
అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు జగన్ ను వదలలేదు. జగన్ తనను బావిలో పడి చావాలని అన్నారని, అది చాలా దురదృష్టకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలన్నారు. తాను ఇప్పటీకి జగన్ మోహన్ రెడ్డి గారూ అని సంభోదిస్తానని అఖిలపక్ష సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మీడియా సమావేశం పెట్టి కనీసం మోడీని ఒక్క మాట కూడా అనలేదన్నారు. ఢిల్లీలో తన మీడియా సమావేశాన్ని చూడాలని అఖిపక్షానికి హాజరయిన నేతలతో అన్నారు. తనకంటే మోడీ రాజకీయాల్లో జూనియర్ అయినా..ఆయనను సార్ అని పిలుస్తానని చెప్పారు.
బీజేపీ బలపడాలనుకుని…..
ఏపీలో బీజేపీ బలపడాలనుకునే రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఆటలాడుతుందన్నారు. గత సమావేశంలో సూచించిన మేరకే తాను రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి అన్ని జాతీయ పార్టీల నేతలను కలిశానని చెప్పుకొచ్చారు. మోడీ ఏపీకి చేసిన అన్యాయాన్ని వారికి వివరించగా అందరూ తమకు సంఘీభావం వ్యక్తం చేశారన్నారు. తాను రాజకీయాల కోసం ఢిల్లీ వెళ్లలేదని, రాష్ట్ర ప్రయోజనాలకోసమే ఢిల్లీ వెళ్లి అక్కడ అందరినీ కలిసి మద్దతివ్వాలని కోరానన్నారు.
జాతీయ పార్టీ నేతలందరూ…
ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన వాగ్దనాలను, ఇచ్చిన హామీలను జాతీయ మీడియాకు కూడా వివరించానన్నారు. తన మీడియా సమావేశాన్ని టీవీల్లో రాకుండా అడ్డుకున్నారని కూడా చంద్రబాబు చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ తప్ప అన్ని పార్టీలూ మనం చేసే పోరాటంలో కలిసి వచ్చేందుకు సంసిద్ధతను తెలిపాయన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజల మనోభావాలను సయితం పక్కన పెట్టేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు కలసి వచ్చినా…రాకున్నా…..
తాను మోడీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే రాష్ట్రంలోని బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కలసిరాకపోవడం పట్ల సమావేశంలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మూడు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. వారికి స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అయినా పోరాటం ఆపే ప్రసక్తి లేదని, ఎవరు కలసి వచ్చినా, రాకున్నా ఏపీ సమస్యలపై కేంద్రంతో పోరాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధులు చలసాని శ్రీనివాస్, సినీ నటుడు శివాజీ, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఉద్యోగ సంఘాలనేతలు మాత్రమే హాజరయ్యారు.
Leave a Reply