కుప్పంలోనూ ఈసారి ఈక్వేష‌న్ మారుతోందా..!

chandrababunaidu-in-kuppam-constiuency

మూడు దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న నాయకుడికి ఈ సారి ఆ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి బహుమతి ఇవ్వనున్నారు ? ఎవరూ ఊహించని విధంగా ఆ నేత మెజార్టీ భారీగా పెంచుతారా? లేదా ప్రతిపక్ష నేతతో పోలిస్తే ఆయన మెజార్టీ బాగా తగ్గించేస్తారా ? ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గమైన కుప్పంలో ఈ సారి ఆయ‌న ఎలాంటి ? ప‌రిస్థితులు ఎదుర్కొబోతున్నారో ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర అంశాలే వెల్ల‌డ‌వుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది సంవత్సరాల పాటు, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గం తిరుగులేని కంచుకోట. 1989 నుంచి 2014 ఎన్నికల వరకు ఇక్కడ చంద్రబాబు ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు.

ప్రచారానికి వెళ్లకుండానే…..

ఏడోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న చంద్రబాబుకు ఈ సారి మెజారిటీ పెరుగుతుందా? లేదా కుప్పం ప్రజలు మెజారిటీ తగ్గిస్తారా ? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. ఇప్పటికే కుప్పంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన చంద్రబాబు గత ఆరు సార్లు కుప్పంలో ఒక్కరోజు అయినా ప్ర‌చారం చేశారు. ఈ సారి మాత్రం ఒక్క పూట కూడా ఆయన ప్రచారానికి వెళ్లకపోవడం పై బాబు పూర్తి ధీమాతో ఉన్నట్లు కనబడుతోంది. చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 1989లో కుప్పంకు మకాం మార్చారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆయనకు ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు అక్కడ ఓటమి అనేది లేకుండా ప్రతి ఎన్నికలకు తన మెజార్టీ పెంచుకుంటూ పోతున్నారు.

ఇది తొలిసారి అంటున్న…

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా కుప్పం నియోజకవర్గం మీద మాత్రం ఓ కన్నేసి ఉంచుతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం… వెనుకబడిన ప్రాంతం. ఈ నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు మూడు దశాబ్దాలుగా కష్టపడుతూనే ఉన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో తొలిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా ఎన్నికలకు వెళ్లడం విశేషం. కుప్పం పక్కనే ఉన్న పలమనేరు నియోజకవర్గంలో బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు ఇటు వైపు మాత్రం రాలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల పరంగా చూస్తే కుప్పం ముందు వరుసలోనే ఉంది. చంద్రబాబుకు నియోజకవర్గంలో గ్రామగ్రామాన కార్యకర్తలు నాయకులతో అనుబంధం ఉంది. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులను చంద్ర‌బాబు పేరు పెట్టి పిలిచేంత చ‌నువు ఏర్ప‌రచుకున్నారు.

వైసీపీ అభ్యర్థి కూడా….

ఇక వైసీపీ నుంచి పోటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన నియోజకవర్గంలో పర్యటించ‌ లేకపోయారు అయితే చంద్రమౌళి కుటుంబ సభ్యులు, వైసిపి కేడ‌ర్‌ మాత్రమే అక్కడ ప్రచారం చేశారు. చంద్రబాబు కుప్పంలో కాలు పెట్టకపోయినా వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇక్కడ ప్రచారం చేశారు. జగన్ బహిరంగ సభకు కూడా భారీగానే జనాలు తరలి రావడం పలువురిని ఆలోచింప చేస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న మాట వాస్తవం. ఇక ఎన్నికలకు ముందు చంద్రమౌళి ఆసుపత్రిలో ఉండడంతో కొన్ని వర్గాల్లో ఆయనపై సానుభూతి ఉంద‌న్న‌ ప్రచారం కూడా ముమ్మరంగా జరిగింది. ఇక చంద్రబాబు గెలుపు పై ఎలాంటి సందేహాలు లేకపోయినా ఆయన మెజార్టీ తగ్గుతుందా ? పెరుగుతుందా ? అన్నది పందెం రాయుళ్లకు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీకి ఆశలు లేకున్నా….

2004లో 49,588 – 2009లో 46,066 – 2014లో 47,121 ఓట్ల మెజారిటీతో ఆయ‌న వ‌రుస‌గా ఘ‌న విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. ఇక ఈ సారి ఎంత మెజారిటీ వ‌స్తుంద‌న్న‌దే ? ఇప్పుడు ఆస‌క్తిగా ఉంది. ఇక్కడ గెలుపుపై వైసిపికి సైతం అసలు లేకపోయినా ? చంద్రబాబు మెజార్టీని గణనీయంగా తగ్గించ‌బోతున్నాం అన్న ధీమా వైసీపీలో ఉంది. ఈసారి తమకు కలిసి వచ్చిన రాజకీయ పరిణామాలు, వైసీపీ అభ్యర్థి పై ఉన్న సానుభూతిని, మార్పు కోరుకుంటున్న ప్రజలు ఈ సారి కుప్పంలో బాబు మెజార్టీ భారీగా తగ్గిస్తున్నారని వైసిపి చెబుతోంది. మరి కుప్పం ఓట‌రు ఈ సారి ఎలాంటి తీర్పు ఇచ్చాడో ? చూడాలి.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2665 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*