
ఏదైనా అతి చేయకూడదు. చంద్రబాబునాయుడు ఎన్నికల తర్వాత కూడా అదే చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని పదే పదే హస్తినకు వెళ్లారు. తనకు బద్ధశత్రువైన కాంగ్రెస్ తో చెలిమి కట్టారు. మోదీని ఓడించాలన్న ధ్యేయంగానే ఆయన అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి మోదీపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ కూటమి ఏర్పాటుకు ఆయన పోలింగ్ జరిగే సమయంలో కూడా ప్రయత్నించారు. తొలుత అఖిలేష్ యాదవ్ ను, తర్వాత మాయావతిని కలిశారు. ఆ తర్వాత మమత బెనర్జీని కలిశారు.
కీలకమవుదామని…
ఇలా వరసగా ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వంలో కీలకమవుతాయని భావించిన చంద్రబాబునాయుడు ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంతనాలు సాగించారు. మరోవైపు ఈవీఎంలపై పోరాటం చేశారు. తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే వచ్చానంటూ బిల్డప్ ఇచ్చారు. మోదీని ఎట్టిపరిస్థితుల్లో గద్దెనెక్కనివ్వ కూడదన్న లక్ష్యంతోనే ఆయన ఈ ఉద్యమాన్ని నడిపారు. అయినా పెద్దగా వర్కవుట్ కాలేదు. మాయావతి, స్టాలిన్, అఖిలేష్, మమత బెనర్జీ వంటి నేతలు ఫలితాల తర్వాతనే చూద్దామని చెప్పి పంపేశారు.
అతి తక్కువ స్థానాలతో…
తీరా ఫలితాలు చూస్తే.. తెలుగుదేశం పార్టీకి కనీసం రెండు నుంచి మూడు పార్లమెంటు సీట్లు వచ్చే దిక్కులేదు. తనకు కనీసం పది నుంచి పదిహేను స్థానాలు వస్తాయని నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే తాను అనుకున్నది సాధించవచ్చని చంద్రబాబు ఆలోచన. అందుకే ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హస్తిన వైపు చూశారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాము కాబట్టి ఏపీ ప్రజలు తనకు అండగా నిలుస్తారని చంద్రబాబు భావించారు.
జీరో అయినట్లే….
కానీ ఏపీ ప్రజలు టీడీపీ ఎంపీ అభ్యర్థులపై విముఖత చూపారు. స్ట్రాంగ్ గా ఉన్న ప్రాంతాల్లో సయితం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి, అటు కేంద్రంలో మోదీ రావడం, కనీస పార్లమెంటు స్థానాలు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు జాతీయ,రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర పరిమితమనే చెప్పాలి. ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు పాత్ర జీరో అయింది. వచ్చిన ఫలితాలతో ఆయన జాతీయ స్థాయినేతలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
Leave a Reply