
ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పదవుల పందేరం చేపట్టారు. ప్రధానమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిలో పుట్టా సుధాకర్ యాదవ్ ను చంద్రబాబు నియమించారు. గత కొన్నాళ్లుగా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తారని వార్తలొస్తున్నప్పటికీ చంద్రబాబు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా మంగళవారం అర్థరాత్రి ఈ నియామకాన్ని చంద్రబాబు చేపట్టారు. టీటీడీ ఛైర్మన్ ను నియమించిన చంద్రబాబు పాలకమండలి సభ్యులను మాత్రం త్వరలో నియమించనున్నారు.
టీటీడీ ఛైర్మన్ గా పుట్టా…..
పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు. కడప జిల్లాకు చెందిన ఈయనకు పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించారు. కాని ఇతర మతాలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన నియాయకంపై అప్పట్లో వివాదం చెలరేగింది. అయితే దీనిపై సుధాకర్ యాదవ్ వివరణ ఇచ్చుకున్నారు. మొత్తం మీద దాదాపు ఏడాది తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు భర్తీ చేశారు. దీంతో పాటు వివిధ కార్పొరేషన్ల నియామకాలను కూడా చంద్రబాబు పూర్తి చేశారు.
వర్ల రామయ్యకు ఆర్టీసీ…..
ఇక ఆర్టీసీ ఛైర్మన్ పదవి పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను వరించింది. వర్ల రామయ్య పార్టీలో సీనియర్. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దక్కుతుందని భావించారు. అయితే అనూహ్యంగా కనకమేడల రవీంద్రకుమార్ పేరును సీఎం ఖరారు చేయడంతో ఆయనకు పదవి దక్కలేదు. తాజాగా ఆర్టీసీ ఛైర్మన్ పదవి వర్లరామయ్యకు దక్కింది. విపక్షాలపై విమర్శలను సంధించడంలో వర్ల రామయ్య దిట్ట.
జూపూడి, జియావుద్దీన్ లకు…..
ఇక ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా జూపూడి ప్రభాకర్ రావునే ముఖ్యమంత్రి కొనసాగించాలని నిర్ణయించారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో వేరే వారిని నియమిస్తారని అందరూ భావించారు. వర్లరామయ్యకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి, జూపూడికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు తొలుత అనుకున్నారు. కాని చివరి నిమిషంలో జూపూడిని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గానే కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక ఇటీవలే పార్టీలో చేరిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి కూడా చంద్రబాబు పదవి ఇవ్వడం విశేషం. ఆయనకు సాగునీటి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇక మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత నామన రాంబాబుకు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ పదవి ఇవ్వడం విశేషం. నామన రాంబాబు జ్యోతుల నెహ్రూ కుమారుడి కోసం జడ్పీ ఛైర్మన్ పదవిని వదులుకున్నారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ కు ఫారెస్ట్ డెవలెప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి దక్కింది. మైనారిటీ కమిషన్ ఛైర్మన్ గా లాల్ జాన్ భాషా సోదరుడు జియావుద్దీన్ ను నియమించారు. మొత్తం మీద చంద్రబాబు కార్పొరేషన్ పదవులను భర్తీ చేసి ఎన్నికలకు సమాయత్త మవ్వాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు.
Leave a Reply