
లోక్ సభ ఎన్నికల్లో తిరిగి విజయం తమదేనన్న ధీమాలో కమలం పార్టీ ఉంది. ఖచ్చితంగా ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను దాటుతామని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. రాష్ట్రాల వారీగా సర్వేలు చేయించుకున్న కమల దళం మ్యాజిక్ ఫిగర్ ను ఈసారి కూడా చేరువ కావడం పెద్దగా కష్టమేదీ కాదని భావిస్తోంది. 2014 లో గుజరాత్ మోడల్ అంటూ దేశ వ్యాప్తంగా 282 పార్లమెంటు స్థానాలను సాధించిన బీజేపీ ఈసారి కూడా అదే రేంజ్ లో సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది.
గత ఎన్నికల మాదిరిగానే…..
ఈసారి దేశభద్రత, అంతర్జాతీయ సంబంధాలతో పాటుగా సంక్షేమ పథకాలు, గత ఐదేళ్లలో అవినీతి ఆరోపణలు లేకపోవడం వంటి వాటితో ప్రజల్లోకి కమలం పార్టీ వెళుతుంది. రాష్ట్రాల వారీగా తమకు అనువుగా లేని చోట పొత్తులు కుదుర్చుకుని, అంతా సవ్యంగా ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగిన కమలం పార్టీ అధికార సాధనకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల వ్యూహాలను కిందిస్థాయిలో పకడ్బందీగా ఆ పార్టీ శ్రేణులు అమలు చేస్తున్నాయి. బీజేపీ అంతర్గత సర్వేల ప్రకారం ఆరు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని తేలింది.
కొన్ని రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్…..
అందిన నివేదికల ప్రకారం బీజేపీ గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఘండ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమాతో కమలం పార్టీ ఉంది. ఢిల్లీలో ఏడు, గుజరాత్ లో 26, జార్ఖండ్ లో 14, ఉత్తరాఖండ్ లో ఐదు, హర్యానాలో పది, హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు స్థానాల్లో విజయం తమదేనన్నది కమలం పార్టీ నేతల అంచనా. ఈ ఆరు రాష్ట్రాల్లో 66 స్థానాలు తమ ఖాతాలో పడతాయని అంచానా వేస్తోంది. మధ్యప్రదేశ్ లోనూ గతంలో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు లేకపోవడంతో 26 స్థానాలను తామే గెలుచుకుంటామంటోంది. మహారాష్ట్రలో ఉన్న 48 స్థానాల్లోనూ శివసనేతో పొత్తు కారణంగా గతంలో గెలిచిన 41 స్థానాలు తిరిగి తమకు దక్కుతాయని ఆశిస్తోంది.
యూపీ, ఛత్తీస్ ఘడ్ లో…..
ఉత్తరప్రదేశ్ లోనూ కొంత ఎడ్జ్ ఉంటుందని కమలం పార్టీ అంచనా వేస్తోది. బీఎస్సీ, ఎస్పీ కూటమి కట్టినప్పటికీ కాంగ్రెస్ 73 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడం తమకు కలసి వస్తుందని లెక్కలు వేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నందున ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని, గతంలో వచ్చినన్ని సీట్లు రాకున్నా అరవై పైగా స్థానాలను మాత్రం గెలుచుకుంటామన్న ధీమాలో ఉంది. ఛత్తీస్ గడ్ లో గతంలో గెలిచిన పది సీట్లనూ గెలుచుకునేది మాత్రం అనుమానమేనని తేలింది. ఛత్తీస్ ఘడ్ పార్టీకి నష్టం జరగవచ్చని అంచనా వేసింది. ఈ నష్టాన్ని ఒడిశాలో పూడ్చుకోగలమన్న ధీమాలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని, మొత్తం మీద గతంలో వచ్చిన మ్యాజిక్ ఫిగర్ ను సులువగా చేరుకుంటామని అంతర్గత సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద మళ్లీ అధికారం తమదేనన్న ధీమా మాత్రం కమలం పార్టీలో కన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply