కొలనులోకి లాగేసింది

బీజేపీ

భారతీయ జనతాపార్టీ ఒక సైద్దాంతిక అజెండాను ముందు పెట్టి అన్ని పార్టీలనూ ఆ ముగ్గులోకి లాగుతోంది. తన కేంద్ర స్థానమైన తామర కొలనులోకి తామరతంపరగా నేతలను లాగేసుకుంటోంది. ఇంతవరకూ గంపగుత్తగా పడే మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే చాలనుకున్న రాజకీయ పక్షాలు తమ పంథా మార్చుకుంటున్నాయి. మెజార్టీ ఓటర్లు కమలం గూటికి చేరకుండా ఉండాలంటే తాము కూడా హిందువులమని చాటి చెప్పాల్సిందేననుకుంటున్నారు. నిన్నామొన్నటి వరకూ హిందువుల ఓట్ల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టని నాయకులు ఇప్పుడు పరమభక్తిని చాటుకుంటున్నారు. నేనూ మీ వాడినే అని చెప్పడానికి పోటీలు పడుతున్నారు. బీజేపీ విసిరిన మత భావనల వలలో విలవిలలాడుతున్నారు. మరో పక్క మైనార్టీలు దూరమవుతారేమోననే శంక వెంటాడుతూనే ఉంది. అయినా మెజార్టీ ఓట్లు బీజేపీ వైపు సంఘటితమైతే సమస్యాత్మకమని గుర్తిస్తున్నారు. ఏతావాతా దేశ రాజకీయ చిత్రపటంలోనే అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన అజెండాను అన్ని పార్టీల అజెండాగా మార్చడంలో భారతీయ జనతపార్టీ సక్సెస్ సాధిస్తోంది. అయితే అందరూ అదే పాట పాడితే ఫలితం ఏమిటన్న అంశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఓట్ల రాజకీయంలో వైవిద్యం కంటే అన్ని పార్టీలూ ఒకేతాను ముక్కలై ప్రవర్తించడమే విచిత్రం. మమతా బెనర్జీ తాను చండీమంత్రం చదవనిదే రోజూ ఇంటినుంచి అడుగే బయటపెట్టనని ప్రకటించారు. బీజేపీ నాయకులకు ఈ మంత్రాలే తెలియవని ఎద్దేవా చేశారు. గతంలో అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసాతోనే తన విధినిర్వహణ మొదలవుతుందని చెప్పేశారు. రాహుల్ గాంధీ శివభక్తునిగా చెప్పుకుంటూ రుద్రాక్షతోపాటు జంధ్యం వేసుకుని గుడులు , గోపురాలు తిరిగేశారు.

వామపక్షాలూ వాడిపోయాయి..

ఒకప్పుడు వామపక్షాలు మతం పేరు చెబితే మండిపడుతుండేవి. మైనార్టీలను మాత్రం దువ్వుతుండేవి. పశ్చిమబంగ, కేరళలో అధికారంలో కొనసాగడానికి ముస్లిం ఓటింగు వామపక్షాల వైపు పూర్తి మొగ్గు కనబరచడమే కారణంగా ఉంటూ వచ్చింది. ఆ ఓటింగును మమతా బెనర్జీ కొల్లగొట్టేసింది. తాను మైనారిటీల సంరక్షురాలి పాత్రలోకి మారిపోయింది. ఫలితంగా పెద్ద రాష్ట్రమైన బెంగాల్ లో నామమాత్రావశిష్టంగా తయారయ్యాయి వామపక్షాలు. అంతకుముందు హిందూ ఓటింగు పట్ల కనబరచిన నిర్లక్ష్యం కారణంగా ఆ వర్గాల ప్రజలు కమ్యూనిస్టులను దూరం పెట్టేశారు. ఫలితంగా రెంటికీ చెడ్డ రేవడిగా తయారై జాతీయ పార్టీ హోదాకే ముప్పుతెచ్చుకున్నాయి సీపీఐ, సీపీఎం. కేరళలో ఇంకా మైనారిటీల మచ్చిక చర్యలు కొనసాగిస్తూ ఫలితం రాబడుతున్నాయి. అయితే హిందూ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయనే భావన పెరిగింది. దీంతో మెజార్టీ మత విశ్వాసాల పట్ల గతంలో ఎన్నడూ లేనంత సానుకూలత కనబరుస్తున్నాయి వామపక్షాలు. తమ భావజాలాలకు అనుగుణంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా రాజకీయ కారణాలతో అమలు చేయడం లేదు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై మత విశ్వాసాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సాధారణ పరిస్థితుల్లో అయితే దీనిని అందిపుచ్చుకుని వీరంగం చేయడానికి సిద్దమైపోయి ఉండేది కమ్యూనిస్టు ప్రభుత్వం. కానీ ప్రజల్లో పెరుగుతున్న మత బావనలు, పశ్చిమబెంగాల్ లో తాము దెబ్బతిన్న పరిస్థితులు గుర్తుకు వచ్చాయి. దాంతో కోర్టు తీర్పు పై మౌనం వహించి సంప్రదాయాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులైతే చెప్పనే అక్కర్లేదు. కొందరు గుడులు, గోపురాలు తిరిగి వస్తున్నారు. మఠాధిపతులతో మాటామంతీ కలుపుతున్నారు. ఇంకొందరు దొడ్డిదారిన మతంలో నెమ్మదిగా ప్రవేశిస్తున్నారు. ఇందుకు గ్రామదేవతలను ఆసరాగా చేసుకుంటూ జానపద సంప్రదాయాన్ని సాకుగా చూపుతున్నారు. వామపక్ష సైద్దాంతిక బలం వీగిపోయి సాఫ్ట్ హిందుత్వ ధోరణికి వచ్చేస్తున్నాయి.

కాంగ్రెసు కాసింత తగ్గింది..

ఏ ఎండకాగొడుగు పట్టడంలో కాంగ్రెసు పెద్దలు ఎప్పడూ ముందే ఉంటారు. దశాబ్దాలుగా ఎస్సీ,ఎస్టీ, ముస్లిం ఓట్లు ఆపార్టీకి పెట్టని కోటగా ఉంటూ వచ్చాయి. ఈ బలాన్ని, బలగాన్ని చూసుకుంటూ మెజార్టీ వర్గాలకు చెందిన ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఫలితంగా బీజేపీ వంటి పార్టీ ఊపిరిపోసుకుని అత్యంత వేగంగా దేశంలో వేళ్లూనుకుంది. చేతులు కాలాక అన్నట్లుగా ఇప్పుడు హిందూ జపం పఠిస్తున్నారు. రాహుల్ గాంధీ హయాంలోకి వచ్చాక పరిస్థితులు దిగజారి కనిపించాయి. శాశ్వతంగా హిందువులు పార్టీకి దూరమైపోతున్నారని అంతర్గత నివేదికలు చాటి చెప్పాయి. ఈ నేపథ్యంలో తాము హిందువులమన్న భావనను ప్రజల్లోకి పంపేందుకు రాహుల్ శ్రమపడుతున్నారు. ప్రియాంక, సోనియాలను పక్కనపెట్టి తనవరకూ తాను హిందువునని చెప్పుకోవడానికి రాహుల్ మనసా,వాచా, కర్మణా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు పూర్తిగా దీనిని విశ్వసిస్తున్నారా? అంటే సందేహమే. పశ్చిమబెంగాల్ లో వామపక్షాలతో పాటు ముస్లిం పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏదేమైనా అటు ఇటు కాని ఊగిసలాటలో కాంగ్రెసు కనిపిస్తోంది. బీజేపీని కట్టడి చేయడానికైనా హిందూ స్టాండ్ తీసుకోవాల్సిందేనని పార్టీలోని మెజార్టీ వర్గం గట్టిగా పట్టుబడుతోంది.

తెలంగాణ అనుభవం..

అందరూ మత విశ్వాసాలకు పెద్దపీట వేస్తున్నారు. హిందూ ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ద్రవిడ సిద్దాంతాల ప్రాతిపదికగా పుట్టిన డీఎంకే, అన్నాడీఎంకే సైతం తమిళనాట భక్తి భావాల భజన మొదలుపెట్టాయి. తీర్థయాత్రలకు డబ్బులు ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికల్లోనే చెప్పేస్తున్నాయి. అందరూ అదే బాట పడితే ఎవరిని ప్రజలు ఎన్నుకోవాలనేది సమస్య. ఇందుకు తెలంగాణ అనుభవం అద్దం పడుతుంది. నిజానికి 2009 నాటికే ఉమ్మడి రాష్ట్రంలోని అన్నిపార్టీలు , సీపీఎం మినహా జాతీయపార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. రాష్ట్రప్రతిపత్తిని తానే కల్పిస్తున్నాను కాబట్టి ఇక్కడ తన అధికారం శాశ్వతంగా స్థిరపడుతుందని కాంగ్రెసు కలలు కన్నది. అయితే రాష్ట్ర అజెండాను ముందుకు తెచ్చి సమస్య సాధనకు, శాశ్వత పరిష్కారానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితినే ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆ పార్టీకి అంతవరకూ లేని బలాన్ని కల్పించారు. ఇప్పుడు తెలిసో, తెలియకో, తాము వెనకబడి పోతున్నామనే భయంతోనో బీజేపీ అజెండాను అన్ని పార్టీలు భుజాలపై మోస్తున్నాయి. ఇంతవరకూ తాము ఉదాసీనంగా ఉన్నామని పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఇది బీజేపీకి బలం చేకూరుస్తుంది. కొత్తగా సైద్దాంతిక అజెండాకు సై అంటున్న పార్టీలకు కలిగే లాభం శూన్యం. అన్ని పార్టీలు మత భావనలు రగిలిస్తే అంతిమంగా ప్రయోజనం పొందేది భారతీయ జనతాపార్టీ మాత్రమే.

 

– ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 37358 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*