
సంక్రాంతి పండగ తర్వాత తొలి జాబితాను విడుదల చేస్తామన్న చంద్రబాబు ఎందుకు జాప్యం చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సర్వేల్లో స్పష్టం అవ్వడం వల్లనేనా? లేక ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత విడుదల చేస్తారా? ఇదే చర్చ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నేతల సమావేశంలో సంక్రాంతి తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు నిత్యం పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉన్నారు. అర్థరాత్రి ఒంటి గంట వరకూ ఈ కసరత్తు ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరుగుతూనే ఉంది.
అభ్యర్థుల పేర్లు ఖరారయినా….
ఇప్పటికే దాదాపు 70 మంది అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. అయితే ఆ జాబితాను విడుదల చేస్తే తమ పేరు తొలిజాబితాలో లేదని అసంతృప్తులు పెల్లుబికి ఇతర పార్టీల వైపు చూస్తారేమోనన్న అనుమానంతో తొలిజాబితా ప్రకటనలో జాప్యం చేస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. అంతేకాకుండా దాదాపు యాభై నుంచి అరవై నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు వివిధ సంస్థల ద్వారా జరిపిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ ఛార్జులపై వ్యతిరేకత ఉందని తెలియడంతో అక్కడి నియోజకవర్గాల్లో వడపోత జరుపుతున్నారు.
పోటా పోటీ ఉన్న స్థానాలతో….
దీంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. జమ్మలమడుగు, మైదుకూరు, అద్దంకి, కనిగిరి, ప్రొద్దుటూరు, రాజంపేట వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు క్లిష్టంగా మారింది. ఆశావహులందరితో నేరుగా చంద్రబాబు మాట్లాడుతున్న తామే పోటీ చేస్తామని వారు గట్టిగా చెబుతున్నారు. తమకు అవకాశం దొరకకుంటే స్వతంత్ర అభ్యర్థిగానో, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తామన్న సంకేతాలను పంపుతున్నారు.దీంతో చంద్రబాబు తొలి దశ జాబితాను ఇప్పుడప్పడే విడుదల చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచనలో ఉన్నారు.
ముఖ్యనేతలను పార్టీలోకి….
అంతేకాకుండా కొందరు ముఖ్యమైన నేతలను పార్టీలో చేర్చుకోవాల్సి ఉంది. సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, డీఎల్ రవీంద్రారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితర నేతలను పార్టీలోకి చేర్చుకున్న తర్వాతనే వారు పోటీ చేసే స్థానాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ముందే ప్రకటించకుండా నేతలందరూ చేరిన తర్వాతనే ఒక స్పష్టత వచ్చిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయాలన్నఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కసరత్తు మొత్తం ఈ నెల చివరకు పూర్తి కానుందని, ఫిబ్రవరి నెలాఖరుకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద సంక్రాంతి తర్వాత తొలిజాబితా వస్తుందనుకున్న తెలుగుతమ్ముళ్ల ఆశలపై నీళ్లు చల్లారు చంద్రబాబు.
Leave a Reply