
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటారు. మోడీతో ఆయన గొడవపడినపుడు మీరూ జాతీయ పార్టీ నేత, నేను కూడా జాతీయ అధ్యక్షుడిని అంటూ గట్టిగా హూంకరించారు. మరి అంతటి నేత ఉన్న పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు, , జిల్లా ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. జిల్లా సమీక్షలకు చంద్రబాబు రెడీ అంటూ వస్తున్నారు. ఏపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఎక్కడా సీన్లో కనబడరు. ఇక నియోజకవర్గాలు, మండలాల పార్టీ నేతల మీటింగులకు కూడా చంద్రబాబుగారే తయార్ అంటున్నారు. ఇలా జిల్లా మీటింగులు పెడుతూ గత రెండు నెలలుగా హడావుడి చేస్తున్న చంద్రబాబుకి పొలిటికల్ మైలేజ్ ఎంత వచ్చిందని చూసుకుంటే నిరాశే కలుగుతోంది. ఆరు నెలలు ఖాళీగా ఉండి ఒక్క లాంగ్ మార్చ్ తో జనసేనాని పవన్ మొత్తం ఏపీ పాలిటిక్స్ ని తనవైపు తిప్పుకున్నారు. మరి చంద్రబాబు ప్రతీ రోజూ ట్విట్టర్లు, టెలికాన్ఫరెన్సులు, జిల్లా మీటింగులు, మీడియా సమావేశాలు ఇలా తెగ బిజీగా ఉన్నా కూడా ఎక్కడా హైప్ రావడం లేదు.
ఏడాదిన్నరగా….
ఇక చంద్రబాబు వైఖరి మామూలుగానే భిన్నంగా ఉంటుంది. అంతా నేనే అన్నీ నేనే అన్న టైపులో ఆయన పార్టీ నేతలను పక్కనపెట్టి ముందుకు వస్తారు. ఏడాదిన్నరగా చంద్రబాబు ఆ స్పీడ్ బాగా పెంచేశారు. దానికి కారణం అభద్రతాభవం ఎక్కువ కావడమే. మోడీతో ఎపుడైతే కటీఫ్ అన్నారో నాటి నుంచి చంద్రబాబు రోడ్డు మీదనే ఉన్నారు. దీక్షలు, ఆందోళనలు, మీటింగులు ఇలా ప్రతీదీ ఎన్నికల వరకూ చేశారు. అయితే అవన్నీ ఫెయిల్ అని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇక ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఫలితాలు వచ్చే మధ్యలో రెండు నెలలూ కూడా చంద్రబాబు తీరిగ్గా కూర్చోలేదు. ప్రతీ రోజూ విమర్శలతో తెగ హడావుడి చేశారు. చంద్రబాబు ఊహించని విధంగానే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు జగన్ కి కనీసం టైం ఇవ్వకుండా చంద్రబాబు మళ్ళీ రోడ్ల మీదకు వచ్చేశారు. సమీక్షలు అంటున్నారు. నిరసనలు అంటున్నారు. ఓ విధంగా చంద్రబాబు బోరు కొట్టించేస్తున్నారని సొంత తమ్ముళ్ళే అంటున్నారట.
దానికే అసహనం…
ఇక చంద్రబాబుని జగన్ అసలు పట్టించుకోవడం లేదు, ఆయన విమర్శలు ఎన్ని చేసినా కూడా పెదవి విప్పడంలేదు. మరీ దారుణంగా ఉంటే తన మంత్రులతో జవాబు చెప్పిస్తున్నారు. ఆరు నెలలుగా జగన్ ఇదే విధానం అమలు చేస్తున్నారు. దాంతో చంద్రబాబుకు మండిపోతోందని అంటున్నారు. నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న తాను గట్టిగా నిలదీస్తే కనీసం సమాధానం చెప్పడా ఈ ముఖ్యమంత్రి అంటూ ఆవేశపడుతున్నారు. అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈ సర్కార్ కూలిపోతుందని శాపనార్ధాలు పెడుతున్నారు. అయితే జగన్ మాతం కూల్ గానే ఉంటున్నారు. అసలు రెస్పాండ్ కావడం లేదు. చంద్రబాబు ఇపుడు విపక్షంలో ఉన్నారు. ఆయనకు సమాధానం ఇస్తే దాన్ని మరింత పెద్దది చేసి జనంలోకి పోతారు. అందువల్ల ఆయన మానాన వదిలేస్తేనే బెటర్ అన్నది జగన్ పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నారు. దీంతో చంద్రబాబు తనలో తానే యుధ్ధం చేస్తున్నారు. ఒంటరిగానే కేకలు వేస్తున్నారు. అనుకూల మీడియా తప్ప చంద్రబాబు గోడు బయటకు వినబడుతోందా, ఇదే ఇపుడు తమ్ముళ్ళ పెద్ద సందేహం.
Leave a Reply