
కడప జిల్లాలో మనం పాగా వేయాలి. విపక్షం వైసీపీ దూకుడుకు అడ్డుకట్టవేయాలి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్కు కళ్లెం వేయాలి. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్న ఈ జిల్లాలో సైకిల్ పరుగు పెట్టాలి. ఇదే మన 2019 ఎన్నికల లక్ష్యం“- ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గడిచిన ఏడాది కాలంగా కడప జిల్లాలోని టీడీపీ నేతలకు నూరిపోస్తున్నారు. రాష్ట్రంలో తనకు తిరుగులేదని, వచ్చే ఎన్నికల్లో తన విజయం ఖాయమని అంటున్న జగన్కు ఆయన సొంత జిల్లాలోనే బుద్ధి చెప్పడం ద్వారా టీడీపీ బలాన్ని చాటాలని కూడా చంద్రబాబు పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు.
పరువును బజారుకీడుస్తూ…..
అయితే, బాబు ఇలా చెప్పినప్పుడు మాత్రం తలాడిస్తూ.. ఓకే అంటున్న నేతలు తర్వాత మాత్రం తమ పంథాల్లో నే నడుస్తున్నారు. పార్టీలో ఆధిపత్య రాజకీయాలకు తెరదీస్తున్నారు. తమ తమ దారుల్లోనే నడుస్తున్నారు. ఫలితంగా టీడీపీ పరువు బజారున పడుతోంది. కడప జిల్లా బద్వేల్ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున జయరాములు గెలుపొందారు. అయితే, బాబు ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఆయన వెంటనే పార్టీ మారారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే, ఇక్కడ అప్పటికే ఉన్న పార్టీ సీనియర్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ.. జయరాములపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంత్రుల అండ చూసుకుని…..
ఈమెకు మంత్రులు కొందరు అనుకూలంగా ఉండడంతో గత కొన్నాళ్లుగా జయరాములపై విజయమ్మ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోందో కూడా తనకు తెలియడం లేదని పలుమార్లు జయరాములు మీడియా ముఖంగానే విమర్శించారు. తనకు తెలియకుండానే నియోజకర్గంలో కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని అన్నారు. జన్మభూమి కమిటీల్లోనూ తన ప్రమేయం లేకుండా పోయిందని అన్నారు. ఈవిషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని గతంలోనే ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ.. నేతల్లో మార్పు రాలేదు. పైగా ఇప్పుడు మరింత ముదిరింది. నిన్న తలపెట్టిన చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష విషయంలోనూ జయరాములు, విజయమ్మ వర్గాలు విడివిడిగా తమ దీక్షలు నిర్వహించారు. ఇక్కడ జయరాములు దీక్షలో పాల్గొన వద్దంటూ కొందరిని విజయమ్మ ఆదేశించడంతో జయరాములు చేసిన దీక్షలో జనాలు అంతంత మాత్రంగానే కనిపించారు. ఈ పరిణామంతో జయరాములు మరింతగా రెచ్చిపోయారు.
ఎస్సీ నియోజకవర్గంలో….
ఎస్సీ నియోజక వర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. జిల్లా నాయకులు ఎస్సీలను అణగదొక్కుతున్నారని, అధిష్ఠానం స్పందించకపోతే రాజీనామాకు వెనకాడనని జయరాములు స్పష్టం చేశారు. ఇక ఇదే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జయరాములు మీద టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి మరో గ్రూపు. సో.. ఇలా బాబు ఒకటి తలిస్తే.. టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఆధిపత్య పోరుతో టీడీపీ పరువును రోడ్డున పడేస్తున్నారు. మరిబాబు ఎప్పుడు పట్టించుకుంటారో? ఎప్పుడు కాయకల్ప చికిత్స చేస్తారో చూడాలి.
Leave a Reply