బాబు ‘‘సన్’’ స్ట్రోక్ ఇచ్చేస్తారా….!!

chandrababunaidu senior leaders

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబునాయుడికి సీనియర్ నేతలు, పార్టీలో తొలి తరం నేతలు తలనొప్పిగా మారారు. ఈసారి తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ సీనియర్ నేతలు పట్టుపడుతున్నారు. అయితే దీనికి చంద్రబాబు తెలివిగా చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సీనియర్ నేత కుమారుడు ఈ ఐదేళ్లలో చేసిన నిర్వాకాలను జాబితాతో సహా వారి ముందుంచి టిక్కెట్ ఎలా ఇవ్వమంటావు? అని ఎదురు ప్రశ్న వేస్తుండటంతో సీనియర్ నేతలు ఖంగు తింటున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న సీనియర్ నేతలకు చంద్రబాబు ఈసారి చంద్రబాబు షాకిస్తారన్న వ్యాఖ్యలు అమరావతిలో గుప్పుమంటున్నాయి.

ఆవిర్భావం నుంచి కొనసాగుతూ….

తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, పరిటాల కుటుంబం పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయ్యన్న పాత్రుడు ఈసారి తన కుమారుడు విజయ్ పాత్రుడుకు టిక్కెట్ కావాలని కొంచెం గట్టిగానే కోరుతున్నారు. అయితే అయ్యన్నపాత్రుడుకు ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడే విలన్ గా మారారని చెప్పకతప్పదు. సన్యాసి పాత్రుడు లేఖను నేరుగా అయ్యన్నకు చూపించినట్లు తెలుస్తోంది. అయ్యన్నపాత్రుడు నిర్వహించిన శాఖల్లో విజయ్ జోక్యం ఏ విధంగా చేసుకున్నారన్నదీ సన్యాసిపాత్రుడు వివరంగా లేఖ రాయడంతో విజయ్ కు టిక్కెట్ కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది.

నో చెప్పేశారట….

ఇక పత్తికొండ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్న కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు విషయంలోనూ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. ఆయన హత్య కేసులో ప్రమేయం ఉండటంతో తప్పుడు సంకేతాలు వెళతాయని ఈసారికి మీరే పోటీ చేయాలని కేఈకి సూచించినట్లు చెబుతున్నారు. అయితే కేఈ మొండిపట్టు పడుతుండటంతో శ్యాంబాబుకు టిక్కెట్ చివరి నిమిషంలోనైనా వస్తుందంటున్నారు. ఇక విశాఖజిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు బండారు అప్పలనాయుడు అభ్యర్థిత్వానికి సీఎం నో చెప్పారట. అప్పలనాయుడు విశాఖ భూదందాలో ప్రమేయం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు రావడంతో ఆయన ప్రతిపాదనకు చంద్రబాబు నో చెప్పినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

పరిటాలకు కూడా…

ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిపై కూడా అనేక ఆరోపణలు విన్పిస్తున్నాయి. బొజ్జల మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా సుధీర్ రెడ్డి దందాలు ఎక్కువయ్యాయని సీఎం కు రిపోర్ట్ అందడంతో ఆయన అభ్యర్థిత్వంపై ఆలోచిస్తున్నారు. ఇక పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. తల్లి సునీతకు అసెంబ్లీ టిక్కెట్ తనకు ఎంపీ టిక్కెట్ కావాలని కోరుతున్నారు. అయితే అనంతపురం జిల్లాలో శ్రీరామ్ వేలు పెట్టని వివాదం లేకపోవడంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పేశారట. ఇద్దరిలో ఒకరికే ఇస్తానని ఎవరికి కావాలో తేల్చుకోవాలని వారి ఎదుటే కుండబద్దలు కొట్టేశారట చంద్రబాబు. ఇలా పార్టీ పాత తరం నేతలకు చంద్రబాబు ‘‘సన్’’ స్ట్రోక్ ఇచ్చేటట్లే ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 23792 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*