
అదేంటి? బొబ్బిలి యుద్ధం గురించి తెలుసుకానీ.. భీమిలి యుద్ధం ఏంటని ఆశ్చర్యంగా ఉందా?! అక్కడకే వద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ అధికార టీడీపీ నేత, మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఇక్కడ గట్టి పట్టు కూడా ఉంది. తన సత్తా చాటుతున్నారు కూడా. అయితే, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రత్యర్థులు ఎప్పుడూ విపక్షాల్లోనే ఉండరని అన్నట్టుగా మంత్రి గంటాకు ప్రత్యర్థులు కూడా సొంత పార్టీలోనే తయారవుతున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో గెలుపొందిన ప్రస్తుత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ(భీమిలి) నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆయన రీజన్లు ఆయనకు….
దీనికిగాను ఆయనకు ఉండే రీజన్లు ఆయనకు ఉన్నాయి. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారు. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏదీ కూడా నెరవే రలేదు. ప్రధానంగా విశాఖకు రైల్వే జోన్ తెస్తానని హడావుడి చేసినా.. ఇప్పటికీ దానిని సాధించలేక పోయారు. అదేవిధం గా బోదకాలు పీడిత గ్రామాల్లో తాగు నీటిని అందించలేక పోయారు. తన విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకున్నాడనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, పార్టీలో అధినేత చంద్రబాబు వద్ద కూడా పెద్దగా పని జరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అవంతి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో నిలబడినా.. గెలిచే పరిస్థితి ఉండదని అంటున్నారు.
గతంలో తాను పోటీ చేసి గెలిచిన….
దీనిని ముందుగానే అంచనా వేసిన అవంతి.. గతంలో తాను పోటీ చేసి గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గం భీమిలి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇక్కడ గంటా మళ్లీ పోటీ చేసి గెలవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన పరివారం మొత్తాన్ని నియోజకవర్గంలో అణువణువునా తిప్పుతున్నారు. చాపకింద నీరులా ఆయన తన పరిస్థితిని తెలుసుకుని ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని గమనిస్తున్న అవంతి.. తన నియోజకవర్గంపై తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గంటాను ఢీ అంటే ఢీ అనేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇటీవల మంత్రి గంటా ఆధ్వర్యంలో రైల్వేజోన్‌తోపాటు ఇతర విభజన హామీల సాధన సమితి ఏర్పాటు కోసం భేటీ జరిగింది.
తాను ప్రత్యేకంగా జోన్ కోసం….
దీనికి వివిధ ప్రజాసంఘాల నేతలు, రాజకీయపార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే అవంతి శ్రీనివాస్ మాత్రం డుమ్మా కొట్టడమే కాకుండా.. తనంతట తానుగా వెళ్లి రైల్వేజోన్ కోసం రైల్వేస్టేషన్ లోనే మెరుపు దీక్ష చేపట్టారు. జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గట్టిగా ఫైర్ అయ్యారు. ఇలా తనకంటూ ప్రత్యేకతను చాటుకునే క్రమంలో మంత్రి గంటాకు షాక్ ఇచ్చేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. మరి దీనిపై అదినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Leave a Reply