చంద్రబాబు మరో నల్లారి కాక తప్పదా?

2013వ సంవత్సరం గుర్తుండే ఉంటుంది కదా? అప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అంతా తెలుసు. రాష్ట్రం విడిపోతుందన్న సంకేతాలు ముందుగానే నల్లారికి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన మంత్రివర్గంలోని సహచరులే చెప్పారు. అయినా నల్లారి రాష్ట్రం విడిపోదంటూ చివరి వరకూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

తాను ఎంత ప్రయత్నించినా…..

కాంగ్రెస్ ను వదిలేయడమే కాదు… సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. తాను ఎంత చేసినా రాష్ట్ర విభజనను ఆపలేకపోయానని, కాంగ్రెస్ నేతలే కొందరు కుట్రలు చేసి రాష్ట్రాన్ని విభజించారని నల్లారి ఊరూ వాడా తిరిగి చెప్పుకున్నారు. కాని ప్రజలు నల్లారి మాటలను నమ్మలేదు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఒక్క పీలేరు మినహా ఎక్కడా ఆయన పార్టీ ఊసే కనపడ లేదు. ఇదంతా ఎందుకు గుర్తుకు వస్తుందంటే…. నాడు నల్లారి కిరణ్ కుమార్ పరిస్థితే ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు కూడా హామీలు ఇచ్చి…..

ప్రత్యేక హోదా ఇస్తామని, ఏపీని ఫుల్లుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు, మోడీ జోడీ రాష్ట్రమంతా తిరిగి చెప్పి విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి గురించి పెద్దగా కేంద్రం పట్టించుకోలేదన్నది అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ మట్టి, నీళ్లు తెచ్చినప్పుడే అందరికీ అర్థమయింది. అయినా చంద్రబాబు నాలుగేళ్లు కలిసి కాపురంచేశారు. మోడీ విజన్ ను మెచ్చుకున్నారు. తీరా ఎన్నికల సమయానికి వచ్చే సరికి మోడీ హ్యాండ్ ఇచ్చేశారని, ప్రత్యేక హోదా కావాలంటూ జనం బాట పట్టే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు.

నాలుగేళ్ల తర్వాత నమ్ముతారా?

నాలుగేళ్ల సమయాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పుడు ప్రజల నుంచి విన్పిస్తున్న ప్రశ్న. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి వాటిపై శ్రద్ధ పెట్టకుండా, కనీసం రాజధాని నిర్మాణంపై కూడా చంద్రబాబు దృష్టి సారించలేదన్నది ఆయనపై వస్తున్న విమర్శ. అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తారనుకుంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిలో కూడా రాజధాని నిర్మాణం చేపట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇలా చంద్రబాబు జవాబు చెప్పుకోలేని పరిస్థితి కన్పించింది. ఆరోజు కూడా నల్లారి సభలకు పెద్దయెత్తున జనం వచ్చారు. కాని ఆయన పార్టీ గుర్తుపై మీట నొక్కలేదు. రేపు కూడా చంద్రబాబుకు నల్లారి పరిస్థితి వస్తుందా? అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లోనూ లేకపోలేదు. ప్రస్తుతం చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం ఏపీ ప్రజలను నమ్మించడమే. మరి అది జరుగుతుందో? లేదో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30963 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*