
తండ్రి మూడు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1989 నుంచి వరుసగా జరిగిన ఆరు ఎన్నికలలో ఒక్క 2004లో తప్ప మిగిలిన అన్నిసార్లూ గెలుపు ఆయనదే. ఆయనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. 2004లో మాత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఎన్సీవీ నాయుడు గెలిచారు. దాదాపు ఐదు సార్లు గెలిచిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన తనయుడు బొజ్జల సుధీర్ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
సుధీర్ అభ్యర్థి కావడంతో…..
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైసీపీ తరుపున బియ్యపు మధుసూదనరెడ్డి పోటీలో ఉన్నారు. బొజ్జల ఈ ఎన్నికల్లో గెలిచినా మెజారిటీ ఏడువేల ఓట్లు మాత్రమే. బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచిపేరుంది. ఆయన అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి కావడంతో ప్రజలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి జై కొడుతూ వస్తున్నారు. ఈసారి అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉండటం కొంత ఆ కుటుంబానికి ఇబ్బందేనని చెప్పాలి. ప్రస్తుత అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి యువకుడు కావడంతో ఎవరినీ కలుపుకునే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలున్నాయి.
తండ్రి చేతిలో ఓటమిపాలయినా….
వైఎస్సార్ కాంగ్రెస్ అబ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి గత ఎన్నికలలో నియోజకవర్గంలో 82,370 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ ఇక్కడ బలంగా ఉన్నట్లే లెక్క.గత ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆయనపై కొంత సానుభూతి ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా ప్రజల్లోనే తిరుగుతున్నారు.ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. వైసీపీని నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ పాదయాత్ర తనను ఈసారి ఖచ్చితంగా విజయతీరాలకు చేరుస్తుందన్న ఆశతో ఉన్నారు. తండ్రి చేతిలోనే తాను స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యానని, కొడుకును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ధీమాలో ఉన్నారు బియ్యపు.
ఎన్సీవీ ఎదురు తిరిగితే….
ఇక సుధీర్ రెడ్డికి మరో ఇబ్బంది కూడా ఉంది. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత ఎన్సీవీ నాయుడు రేపోమాపో నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి శ్రీకాళహస్తి టిక్కెట్ ఎస్సీవీ నాయుడికే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నారు. బొజ్జల ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఎన్సీవీకి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అయితే చివరి నిమిషంలో బొజ్జల వత్తిడికి తలొగ్గి సుధీర్ కు ఇచ్చారు. ఇప్పుడు ఎన్సీవీ నాయుడు ఎవరికి మద్దతిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బొజ్జల తన కాంట్రాక్టు పనుల్లో ఇబ్బంది పెట్టారని, ఆయనకు సహకరించేది లేదని ఎన్సీవీ చెబుతున్నారు. మరి ఎన్సీవీ ఎదురు తిరిగితే బొజ్జల సుధీర్ విజయం అంత ఈజీ కాదన్నది స్పష్టం.
Leave a Reply