కమలం ఖాతా తెరవదా?

bharathiyajanathaparty-in-south-states

వచ్చే ఎన్నికల్లో విజయం అనుకున్నంత తేలిక కాదంటూ వస్తున్న వార్తలు, విశ్లేషణలు కమలనాధుల్లో ఆలోచనలను రేపుతున్నాయి.ముఖ్యంగా ఉత్తరాదిన 2014 నాటి విజయం కష్టమేనన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో కలవరం కలిగిస్తున్నాయి. అదే సమయంలో దక్షిణాదిన గడ్డు పరిస్థితులు తప్పవన్న అంచనాలు పార్టీ స్కంధావారాల్లో ఆలోచన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న నష్ట నివారణ చర్యలు ఎంతవరకూ ఫలితాలను ఇస్తాయన్న ఆలోచనల్లో పార్టీ ఉంది. మోదీ గత కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల పరిస్థితిని బూత్ స్థాయి కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. స్ఫూర్తిని కలిగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కొనాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నైరాశ్యంలో ఉన్న క్యాడర్ లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

క్యాడర్ ను ఉత్తేజపరుస్తున్నా…..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కడప, కర్నూలు, నరసరావుపేట, తిరుపతి లోక్ సభ నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. వీటిల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి మాత్రమే గతంలో బీజేపీ ప్రాతినిధ్యం వహించింది. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పునాదులు బలహీనంగా ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కమలంతో కలసి పోటీ చేసే పరిస్థితి లేదు. వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ అధికార తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును నేరుగా ప్రస్తావించకుండా కుమారుడి కోసం ఆయన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. 2014లో విశాఖపట్నం, నరసాపురం స్థానాల్లో పార్టీ నెగ్గింది. టీడీపీ మద్దతు వల్లనే ఇక్కడ విజయం సాధ్యపడిందన్నది వాస్తవం. ఈసారి అలాంటి పరిస్థితి లేదు. విశాఖపట్నం నుంచి ఎన్నికైన కంభంపాటి హరిబాబు పెద్దగా ప్రజాదరణగల నాయకుడు కాదు. మోదీ గాలిలో 2014లో గెలిచారు. ఇప్పుడా పరిస్థితి లేదు. నరసాపురంలో పారిశ్రామికవేత్త , విద్యాసంస్థల యజమాని గోకరాజు గంగరాజు గెలుపొందారు. ఇక్కడ పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టులేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలులో మోదీ మాట మార్చారన్న భావన ప్రజల్లో నెలకొంది. ఈనేపథ్యంలో ఏపీలో ఉన్న రెండు సీట్లు నిలబెట్టుకోవడం అసాధ్యం. ఇక తెలంగాణాలోని సికింద్రాబాద్ నుంచి 2014లో దత్తాత్రేయ ఎన్నికయ్యారు. ఆయన ప్రజాదరణగల నాయకుడు కాదు. కానీ కేంద్రమంత్రి వర్గం నుంచి ఆయనను అర్థంతరంగా తప్పించడం పార్టీకి చేటు కలిగించే పరిణామం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మట్టి కరిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సిట్టింగ్ స్థానాన్ని వదులుకోక తప్పదన్న వాదన వినపడుతోంది.

తమిళనాడులోనూ…..

20 స్థానాలుగల కేరళలో పార్టీ బలం సున్నా. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేరు. అందువల్ల ఈ రాష్ట్రంపై కమలానికి ఎలాంటి ఆశ లేదు. పుదుచ్చేరిలోని ఒకే ఒక సీటు హస్తం పార్టీది. దీనిపై కూడా కమలానికి ఎలాంటి అంచనాలు లేవు. 39 స్థానాలు గల తమిళనాడులో 2014లో ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. కన్యాకుమారి నుంచి విజయం సాధించిన పి.రాధాకృష్ణన్ ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే కమలానికి దూరంగా ఉంటామని ప్రకటించాయి. అన్నాడీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్ సభ ఎన్నికల్లో కూటమికి పాత మిత్రులకు సయితం ద్వారాలను తెరిచి ఉంచామని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ ద్రవడి పార్టీల్లో ఒకటైన అన్నాడీఎంకే తన నిర్ణయాన్ని వెల్డడించాల్సి ఉంది. అన్నాడీఎంకేకు ఇక్కడ నాయకత్వ లేమి కారణంగా దానితో కలసి పోటీ చేసినా ప్రయోజనం లేదు. దీంతో ద్రవిడ రాష్ట్రంలో కమలానికి చోటు లేనట్లే. 2014లో గెలిచిన కన్యాకుమారి స్థానం పైనా నీళ్లు వదులుకోవాల్సిందే. పార్టీ దానిని జీర్ణించుకోలేకపోతోంది.

కర్ణాటక ఆశాకిరణం…..

దక్షిణాదిలో కమలానికి ఏకైక ఆశాకిరణం కర్ణాటక. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను బీజేపీ గత ఎన్నికల్లో గణనీయంగా 17 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారీ అదే ధీమాను వ్యక్తం చేస్తుంది. గత ఏడాది మేనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమంటోంది. 106 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని, ఇది 17 లోక్ సభ స్థానాలకు సమానమని చెబుతోంది. అయితే 2014 నాటి పరిస్థితి ఉండబోదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అప్పట్లో కాంగ్రెస్, జేడీఎస్ విడివిడిగా పోటీ చేసినందున కమలం లబ్ది పొందగలిగింది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. రేపటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేస్తే కమలానికి కష్టాలు తప్పవు. మొత్తం మీద 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42, కర్ణాటకలో 28,
కేరళలో 20, పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడులో 39 మొత్తం 130 స్థానాలకు ఉమ్మడి ఏపీలో మూడు, తమిళనాడులో ఒకటి, కర్ణాటకలో 17 స్థానాలు వచ్చాయి. ఈసారి కర్ణాటక తప్పితే మిగిలిన చోట్ల ఖాతా తెరిచే పరిస్థితి లేదు. కర్ణాటకలో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశముంది. ఈ విషయం కమలనాధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 32298 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*