
రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదు.. ఎన్ని పదవులు అనుభవించాం.. ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచాం.. అన్నదే అసలు సిసలు వ్యవహారం. ఆపార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా పార్టీలున్నది అధికారం కోసమే అని ప్రతి ఒక్క నేతా చెప్పేదే. ఇప్పుడు ఇదే విషయంలో తమ వంతు పాత్రను పోషించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ.. కొందరు సీనియర్లకు సరైన పాత్ర లభించడం లేదు. దీంతో వారు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నిలు సహా సార్వత్రిక ఎన్నికలపై తీవ్రమైన ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి కలిసి వస్తున్న అంశం.. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడం! అనివార్య పరిస్థితిలోనే తాము బీజేపీ నుంచి విడిపోవాల్సి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.
ఇక్కడ మాత్రం సంబరాలే…..
ఇక, బీజేపీ నేతలు కూడా టీడీపీ నుంచి విడిపోవడంపై స్పందించారు. కానీ, బీజేపీతో తాము విడిపోవడంపై ఎవరు ఎలా స్పందిస్తున్నా.. పశ్చిమ గోదావరిలో టీడీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ సీనియర్లుగా ఉన్న నేతలు సైతం గత ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం.. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడమే. ముఖ్యంగా గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసిన పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం, నరసాపురం ఎంపీ స్థానాలపై టీడీపీ నేతలు ఆశలు పెంచుకు న్నారు.
పొత్తులో భాగంగా…..
అయితే, అప్పటి రాజకీయ బంధాలు, మిత్ర పక్షం, మిత్రధర్మం వంటి వాటి కేటాయింపుల నేపథ్యంలో ఈ రెండు టికెట్లను చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. అసెంబ్లీ స్థానంలో పైడికొండల మాణిక్యాలరావును, లోక్‌సభ స్థానంలో గోకరాజు గంగరాజును ఆ పార్టీ నిలబెట్టింది. ఈ క్రమంలో చంద్రబాబు పిలుపు అందుకున్న టీడీపీ క్యాడర్ మొత్తం బీజేపీ సభ్యులకు మద్దతుగా నిలిచింది. దీంతో పైడికొండల, గంగరాజులు తేలిగ్గానే గెలుపొందారు. అనంతర పరిణామాల నేపథ్యంలో మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కడంతో..ఇక బీజేపీలో అత్యుత్సాహం పెరిగిపోయింది.
తొలి నుంచి అంతర్గత పోరు….
ఇదంతా నరేంద్ర మోడీ చలవేనంటూ గొప్పలు చెప్పుకున్నా రు. ఏపీలో టీడీపీని కానీ.. ఆ పార్టీ నాయకులను కానీ లెక్కచేయడం మానేశారు. దాంతో రెండు నియోజకవర్గాలలోనూ టీడీపీ- బీజేపీ క్యాడర్ల మధ్య అంతర్గత పోరు మొదలైంది. తాడేపల్లిగూడెంలో అయితే చెప్పనే అక్కర్లేదు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు.. మాజీ మంత్రి మాణిక్యాలరావుకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇదిలావుంటే, ఇప్పుడు టీడీపీ-బీజేపీల మధ్య బంధం బెడిసి కొట్టింది. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడం అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే 2014 ఎన్నికలప్పుడే జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆ సీటుపై కన్నేశారు. కానీ మిత్రధర్మంలో భాగంగా టీడీపీ అధిష్టానం ఆ సీటును బీజేపీకి కేటాయించింది. దాంతో ఆయన ఆశలు వదులుకోవలసి వచ్చింది. అయితే, ఇప్పుడు బీజేపీతో పొత్తు చెడిపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తనకే కేటాయించాలని బాపిరాజు డిమాండ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.
ఎంపీ సీటు ఎవరికి?
ఇక బీజేపీ నేత గోకరాజు గంగరాజు ప్రాథినిత్యం వహిస్తోన్న నరసాపురం ఎంపీ సీటు కూడా ఇప్పుడు టీడీపీలో ఎవరికి ఇస్తారన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ ఎంపీ సీటు విషయంపై టీడీపీ నేతల్లో తర్జన భర్జన కొనసాగుతోంది. ఇక్కడ దీనిపైనా ఆశలు పెట్టుకున్న వారు లేకపోలేదు. అయితే, బాబు ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి బీజేపీ వెళ్లిపోవడంతో ఆనందిస్తున్న తమ్ముళ్లు.. సీట్ల విషయంలో కన్ఫర్మేషన్లపై దృష్టి పెట్టడం గమనార్హం.
ఈ సీట్ల కోసం….
ఇక కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాథినిత్యం వహిస్తోన్న కైకలూరులో కూడా టీడీపీ సీటు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆశిస్తున్నారు. మరో టాక్ ఏంటంటే కామినేనే టీడీపీలోకి వచ్చేస్తారంటున్నారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చిన విజయవాడ వెస్ట్ సీటుపై ఇప్పుడు పలువురు టీడీపీ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో నరసారావుపేట ఈ సారి కోడెల ఫ్యామిలీ ఆశిస్తోంది. ఇక తూర్పులో రాజమండ్రి అర్బన్ సీటును ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆశిస్తోంది. విశాఖ ఎంపీ సీటు కోసం ఎంవీఎస్.మూర్తితో పాటు పలువురు రేసులో ఉన్నారు. అలాగే విష్ణకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ కోసం క్యూలో ఉన్న టీడీపీ లీడర్లకు లెక్కే లేదు. ఏదేమైనా బీజేపీతో పొత్తు బ్రేకప్‌తో టీడీపీ లీడర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Leave a Reply