బొత్సకు ఉక్కబోత ఎక్కువైందా…??

bostha-satyanarayana-minister-of-andhrapradesh

బొత్సది ఈనాటి రాజకీయం కాదు, ఆయన నాలుగు దశాబ్దాల నుంచి అట్టడుగు కాంగ్రెస్ కార్యకర్తగా, డీసీసీబీ విజయనగరం జిల్లా అధ్యక్షునిగా, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఇలా ఎన్నో పదవులు నిర్వహించిన నాయకుడు. పీసీసీ చీఫ్ గా కూడా పనిచేసిన బొత్స ఓ దశలో కాంగ్రెస్ జమానా చివరి రోజుల్లో ముఖ్యమంత్రి రేసులో కూడా ప్రముఖంగా కనిపించారు. కాంగ్రెస్ విభజనతో కొట్టుకుపోగా పునాది గట్టిగా ఉండబట్టి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రా జిల్లాల్లో తన ప్రాభవాన్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు. బొత్స అరవయ్యేళ్ళకు పైబ‌డిన వారు. జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. అటువంటి బొత్సకు ఇపుడు సరైన ప్రాధాన్యత లభిస్తోందా అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.

నాటి హవా ఏదీ….?

బొత్స జగన్ పార్టీలో చేరడానికి ముందు కాంగ్రెస్ లో ఉంటూ చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక విజయనగరం జిల్లాలో ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే వేరే పార్టీలోకి వెళ్ళడమే శరణ్యమని భావించి వైసీపీని ఎంచుకున్నారు. జగన్ సైతం అప్పట్లో సీనియర్ల రాకను స్వాగతించారు. పార్టీ ఓ వైపు తృటిలో అధికారం కోల్పోయి నేరాశ్యంలో ఉన్న వేళ బొత్స వంటి సీనియర్లు రాకతో ఉత్తరాంధ్రలో జాతకం మారుతుందని అంచనా వేశారు. అనుకున్నట్లుగానే బొత్స రాకతో నోరున్న నేత ఆ పార్టీ ఉత్తరాంధ్రకు దొరికారు. బొత్స సైతం తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ జగన్ మన్ననలు అందుకున్నారు. ఓ దశలో బొత్స పార్టీలో నంబర్ 2 అన్నంతగా వైసీపీలో ఎదిగారు. అయితే 2016లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన విజయసాయిరెడ్డి రంగప్రవేశంతో బొత్సకు నెమ్మదిగా నంబర్ 2 స్థానం మారిపోయింది. జగన్ కి కుడి భుజంగా విజయసాయిరెడ్డి చురుకైన పాత్రలో కుదురుకుపోయారు. ఆ తరువాత విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలను చూసే బాధ్యత కూడా అప్పగించడంతో బొత్స మరింత తగ్గిపోయినట్లైంది. ఇక విజయనగరం జిల్లా వరకూ మాత్రం బొత్స తన పట్టుకుని నిరూపించుకోగలిగారు. తాజా ఎన్నికల్లో ఎక్కువ టికెట్లను తన వారికి ఇప్పించుకోవడమే కాకుండా జిల్లాలో మొత్తానికి మొత్తం తొమ్మిది సీట్లను గెలుచుకోవడానికి బొత్స ప్రధాన కారణమయ్యారు.

గుంపులో గోవిందం…

ఇక జగన్ మంత్రివర్గంలో బొత్సకు కీలకమైన శాఖలే దక్కాయి. అయినా ఆయన ఆశించినట్లుగా డిప్యూటీ సీఎం పదవి లభించలేదు. హోం, రెవిన్యూ వంటి శాఖల మీద ఆశపడినా కూడా కుదరలేదు. ఇక ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం గా ఉన్న పుష్ప శ్రీవాణికే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. రేపటి ఆగస్ట్ 15న జెండా వందనం కూడా ఆమె డిప్యూటీ సీఎం హోదాలో చేస్తారు. ఇవన్నీ ఇలా వుంటే మంత్రి పదవి ఇచ్చిన జగన్ చేతులను కట్టేశారు. స్వేచ్చ ఇచ్చినట్లే ఇచ్చి ఆశ్రిత పక్షపాతం వద్దని గట్టిగా చెప్పారు. మంత్రుల స్థాయిలో తప్పులు పొరపాట్లు ఏవైనా జరిగినా బాధ్యత మీదేనంటూ గట్టిగానే హెచ్చరించారు. పదేళ్ళ తరువాత వచ్చిన మంత్రి పదవి చేతిలో ఉన్నా పాధాన్యత బాగా తగ్గిపోవడం, నలుగురితో నారాయణ అన్నట్లుగానే పరిస్థితి ఉండడం వంటివి చూసుకుంటే బొత్సకు క్యాబినెట్లో ఉక్కబోత బాగానే ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఆయన మీడియాకు చిక్కకుండా సైలెంట్ గా ఉండడం వెనక మర్మమేంటన్నది కూడా చూడాలి మరి.

Ravi Batchali
About Ravi Batchali 16633 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*