
తొలిసారి గెలిచారు. పార్టీ మారారు. అభివృద్ధికోసమే తాను మారానని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ నేత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆమె కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక. బుట్టా రేణుక గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు. అయితే తొలుత బుట్టా వైసీపీలోనే ఉన్నారు. బుట్టా భర్త నీలకంఠం అధికార తెలుగుదేశం పార్టీలోచేరినప్పటికీ ఆమె మాత్రం వైసీపీలోనే ఉన్నారు. వ్యాపారాలు ఉండటంతో నీలకంఠం టీడీపీలో చేరారన్న వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర ముందు బుట్టా రేణుక కూడా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందేమోనని భావించే ఆమె ముందు జాగ్రత్తగా పార్టీలోకి లేట్ గా జంప్ చేశారు.
ఎంపీగా నో ఛాన్స్….
అయితే ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్న రేణుకకు ఈసారి టిక్కెట్ దక్కే ఛాన్స్ లేదంటే లేదు. ఇందుకు ప్రధాన కారణం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతుండటంతో ఆయనకు కర్నూలు ఎంపీ టిక్కెట్ ఖాయమని తేలిపోయింది. మరి బుట్టా రేణుకకు ఏ పదవి ఇస్తారు? పార్టీ మారినందుకు రేణుకకు ఇచ్చే నజరానా? ఇదేనా? అని ఆమె వర్గీయులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బుట్టా రేణుక నిజానికి ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించారు. వైసీపీలో ఉన్నప్పుడే తన మనసులో మాటను జగన్ ముందుంచారు. అయితే జగన్ ఇందుకు అంగీకరించకపోవడంతోనే పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఎమ్మెల్యే టిక్కెట్ కూడా….
తీరా పార్టీ మారిన తర్వాత ఇప్పుడు ఎంపీ టిక్కెట్ బుట్టాకు రాదని దాదాపుగా తేలిపోయింది. ఇక ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందా? అన్న ఆశ కూడా చిగురించేలా లేదు. బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరినప్పిటి నుంచే ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ పై కన్నేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా అక్కడ వెచ్చిస్తూ ఎమ్మిగనూరు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. బుట్టా రేణుక చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు. ఎమ్మిగనూరులో ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ స్ట్రాంగ్ అయిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు.
రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ…..
ఎమ్మిగనూరు ప్రస్తుత ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి మాజీ బి.వి.మోహన్ రెడ్డి కుమారుడు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి బివి కుటుంబం తెలుగుదేశంలోనే ఉంటూ వస్తోంది. అలాంటి కుటుంబాన్ని కాదని టీడీపీ అధినేత చంద్రబాబు బుట్టా రేణుకకు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మిగనూరులో స్ట్రాంగ్ గా ఉంది. అందుకే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టీడీపీ అధినేత అవకాశమిస్తారని తెలియడంతో బుట్టా ఆశలు గల్లంతయినట్లేనన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. బుట్టా రేణుకకు రాజ్యసభ సభ్యత్వాన్ని కాని, ఎమ్మెల్సీ పదవికానీ ఇచ్చే అవకాశముందంటున్నారు. మరి బుట్టా రేణుక కోట్ల పార్టీలో అధికారికంగా చేరిన తర్వాత ఎలా స్పందిస్తారో చూడాలి.
Leave a Reply