రియలైజేషన్ లేదే….? బాబు సాధించిందేమిటి?

చంద్రబాబు

రాజకీయపార్టీలు తమకు అనుకూలంగా లేని అంశాలను తెలివిగా దాటవేస్తుంటాయి. ప్రత్యర్థులపైనే బాణాలు ఎక్కుపెడుతుంటాయి. ఘోరపరాజయం తర్వాత సాగిన తొలి మహానాడులో తెలుగుదేశం అదే తంతును ఆనవాయితీగా పాటించింది. ఆత్మావలోకనం, చరిత్రలో ఎరుగుని వైఫల్యాలకు కారణాలను వెదికేందుకు ఏ కోశానా ప్రయత్నించలేదు. వైసీపీకి పట్టం గట్టి ప్రజలే తప్పు చేశారన్నట్లుగా ప్రసంగించి వక్తలు చేతులు దులిపేసుకున్నారు. అనుక్షణం పిల్లి మొగ్గలు వేస్తూ నిర్ణయాల్లో దూరదృష్టిని కోల్పోయిన అగ్రనాయకత్వాన్ని వేలెత్తి చూపడానికి ఎవరూ సాహసించలేదు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా వైఫల్యం చెందుతోంది. అందువల్ల రాజకీయంగా తమకు అంతా బాగుంది. మళ్లీ అధికారంలోకి వస్తామని నాయకులు అపరిమిత విశ్వాసాన్ని ప్రకటించుకుని జబ్బలు చరుచుకున్నారు. పార్టీ పునర్నిర్మాణం, తప్పిదాలను సమీక్షించుకోవడం, వైసీపీ సర్కారును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ అజెండా టీడీపీ మహానాడులో మచ్చుకైనా కనిపించలేదు.

చేతులు కాలాక…

భారతీయ జనతాపార్టీతో , కేంద్రంతో దూరమవుతున్న సందర్భంలోనే టీడీపీ అధినేతను పలువురు నాయకులు సున్నితంగా హెచ్చరించారు. అయితే ప్రాంతీయ పార్టీల్లో అధినేతను సరిదిద్దే ఏర్పాట్లు ఉండవు. ఆయన చెప్పిందే వేదంగా చెలామణి అవుతుంది. ఈ విషయంలో దేశంలో కమ్యూనిస్టు పార్టీల్లోనే కాసింత ధిక్కార స్వరాలకు ఆదరణ దక్కుతుంది. ప్రధాన కార్యదర్శితో సైతం విభేదిస్తారు. రాజకీయ వ్యూహకర్తగా పేరున్న చంద్రబాబు నాయుడి అతి రాజకీయం కారణంగా తెలుగుదేశం తీవ్రంగా దెబ్బతిన్నమాట వాస్తవం. 2014 నుంచి 19 వరకూ సాగించిన పాలనలో నేలవిడిచి సాము చేశారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ను ప్రజల అంచనాలకు, ఊహలకు అందని రీతిలో తీర్చిదిద్దుతాననే భ్రమలు కల్పించారు. రాష్ట్రానికి ఉండే ఆర్థిక పరిస్థితులు, హైదరాబాదులోనే పాతుకుపోయిన రంగాలు నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి పెద్దగా సహకరించలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు సొంతంగా తెచ్చుపెట్టుకున్న చిక్కులు కొన్ని ప్రతిబంధకాలుగా పరిణమించాయి. అత్తెసరు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కారు తొలిదశలో అభద్రతతోనే పరిపాలన ప్రారంభించింది. బీజేపీ, తెలుగుదేశం కాంబినేషన్ తెలంగాణలో బలమైన పక్షంగా కనిపించింది. రాజకీయ తప్పటడుగులతో టీడీపీ అధినేత ను బలహీనపరిచాయి. ఎమ్మెల్సీ ఓటు విషయంలో దొరికి పోవడంతో తెలంగాణలో టీడీపీ పట్టుకోల్పోయింది. ఆపై అమరావతికి పరిపాలన కేంద్రం మారాల్సి వచ్చింది. ఆపై కేంద్రం సహకారంతో కొత్త రాజధాని, అభివ్రుద్ధిపైనే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కానీ రాజకీయాలకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు. చాలా తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీని కోలుకోలేని దెబ్బతీయాలని చూశారు. అది బెడిసికొట్టింది.

రంగుల కలలతో….

ప్రజలకు తాను చూపించిన రంగుల కలలు సాకారం కాకపోవడానికి కారణం కేంద్రమేనంటూ వైఫల్యాలను బీజేపీవైపు తోసేయాలనే ప్రయత్నమూ వికటించింది. రాష్ట్రంలో బీజేపీ ప్రధానపార్టీ కాకపోవడంతో కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన పోరాటము వైసీపీకే లాభించింది. పార్టీ సిద్దాంతాలను పక్కనపెట్టి కాంగ్రెసుతో చేతులు కలపడమూ ఘోర అపరాధంగానే పార్టీ అభిమానులు భావించారు. అననుకూలమైన పరిస్థితుల్లో కేంద్రాన్ని , బీజేపీని దూరం చేసుకోవడం పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. వీటిలో ఏ ఒక్క అంశంపైనా అంతర్గత సమీక్ష లేకుండా మహానాడును మమ అనిపించేశారు. పార్టీ పూర్వ వైభవాన్ని కోరుకునే అభిమానులకు ఇదీ మన మార్గమని చూపించలేకపోయింది మహానాడు. తెలుగుదేశం పార్టీని తొలి నుంచి అభిమానించే లక్షలమంది ప్రజలు గత ఎన్నికల్లో కొంతదూరమయ్యారు. పార్టీ నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరిపై విభేదించడంతోనే వారు పార్టీ పట్ల సానుభూతి కోల్పోయారు. కనీసం మహానాడులో పార్టీ పశ్చాత్తాపం ప్రకటించి ఉంటే వారిని తిరిగి అక్కున చేర్చుకునే అవకాశం లభించేది.

అక్కడ మంత్రులా…?

మహానాడులో చేసిన తీర్మానాల్లో మెజార్టీ భాగం అధికారపార్టీని లక్ష్యంగా చేసుకుంటూ చేసిన రాజకీయ విమర్శలే. కొత్త అంశాలు పెద్దగా లేవు. రగులుతున్న రాజకీయ వివాదాలకే పెద్దపీట వేశారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాల్లో ద్వంద్వ వైఖరిని వైసీపీ ఎండగట్టడానికి ఆస్కారం ఏర్పడింది. ఇక్కడ ఎదిగిన నాయకులు అక్కడ మంత్రులయ్యారంటూ ఆయన చేసిన విమర్శ గత ప్రభుత్వానికి సైతం వర్తిస్తుంది. వైసీపీ పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అందులో నలుగురికి మంత్రి పదవి కట్టబెట్టడంతోనే టీడీపీ రాజకీయ నైతికతను కోల్పోయింది. తటస్థులు, విద్యాధికులు సైతం టీడీపీ వైఖరిని జీర్ణించుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి చంద్రబాబు వంటి సీనియర్ అవసరమని 2014లో ఓటేసిన ఆయా వర్గాలు ఫక్తు రాజకీయ అవకాశ వాదాన్ని వ్యతిరేకించాయి. అది కూడా టీడీపీ ఓటమి కారణాల్లో ఒకటి. పార్టీ ఓటు బ్యాంకు , సానుభూతిపరుల సంఖ్య పరంగా వైసీపీకి, టీడీపీకి పెద్దగా తేడా లేదు. కానీ తటస్థులు, విద్యా, మధ్యతరగతి వర్గాలు మొగ్గు చూపడంతోనే 2014 లో టీడీపీకి బాగా కలిసొచ్చింది. అవే వర్గాలు 2019లో పార్టీని తిరస్కరించాయి. ఫలితంగా పదిశాతం పైచిలుకు ఓట్ల తేడాతో అధికారం కోల్పోయింది. ఇంతటి కీలక విషయాలను నామమాత్రంగా కూడా స్ప్రుశించకపోవడాన్ని బట్టి చూస్తే తెలుగుదేశంలో రియలైజేషన్ లోపించిందనే చెప్పాలి.

దురదృష్టం…

దురదృష్టం కొద్దీ బీజేపీతో గ్యాప్ ఏర్పడిందంటూ కొందరు నాయకులు సన్నాయి నొక్కులు నొక్కడం పార్టీ దీనస్థితికి అద్దం పట్టింది. చంద్రబాబు నాయుడు కేంద్రం వైపు చూడాలంటూ కొందరు నాయకులు అభ్యర్థించారు. ఆ పనిని అధినేత ఎప్పుడో మొదలెట్టేశారనేది అందరికీ తెలిసిన విషయమే. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ కలిపేసుకున్నప్పుడు అధినేత పెదవి విప్పలేకపోవడం బలహీనతే. ఉద్దేశపూర్వక ఫిరాయింపుగానో, బీజేపీతో కుదుర్చుకున్న అవగాహన బదలాయింపుగానో భావించాలనేది రాజకీయ వర్గాల అంచనా. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో బీజేపీని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా దెబ్బతీయాలని చూశారనేది కేంద్రం అంచనా. అందువల్ల అంత తొందరగా ఈ రెండు పార్టీలు చేరువ కావడం సాధ్యం కాకపోవచ్చు.

ఆ సహకారం అందిస్తేనే?

తెలుగుదేశం తనను తాను త్యాగం చేసుకుంటూ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడేందుకు సహకారం అందిస్తే అవగాహన సాకారం కావచ్చు. ఇది వాస్తవం. అందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతారా? లేక వేరే ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రంగంలోకి దిగుతారా? అన్నది వేచి చూడాల్సిందే. బీజేపీ మాత్రం టీడీపీ నుంచి సెల్ఫ్ శాక్రిఫైస్ పొలిటికల్ మైలేజీని ఆశిస్తోంది. 1999,2014లో బీజేపీ సొంతంగా ఎదిగే అవకాశాలను త్యాగం చేసి చంద్రబాబు అధికారంలోకి రావడానికి కమలం పార్టీ సహకరించింది. ఇప్పుడు తమది పైచేయిగా ఉంది కాబట్టి అదే రకమైన ప్రతిఫలాన్ని కోరుకుంటోంది. అందుకే బీజేపీని ఎంతగా మచ్చిక చేసుకోవాలని నాయకులు ప్రయత్నించినా, అధినేత రాయబారాలు పంపినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. దారి తెన్ను తెలియని స్థితి కొనసాగుతోంది. అందుకే ఆత్మ సమీక్ష, పార్టీకి మార్గనిర్దేశం, అధికారపార్టీకి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రచించడంలో మహానాడు పెద్దగా సాధించిందేమీ లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 26832 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*