభ అంతంతమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పాగా వేసేందుకు పక్కాగానే కదులుతోంది. బీజేపీ విజృంభణ తెలుగుదేశానికి మాత్రమే పరిమితమవుతుందని తొలి దశలో అనుకున్నారు. క్రమేపీ అధికారపక్షానికి సవాల్ విసిరేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు అనుసరించనున్న సామాజిక వ్యూహం వైసీపీకి పెద్ద సవాల్ గా పరిణమించబోతోంది. తెలుగుదేశాన్ని, వైసీపీని ఒకే గాటన కడుతూ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న ఎత్తుగడ సంచలనం కలిగిస్తోంది. కులం కార్డును బయటికి తీస్తూ గతాన్ని, వర్తమానాన్ని సరిపోల్చుతూ బీజేపీ విసురుతున్న పాచిక భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోంది. చంద్రబాబు నాయుడి బాటలోనే జగన్ సైతం నడుస్తున్నారంటూ బీజేపీ అగ్రశ్రేణి నాయకులు కులం అస్త్రాలు సంధిస్తున్నారు. కమల దళం త్రిముఖ వ్యూహం రాజకీయ తీరాన్ని చేరుస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చ.

పార్టీకి అటూ ఇటూ…

సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ వైసీపీతో ఎంతోకొంత అవసరముంటుందనే భావనతో రాజకీయ లౌక్యం పాటించింది బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తెలుగుదేశాన్ని కట్టడి చేయడానికే తన శక్తిసామర్థ్యాలను వినియోగించింది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు సమఉజ్జీలుగా తలపడినట్లు కనిపించినప్పటికీ ఫలితం వచ్చేటప్పటికి తెలుగుదేశం బలహీనతలు బట్టబయలైపోయాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం పదిశాతం వరకూ ఉండటం చిన్న విషయంకాదు. అనేక జిల్లాల్లో తెలుగుదేశం ఖాతానే తెరవలేకపోయింది. దాంతో టీడీపీని బలహీనపరిచి తాను బలపడేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఒక చక్కని అవకాశం దక్కింది. ముందుగా పెద్దల సభలోని టీడీపీ రాజ్యసభ పక్షాన్నే విలీనం చేసుకోగలిగింది. ఆర్థిక వ్యవహారాలు, కేసుల విషయంలో వైసీపీ దూకుడు నుంచి రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచంగా బీజేపీ ఉంటుందనే భరోసాతో టీడీపీ నాయకులు క్యూ కట్టారు. కేవలం నాయకులు రావడంతోనే పార్టీ బలపడదు. క్షేత్రస్థాయి బలం, బలగం సమకూర్చుకున్నప్పుడే పార్టీ నిలబడుతుంది. అందుకే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ గణాంకాలపై దృష్టి పెట్టారు. పార్టీ సభ్యత్వాల సంఖ్యను కనీసం 25 లక్షలకు పెంచుకోవాలనేది ఒక లక్ష్యం. అందుకు సరైన ఆకర్షణ జోడించగలిగినప్పుడే నిజమైన కార్యకర్తలు వచ్చి చేరతారు. లేకపోతే మొక్కుబడిసభ్యత్వ నమోదుగా మారిపోతుంది. అంకెలు, పేర్లు తప్ప పనిచేసే పదాధికారుల పత్తా ఉండదు. ఈ లోపాన్ని పూరించుకుంటూ కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది బీజేపీ.

ఇద్దరూ ప్రత్యర్దులే…

సైద్దాంతిక హిందూభావన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముడిసరుకుగా పెద్దగా ఉపకరించదని బీజేపీ పెద్దలకు తెలుసు. కొన్ని వర్గాలు, స్వల్ప సంఖ్యలో ప్రజలకు మాత్రమే పరిమితమైన బీజేపీని అన్నివర్గాల్లోకి చొచ్చుకుని వెళ్లేలా చేయడమే ప్రస్తుతం పార్టీ ముందున్న ప్రథమ కర్తవ్యం. ఇందుకు టీడీపీని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తే లభించే ఫలితం అంతంతమాత్రమే. అందుకే అధికారపార్టీ నుంచి భారీ ఎత్తున వలసలను ప్రోత్సహించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం అధికారం పొందుతున్న వర్గాలు పెద్దగా స్పందించే అవకాశాలు తక్కువ. అందులోనూ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని బీజేపీని నమ్ముకుని ఎగబడి వచ్చే నేతలు అధికారపార్టీలో కనిపించరు. ఈ లోపాన్ని పూడ్చడానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక కార్యాచరణకు సమాయత్తం అవుతోంది. టీడీపీ మరింత బలహీనపడేలోపు వైసీపీకి ప్రత్యామ్నాయంగా తనను తాను ఆవిష్కరించుకోవాలనేది బీజేపీ యోచన. తక్షణం అటువంటి అవకాశం అందిరాదు. దానిని కల్పించుకోవాలి. అందుకు అనుగుణంగా పావులు కదపడం మొదలు పెట్టింది.

వైసీపీపై ముప్పేట దాడి…

అధికారపార్టీని దీటుగా ఎదుర్కోగల సత్తా ప్రతిపక్షానికి లోపించింది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆందోళనలకు, ఉద్యమాలకు సిద్దంగా లేదు. పార్టీలో నిస్తేజం అలుముకుంది. ఆ పాత్రను తాను తీసుకోవాలనుకుంటోంది బీజేపీ. శాంతిభద్రతలు, కార్యకర్తలపై దాడులు అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణను సిద్దం చేస్తోంది. మరోవైపు సామాజిక కార్డును చక్కగా వాడుకోవాలనుకుంటోంది. గతంలో తెలుగుదేశం, ప్రస్తుతం వైసీపీ అధినేతల కులానికి సర్కార్లో పెద్ద పీట అంటూ బీజేపీ గళమెత్తుతోంది. మిగిలిన సామాజిక వర్గాల సంగతేంటంటూ ప్రశ్నిస్తోంది. ఆయా కులాలను తనవైపు ఆకర్షించుకోవాలనే ఎత్తుగడ ఇందులో దాగి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మతానికి కంటే కులానికే ప్రజల్లో ఎక్కువ ఆకర్షణ. అందుకే తమ కులాలకు అన్యాయం జరుగుతోందనే భావనను బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాలనుకుంటోంది. జనాభాలో అత్యధికంగా ఉన్న కులాలకు అధికారం దక్కాలంటే తమ పార్టీయే సరైన వేదిక అన్న బలమైన నమ్మకాన్ని ప్రేరేపించాలని చూస్తోంది.

మరోవైపు ఆర్థిక పరిస్థితి….

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి క్షీణదశలో ఉంది. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మొదలయ్యేటప్పటికి నిధుల కోసం గడగడలాడటం తప్పదు. అభివ్రుద్ధి పనులకు సర్దుబాట్లు ఉండవు. సంక్షేమ పథకాల అమలుకూ సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ అధికారపక్షాన్ని ఇరుకున పెడతాయి. సర్కారుకు స్వతస్సిద్దంగా ఎదురయ్యే సవాళ్లు ఎలానూ ఉంటాయి. ఒకవైపు టీడీపీ నిస్సత్తువతో కుంగిపోవడం, మరోవైపు వైసీపీ సర్కారును సొంత సమస్యలు ఆర్థిక సంక్షోభం రూపంలో అలుముకోవడం, ఇంకోవైపు కులసమీకరణల కార్డుతో ముప్పేట దాడికి కమలం పార్టీ కత్తులు దూయబోతోంది. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక దాడిని షురూ చేయడమూ భాగమే. సూది మొన మోపేంత ఖాళీ దొరికితే సమస్తం సొంతం చేసుకోవచ్చనేదే కదా రాజకీయం. ఆ దిశలోనే నడుస్తోంది ఇప్పుడు కమలదళం. తెలుగుదేశం తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి బీజేపీ నుంచి తనను తాను కాపాడుకోవడానికి పోరు చేయాల్సిన అనివార్యత. వైసీపీ తన అధికారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికీ సమరం సాగించాల్సిందే. ఈ రెండు పార్టీలు తనకు ప్రత్యర్థులే …హెచ్చుతగ్గులు లేవంటున్న బీజేపీ ఇంకెన్ని ఎత్తుగడలు వేస్తుందో వేచి చూడాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 21842 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*