వీరిద్దరూ ఉన్నారే….వారి వల్లే….!

ప్రభుత్వ సమస్యల్లో కూరుకుపోయి పార్టీని పట్టించుకోవడం మానేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుపర్చడంపై పెడుతున్న శ్రద్ధ పార్టీ మీద పెట్టడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గత కొన్నాళ్లుగా పార్టీ విషయాలను పూర్తిగా పక్కనపెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యవహారాల్లో తలమునకలై పోయి ఉన్నారు. కేంద్రంతో తెగదెంపులు చేసుకోవడం, ప్రతిపక్ష పార్టీ పుంజుకుంటుండటంతో చంద్రబాబు ఎక్కువగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. పోలవరం, పట్టిసీమ, రాజధాని తమను ఒడ్డుకు చేరుస్తుందన్న భ్రమలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలను పట్టించుకోవడం లేదన్న విమర్ళు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి.

చంద్రబాబు బిజీగా ఉండటంతో…..

ఇక చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీ విషయాలను ఎక్కువగా మంత్రి నారాలోకేశ్ తో చర్చించేవారు. అయితే లోకేశ్ కూడా గత ఆరునెలలుగా పార్టీని పట్టించుకోవడం మానేశారు. తన శాఖపై పట్టుపెంచుకునేందుకు ఎక్కువగా శ్రమపడుతున్నారు. అలాగే విదేశీటూర్లలో ఉండటం వల్ల పార్టీని పక్కనపెట్టేశారనే చెప్పాలి. దీంతో పార్టీలో అసంతృప్తులు ఎక్కువవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ లు తప్ప మరెవరికీ తమ గోడును చెప్పుకోలేరు. తమకిచ్చిన హామీల విషయంలో గాని, తమకు ప్రాధాన్యత దక్కలేదన్న విషయాన్ని కాని ఇన్ ఛార్జి మంత్రులకు చెప్పినా ఒకటే….చెప్పకపోయినా ఒకటేనన్న సంగతి అందరికీ తెలిసిందే.

పార్టీని వీడేందుకు రెడీ అవుతున్న…..

ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి అనేక మంది వెళ్లిపోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ముఖ్యంగా వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. అక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు పడటం లేదు. ఈ పంచాయతీని తీర్చే వారే లేరు. దీంతో టీడీపీ లో చేరిన వారిలో దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారట. వారు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిపారు. జగన్ ఓకే అంటే రేపే కండువా మార్చుకోవడానికి సిద్ధమని వారు బహిరంగంగానే చెబుతున్నారు.

వన్ టూ వన్ సమావేశాలు…..

అలాగే పార్టీలో ఉన్న యలమంచిలి రవి ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. ఆనం సోదరులు కూడా రేపో మాపో వైసీపీలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువ కావడతో సీనియర్లలో ఆందోళన ఎక్కువయింది. ఈ విషయాన్ని ఒకరిద్దరు సీనియర్ మంత్రులు నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జులతో త్వరలోనే ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలతో అసంతృప్తులు చల్లబడతాయా? అంటే ఏమో చెప్పలేం అంటున్నారు సీనియర్ నేతలు. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా చివరి నిమిషంలో బుజ్జగింపులు చేపడితే ఎవరు వింటారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పార్టీని వారిద్దరూ పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుర్గతి పట్టిందన్నది సీనియర్ల వాదనగా ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 30200 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*