
ఒకటి కాదు రెండు కాదు..నాలుగుసార్లు ఓడిపోయిన నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ఫుల్ ఫోకస్ పెట్టారు. `ఇంట గెలిచి రచ్చ గెలవాల`న్న ప్రతిపక్షాల సవాలును సీరియస్గా తీసుకున్నారు. బలమైన క్యాడర్, సానుభూతి పరులు ఉన్నా.. ఎన్నికల రేసులో మాత్రం రెండో స్థానంలోనే నిలుస్తుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా పసుపు జెండా రెపరెపలాడించాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తూ.. ప్రతిపక్ష నాయకుల పక్కలో బల్లెంలా మారారు. నిన్న మొన్నటివరకూ కాలర్ ఎగరేసిన నేతలు.. ఇప్పుడు బాబు వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి చంద్రబాబు అంతలా ఫోకస్ పెట్టిన నియోజకవర్గం చంద్రగిరి. ఒకప్పుడు తమ సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఈసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించాలని నేతలకు ఆయన స్పష్టం చేశారు. అంతేగాక అసంతృప్తులు, ఇతర నేతలతో వరుసగా మాట్లాడుతూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు.
గల్లా పోటీ చేయననడంతో…..
నేతల్లో అంతర్గత విభేదాలు, లుకలుకలు, అసంతృప్తులు, వర్గపోరు ఇలా ఒకటా రెండా.. అన్నీ నివురు గప్పిన నిప్పులా ఉండే నియోజకవర్గం చంద్రగిరి. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గల్లా అరుణ కుమారి ఓడిపోవడానికి ఇవన్నీ కారణమే! పైకి అంతా బాగానే కనిపిస్తూ ఉన్నా.. లోపల మాత్రం మేడిపండు చందమే! ఇది సీఎం చంద్రబాబుకూ బాగా తెలుసు! అందుకే ఈసారి ముందుగానే ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. చంద్రగిరి నుంచి పోటీ చేయబోమని గల్లా కుటుంబం తెగేసి చెప్పడంతో.. ఈసారి అక్కడ అభ్యర్థిగా పులపర్తి నాని పేరు దాదాపు ఖరారు చేశారు. గతంలా కాకుండా ఈసారి ఎలాగైనా నాని గెలవాలనే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నాయకులు విభేదాలు, అసంతృప్తిని పక్కన పెట్టి, కష్టపడి పనిచేయాలని హితబోధ చేస్తున్నారు.
ఏకతాటిపైకి తెచ్చేవారేరీ?
1994లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా రామ్మూర్తినాయుడుకు 20వేల మెజారిటీ లభించింది. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించలేదు. 2014లో గల్లా అరుణ కుమారి.. కేవలం ఆమె మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరు లైన ఓటర్లు వేల సంఖ్యలో ఉన్నా.. వారందరినీ ఏకతాటిపైకి నడిపే నాయకుడు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. సొంత నియోజకవర్గమైనప్పటికీ చంద్రబాబు చంద్రగిరిపై నిర్లక్ష్యం చూపడం, పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పాటు స్థానిక నేతల పంచాయితీలు, తలనొప్పిని తీసుకొస్తున్నాయి.
అందరికీ నచ్చచెబుతూ…
ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఏకంగా చంద్రబాబుకే సవాలు విసురుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపును చంద్రబాబు సవాలుగా తీసుకున్నారు. అందుకే ముందుగా నేతలందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు. 2019లో టీడీపీ అభ్యర్థి నాని భారీ మెజారిటీతో విజయం సాధించాలని.. ఈ బాధ్యత అందరికీ అప్పగిస్తున్నానని చంద్రబాబు స్థానిక నాయకులకు పేరు పేరున చెబుతున్నారు. స్థానిక నేతలందరినీ స్వయంగా పిలిపించి వారికి నచ్చచెబుతు న్నారు. వారి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని చేరదీస్తున్నారు. దీంతో చంద్రగిరిలో నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. ఫలితంగా ఇన్నాళ్లూ.. ఎదురు లేకుండా ఉన్న చెవిరెడ్డికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు.
Leave a Reply