చల్లాకు బిస్కెట్ పనిచేసిందా?

టీడీపీనేత చల్లా రామకృష్ణారెడ్డి చల్లబడ్డారా? టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నారా? తనఅనుచరులతో ఏర్పాటు చేయదలుచుకున్న సమావేశాన్ని వాయిదా వేసుకున్నారా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల పార్టీపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో చల్లా రామకృష్ణారెడ్డికి కడప ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి ఇవ్వగా దాన్ని ఆయన తిరస్కరించారు. తాను ఆ పదవిని తీసుకోనని తేల్చి చెప్పారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.

చంద్రబాబుతో సమావేశం తర్వాత….

ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక దూత ఒకరు చల్లా వద్దకు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో ఆయనను నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబుతో దాదాపు అరగంట సేపు చర్చించిన చల్లా రామకృష్ణారెడ్డి తన మనసులో వేదనను బయటపెట్టారు. తాను పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారని, ఎందుకు ఇవ్వలేకపోయారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అయితే సామాజిక సమీకరణాలు, ప్రాంతాల సమతూకం చేయవలసి రావడంతో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయానని చంద్రబాబు చల్లాకు వివరణ ఇచ్చారు.

రాష్ట్రస్థాయి పదవి ఇచ్చేందుకు…..

ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి చిన్నదని భావిస్తే అంతేకంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న రాష్ట్ర స్థాయి పదవి ఇస్తానని చల్లాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా ఇస్తానని చంద్రబాబు మరోసారి చల్లాకు మాట ఇచ్చారన్నారు. ప్రస్తుతానికి పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబు చల్లాకు సూచించనట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీయే అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎవరినీ తాను మరచిపోనని కూడా చంద్రబాబు చల్లాకు చెప్పినట్లు సమాచారం. దీంతో చల్లా కొంత వెనక్కు తగ్గినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద చల్లా రామకృష్ణారెడ్డి చల్లబడ్డారన్న వార్తలతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 29064 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*