
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మెన్ గా ఎవర్ని ప్రకటించినా ఎప్పుడు వివాదాలే నడుస్తాయి. ఆ పదవికి లభించే ప్రోటోకాల్ అలాంటిది. రాష్ట్రపతి, ప్రధాని నుంచి దేశంలోని వివిఐపిలతో నేరుగా సంబంధాలు కలిగే పోస్ట్ కనుకే తిరుమల వెంకన్న బోర్డు కి దేశ విదేశాల్లో అందరూ దణ్ణం పెట్టాలిసిందే. తాజాగా తిరుమల పాలకమండలి బోర్డు ఛైర్మెన్ గా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, తలసాని శ్రీనివాస యాదవ్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించిన సర్కార్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆయన క్రైస్తవ మతప్రోత్సహకుడిగా ముద్రవేసుకున్న వ్యక్తికి ఎలా ఈ పదవి అంటూ కొందరు పీఠాధిపతులు ఇప్పటికే రోడ్డెక్కి గొడవ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ గొడవతో కొంతకాలంగా పెండింగ్ లో పెట్టిన సుధాకర యాదవ్ పోస్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక వివాదం మరోసారి రచ్చ ప్రారంభం అయ్యి తీవ్రం అవుతుంది.
విశ్వహిందు పరిషత్ సీన్లోకి రావడంతో….
ఇప్పుడు పీఠాధిపతుల విమర్శలకు విశ్వహిందు పరిషత్ జత కట్టింది. దాంతో వివాదం రాష్ట్ర స్థాయిని దాటి దేశ స్థాయికి వెళ్ళింది. దాంతో ఇప్పుడు ఎన్నికల ముందు ఇదో ఇష్యూ గా బిజెపి .టిడిపి లు దుమ్మెత్తిపోసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మతం, కులం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తిరుమల ఛైర్మెన్ గిరి కూడా రాజకీయ అంశాల్లో ఒకటిగా మారేలాగా వుంది. ఇప్పటివరకు శివ స్వామి వంటివారు యాదవ్ పదవిపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వీరి ఆందోళనకు విశ్వహిందు పరిషత్ తోడు కావడంతో మరికొంతకాలం వివాదం నడవడం ఖాయంగా కనిపిస్తుంది ఎన్డీయేలో భాగస్వామిగా వున్న తరుణంలో పుట్టా సుధాకర యాదవ్ కు ఛైర్మెన్ పదవి దక్కినట్లే దక్కి దూరమైంది.
నిరసన తప్పదా?
ఇటీవల ఎన్డీయే లో నుంచి టిడిపి పూర్తిగా బయటకు రావడం తో చంద్రబాబు స్వేఛ్ఛగా తన నిర్ణయం అమలు చేశారు. సుధాకర యాదవ్ పై అభ్యంతారాలు వెల్లువెత్తినప్పటికీ బాబు కి అత్యంత సన్నిహితంగా వుండే యనమల వత్తిడి ఆయనపై పని చేసింది. ఆర్ధికమంత్రి ఈ పోస్ట్ ను ప్రతిష్ట గా భావించడంతో బాబు ఎట్టకేలకు సుధాకర యాదవ్ నే ఫైనల్ చేసేశారు. బిజెపి తో దూరం అయ్యాక అటు ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులను దగ్గర చేసుకుంటున్న చంద్రబాబుకి ఇప్పటివరకు హిందూ ఓటు బ్యాంక్ బలంగానే వుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ముందుకు వెళ్ళినా వెనక్కు తగ్గినా ఆయనకు ఎదో ఒక వర్గం నుంచి నిరసన సెగలు తగలక తప్పదు. మరి తలపోటుగా మారిన ఈ వ్యవహారంపై ఆయన ఎలా ముందుకుసాగుతారో చూడాలి.
Leave a Reply