
బుట్టా రేణుక.. వైసీపీ గుర్తుమీద కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిన బుట్టా రేణుక కొద్దికాలం క్రితం వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు. విద్యాసంస్థలు, వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన బుట్టారేణుక బీసీ కోటాలో గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ను పొందారు. అయితే ఈసారి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బుట్టా రేణుక పోటీ చేస్తారా? లేక ఆమెకు వేరే పదవి ఇస్తామని టీడీపీ అధిష్టానం బుజ్జగించనుందా? ఇదే చర్చ ప్రస్తుతం టీడీపీలో జరుగుతుండగా బుట్టారేణుకలో మాత్రం టెన్షన్ ప్రారంభమయిందనే చెప్పాలి. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు.
అధికార పార్టీలోకి మారినా…..
కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా బుట్టా రేణుక ఈ నాలుగున్నరేళ్లలో పెద్దగా పనులు సాధించలేకపోయారు. దీంతో అధికార పార్టీలోకి వస్తే పనులు సులువగా అవుతాయని భావించి ఆమె జంప్ చేశారు. కానీ అధికార పార్టీలోకి వచ్చినా నిధుల సమస్యతో ఆమె ప్రతిపాదించిన పనులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. దీంతో పాటు కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న ఒకే ఒక కుటుంబం కోట్ల ఫ్యామిలీ మాత్రమే.
కోట్ల మాత్రం జనంలో…..
వచ్చే ఎన్నికల్లో తాను కర్నూలు ఎంపీగా బరిలో ఉండనున్నట్లు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పటికే పలు సమావేశాలు, సభల్లో ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా కోట్లకు మించి ఆప్షన్ ఇక్కడ లేదు. బలమైన నేత, ముఖ్యమైన సామాజికవర్గం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వంటివి కోట్లకు పెట్టని కోటలు. తాజాగా ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని రాహుల్ చెప్పకనే చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్థానాలను తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని కూడా ఏపీ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
బాబు వద్ద ఆప్షన్ ఏంటి?
అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ కోరుకునే తొలి ఎంపీ సీటు కర్నూలు మాత్రమే. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కోసం కర్నూలు సీటు ఫిక్సయిందన్న వార్తలు హస్తినలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో బుట్టా రేణుక టెన్షన్ లో ఉన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇటీవల పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం, తానే ఎంపీఅభ్యర్థినని ప్రకటించడం, మరోవైపు పొత్తులపై సంకేతాలు వెలువడుతుండటంతో బుట్టా తన పరిస్థితిపై చంద్రబాబునే అడిగేందుకు సిద్ధమయ్యారట.అయితే కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే కర్నూలు ఎంపీ సీటు ఆ పార్టీకే వదలేయాలని చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బుట్టాకు చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభిస్తుందన్నది వేచి చూడాలి.
Leave a Reply