ఓటమి కాంగ్రెస్ ది…ఓడింది చంద్రబాబు…..!!

chandrababunaidu-defeat-in-telangana-elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ రాజకీయ పార్టీల మధ్య జరిగినవి కాకపోవచ్చు. ప్రజల అకాంక్షలకు., భావోద్వేగాలకు మధ్య జరిగిన పోటీలో అంతిమంగా కేసీఆర్ విజేతగా నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిందనడం కంటే., టీడీపీతో దోస్తీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని భావించొచ్చు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేసీఆర్‌ చేసింది ఎంతవరకు సబబు అనే ప్రశ్న పక్కన పెడితే., ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ నెత్తిన కూటమితో జత కట్టి చంద్రబాబు పాలు పోశాడు. బాబు లేకపోతే మహాకూటమి ఓటమి గుడ్డిలో మెల్ల అయ్యేది. ఇప్పటి ఫలితంలా నిండా మునిగే పరిస్థితి తప్పేది.

రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు గమనిస్తే……,

తెలంగాణ రాష్ట్ర విభజనకు ప్రధాన కారణాల్లో కుల ఆధిపత్యమే ప్రధాన కారణం. కేంద్రీకృత అభివృద్ధిలో భాగంగా ఓ వర్గం మాత్రమే అభివృద్ధి ఫలాలను అందుకోవడం ప్రజల అక్రోశానికి కారణమైంది. ప్రజల్లో పెరిగిన చైతన్యం., వివక్ష., పీడనల నుంచి విముక్తి కోసం తలెత్తిన సంఘర్షణ చివరకు రాష్ట్రం విడిపోడానికి కారణమైంది. నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేరిన నాలుగున్నరేళ్లలోనే కొత్త సవాలు తెలంగాణ ప్రజానీకం ముందు చంద్రబాబు రూపంలో నిలిచింది. దశాబ్దాల స్వప్నం చెదిరిపోతుందనే భయాందోళన కూటమి రూపంలో అక్కడి ప్రజలకు ఎదురైంది. నిజానికి కూటమిలో టీడీపీ మినహా మిగిలిన పక్షాలపై అక్కడి ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదు. తెలుగుదేశం పార్టీ రూపంలో తెలంగాణ ప్రజలకు కొత్త సవాలు ఎదురవుతుందనే అపోహలు తలెత్తడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది.

ప్రజలు ఎందుకు తిరస్కరించారంటే…?

ఏ సామాజిక అసమానత ఆధారంగా తెలంగాణ ఉద్యమం విజయవంతం అయ్యిందో అదే సూత్రం ఈ ఎన్నికల్లో కూడా ఫలితం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం బలపడితే అది అంతిమంగా తెలంగాణ ప్రజలకు చేటు చేస్తుందనే ఆలోచన….. కూటమిని ప్రజలు తిరస్కరించడానికి కారణమైంది. కులభావన., ఆధిపత్య ధోరణిని ప్రజలు తిరస్కరిస్తారనడానికి ఈ ఎన్నికలు చక్కటి ఉదాహరణ. తెలంగాణ గడ్డపై జరిగిన ప్రచారంలో సైతం అక్కడి ప్రజానీకాన్ని కించపరిచేలా., వారి ఆత్మ గౌరవాన్ని., అకాంక్షను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు వారి అహాన్ని దెబ్బతీశాయి. బాబు సారథ్యంలోని కూటమి వస్తే పోరాడి సాధించుకున్న దానికి ఫలితం లేకుండా పోతుందనే ప్రచారం ప్రజల నమ్మకాన్ని పొందింది.

టీఆర్ఎస్ గెలవాలని ఏపీ ప్రజలు…

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిని సహజంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు కోరుకోవాలి. కానీ అందుకు భిన్నమైన అభిప్రాయం అక్కడి ప్రజానీకంలో ఉంది. ప్రత్యేకించి పాలక వర్గ ప్రజలు మినహా మిగిలిన వర్గాలేవి టిఆర్ఎస్ ఓటమిని కోరుకోలేదు….. ఆంధ్రా ప్రాంత ప్రజలు., ప్రధానంగా మధ్యతరగతి వర్గం., యువత., దళిత-బహుజన వర్గాలు., ఉద్యోగులు తెలంగాణలో మహా కూటమి ఓటమని బలంగా కోరుకున్నారు. దీనికి ప్రధాన కారణం విభజన తర్వాత అభివృద్ధి ఫలాలు ఓ కులానికి పరిమితమయ్యాయనే బావన అన్ని వర్గాల అసహనానికి కారణమైంది. అదే సమయంలో మీడియా మాయను కూడా సోషల్ మీడియా సమర్ధవంతంగా తిప్పి కొట్టగలిగింది. వార్తల్లో డాంబికాలు., వ్యక్తిపూజ., మోస పూరిత కథనాలతో రగిలిపోయిన సామాన్య ప్రజానీకం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టిన కూటమికి తగిన గుణపాఠం అవ్వాలని భావించాయి. అందుకే దాదాపు 15వేలమంది ఉద్యోగులకు సెలవులిచ్చి మరి హైదరాబాద్‌ లో ఓటు వేసేందుకు పంపినా ఫలితం మాత్రం ఎక్కడా రాలేదు. పైపెచ్చు ఎన్నికల ఫలితాల సరళి చూసిన తర్వాత వారిలో సంబరం కనిపించింది. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా., భార్యా బిడ్డలను., కుటుంబాలను వదిలేసి అమరావతి రావాల్సిన అగత్యంపై వారిలో నెలకొన్న అక్రోశానికి ఎన్నికల ఫలితాలు అద్దం చూపాయి. మెజార్టీ ఉద్యోగుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుపై హర్షం వ్యక్తమైంది.

ఏపీ ప్రజలు వ్యతిరేకించలేదు….

తెలంగాణ ప్రభుత్వంపై ఆంద్రా ప్రజానీకానికి వ్యతిరేకత లేకపోవడానికి మరో కారణము ఉంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఆంధ్రాలో మెజార్టీ ప్రజలు వ్యతిరేకించలేదు. హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టిన వర్గానికి మాత్రమే రాష్ట్ర్ర విభజనను వ్యతిరేకించాయి. 2009-2014మధ్య ఆంధ్రాలో లగడపాటి వంటి వాళ్లు నడిపిన కృత్రిమ ఉద్యమంలో మెజార్టీ ప్రజల బాగస్వామ్యం లేదు. రాష్ట్ర విభజనతో తమకేమి నష్టం లేదనే భావన బహుజన ప్రజానీకంలో ఉండేది. పెట్టుబడిదారి కులాల మాత్రం తమ ఆస్తులకు ఎక్కడ నష్టం వాటిల్లుతోందననే భయంతో ఉద్యమాలను నడిపినా విభజన తప్పలేదు.

స్వయంకృతాపరాధమే….

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి నూటికి నూరుపాళ్లు స్వయంకృతమే కారణం. అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారిన ప్రధాన స్రవంతి మీడియాకు ఈ ఎన్నికల ఫలితాలు చెప్పు దెబ్బలాంటివి. కుల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి తమ కుల పాలనే పదికాలాల పాటు ఉండాలనుకున్న దురాలోచనకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలు గతిలేక ఆ…పత్రికలను చదవాల్సిన దౌర్భాగ్యం. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా విస్తరిస్తుండటం వల్ల కొంత మార్పు కనిపిస్తోంది. ఇక మీడియాలో సైతం స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి లేకపోయింది. కుల పెత్తనం సాగే న్యూస్ రూమ్‌లలో పాత్రికేయులు స్వేచ్ఛగా ప్రజల అబిప్రాయాలను బయటపెట్టే వాతావరణం లేదు. అందుకే అందరి ముందు కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా క్లోజ్డ్ సర్కిల్స్‌లో ఓటమిని బలంగా కోరుకున్నారు.

లగడపాటి జోస్యం….

రాష్ట్ర విభజన ఎన్నటికి జరగదని పదేపదే జోస్యాలు చెప్పిన చరిత్ర లగడపాటి రాజగోపాల్‌ది…. రాజగోపాల్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు…. ధన బలంతో 2004లో వందల కోట్లు కుమ్మరించైనా ముఖ్యమంత్రి అయిపోదామని ఆశతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహానుభావుడు. 2004 ఎన్నికలకు ముందు పారిశ్రామిక వర్గాలకు., ఉపేంద్ర అల్లుడిగా తప్ప రాజగోపాల్ బెజవాడలో ఎవరికి తెలీదు…. ఫ్లెక్సీ పొలిటిక్స్…., నిరంతరం వార్తల్లో ఉండటం., వివాదాల్లో నిలవడం ద్వారా రాజకీయాల్లో పదేళ్ల పాటు నిలిచినా.., నిరంతరం ప్రజల్ని మోసం చేయడమే అతని నైజం. తెలంగాణ ఎన్నికల్లో ప్రజల నాడికి భిన్నమైన ఫలితాలను ప్రకటించడం వెనుక కూడా వందలకోట్ల బెట్టింగ్ మాఫియా ఉంది. వందలు., వేల కోట్లకు విస్తరించిన బెట్టింగ్ రాకెట్ లకు అండగా ఉండేందుకే ఈ తరహా సర్వేలను వెల్లడించడం వెనుక ఉద్దేశం. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సర్వే పేరుతో జనాలకు టోపీ పెట్టారు.

నూటికి నూరుపాళ్లు చంద్రబాబే….

చివరగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్‌….. ఓడింది మాత్రం మహా కూటమి కాదు. నూటికి నూరు పాళ్లు చంద్రబాబే….. చంద్రబాబు మార్కు కుల రాజకీయం మట్టి కరిచింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు అన్ని కులాలను గౌరవించి., ప్రేమిస్తే కాస్త భిన్నమైన ఫలితం ఉండేదేమో…, రానున్న ఎన్నికల్లో కూడా ఇందుకు భిన్నమైన ఫలితాలేమి రాకపోవచ్చు. చంద్రబాబు తోక పట్టుకుని తెలంగాణ ఎన్నికలను ఈదాలనుకున్న కూటమి జన ప్రవాహంలో కొట్టుకుపోయింది.

Ravi Batchali
About Ravi Batchali 27986 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*