
దేశ రాజకీయం దక్షిణాదిన కేంద్రీకృతమైంది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ, కావేరిజలాల బోర్డు కోసం పోరాడుతున్న తమిళనాడు, కర్ణాటక ఎన్నికలు.. ఇలా దక్షిణాదిన రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండడం గమనార్హం. ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రం కేంద్రప్రభుత్వంపై పోరాడుతున్నాయి. నాలుగేళ్ల పాటు ఎన్డీయే కూటమిలో ఉంటూ కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన టీడీపీ బయటకు రావడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, స్నేహపూరిత వాతావరణంలో ఉన్నకేసీఆర్ ఒక్కసారిగా కేంద్రంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి.
అన్నాడీఎంకే సయితం….
మరోవైపు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కూడా కావేరి జలాల బోర్డు విషయంలో ఏకంగా కేంద్రప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు చేయడంతో దక్షిణాదిన కమలదళం ఏకాకిగా మిగిలిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇక్కడ కూడా బీజేపీ కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకుంటోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజకీయ చతురతతో కమలదళానికి చుక్కలు చూపిస్తున్నారు. శివసేన కూడా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. జేడీఎస్ కూడా సత్తాచాటేందు కసరత్తు చేస్తోంది. ప్రముఖ హీరో సుదీప్‌ను బరిలోకి దించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గాలికి సంబంధం లేదంటూ….
మరోవైపు బీజేపీతో మాజీ మంత్రి గాలిజనార్దన్రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో బళ్లారి పరిసర నియోజకవర్గాల్లోని గాలి అనుచరవర్గంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకవేళ గాలి జనార్దన్‌రెడ్డి విషయంలో మొండివైఖరితో ఉంటే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బతప్పదని పలువురు నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న తాము అవినీతి, అక్రమాల కేసులో రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి వచ్చిన గాలి జనార్దన్‌రెడ్డికి టికెట్ ఇస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదనే ఆలోచనలో అమిత్‌షా ఉన్నట్లు పలువురు నాయకులు భావిస్తున్నారు.
ఎక్కడ చూసినా అంతేనా?
ఇప్పటికే వచ్చిన ప్రీ పోల్ సర్వేలు కూడా కన్నడ నాట కమల వికాసం కష్టమని చెప్పడంతో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలో కేంద్రం నిర్ణయంతో ఆ పార్టీ ఇక్కడ కాంగ్రెస్-2 అయిపోయేలా ఉంది. తెలంగాణలో కేసీఆర్ కమలాన్ని నలిపేస్తున్నారు. తమిళనాడులో తాజా నిర్ణయంతో డిజాస్టర్ అయ్యింది. కర్నాటకలో గెలిపు కష్టంగానే ఉంది. కేరళలో ఆ పార్టీకి ఎంట్రీయే లేదు. ఈ లెక్కన చూస్తే దక్షిణాదిన ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఎదురుదెబ్బతప్పదని పలువురు నాయకులు చెబుతున్నారు.
Leave a Reply