సీన్ రిపీట్స్ … సేమ్ సక్సెస్…?

chandrababunaidu suceessway

అదే సీను మరోసారి రిపీట్ చేయాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. సెంటిమెంటును ప్రజలపై ప్రయోగించబోతున్నట్లు గతంలోనే స్పష్టమైపోయింది. రాజకీయంగానూ 2014 నాటి ఘట్టాలను పునరావృతం చేయాలనేది కొత్త ఆలోచన. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టంగట్టడానికి ఏయే అంశాలు కారణమయ్యాయో వాటినే ఈ సారి కూడా నమ్ముకోవాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారు. ఇటీవల జరుపుతున్న అన్ని సమావేశాల్లోనూ పార్టీ అగ్రనాయకత్వానికి ఇదే విషయమై నూరిపోస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారానే ఏపీ అవసరాలు తీరతాయని, ఆకాంక్షలు నెరవేరతాయనే అంశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలను రాజధానికి తీసుకొచ్చి చూపిస్తున్నారు. తద్వారా పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నాయన్న సంగతిని జిల్లాల వారీగా చర్చనీయం చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఏపీని ముందు వరసలో నిలిపేందుకు శతవిధాలుగా కృషి చేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఎన్నికల ప్రణాళిక, అవినీతి, చేసిన పనుల వంటివి పెద్దగా పనికొచ్చే సరుకులు కాదని తెలుగుదేశం గుర్తించింది. దీనికనుగుణంగా ప్రచారప్రణాళికలో మార్పులు చేసుకుంటోంది.

తెరవెనకకు అవినీతి…

2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతిని ప్రధానాంశంగా ఉపయోగించుకుంది తెలుగుదేశం. లక్ష కోట్లరూపాయల దోపిడీ అంటూ ప్రజల్లో వ్యతిరేక భావాన్ని రేకెత్తించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నించింది. కొంతమేరకు సక్సెస్ సాధించింది. అప్పట్లో కాంగ్రెసు అధికారంలో ఉంది కాబట్టి రాజశేఖరరెడ్డి కుమారునిగా జగన్ తన ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంది. అందువల్లనే టీడీపీ ప్రచారానికి కొంతమేరకు విశ్వసనీయత వచ్చింది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. నియోజకవర్గాల్లో ఇసుక పంపిణీ మొదలు కాంట్రాక్టుల వరకూ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి విషయంలో జగన్ ను గతంలోబూచిగా చూపితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ అధికారపార్టీ తరఫున చాలామంది బూచిలు కనిపిస్తున్నారు. ఇక రాష్ట్రస్థాయిలో లోకేశ్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పైపెచ్చు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనే నెంబర్ టు. వైఎస్ హయాంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జగన్ ఎటువంటి కీలకపాత్ర పోషించలేదు. అందువల్ల అవినీతి అంశాన్ని పెంచి పెద్దది చేయడం వల్ల రివర్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందులోనూ ప్రజలు అవినీతిని పెద్ద సీరియస్ అంశంగా తీసుకోవడం లేదు.

అభివృద్ధి హంబగ్…

అభవృద్ధికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదని తాజా సర్వేల్లో తేలింది. ప్రజలు తమకున్న సమస్యలు చెబుతున్నారు. మాకేంటి? అన్న కోణంలోనే ప్రశ్నిస్తున్నారు. సామాజికంగా జరిగిన పనులను ప్రభుత్వ బాధ్యతగానే భావిస్తున్నారు. రహదారుల విస్తరణ, సిమెంటు రోడ్లు, విద్యాలయాల ఏర్పాటు , పరిశ్రమల కల్పన వంటివి పెద్దగా ఓట్ల వర్షం కురిపించేందుకు అవకాశం లేదని కూడా టీడీపీ అధినేతకు నివేదికలు వచ్చాయి. ప్రజలు సెల్ఫ్ సెంట్రిక్ గా మారిపోయారు. వ్యక్తిగతంగా తమకు సమకూరిన ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నారు. తమను బాగా చూసుకునే ప్రభుత్వానికే ఓటు వేయాలనుకుంటున్నారు. రాష్ట్రానికి , జిల్లాకు, నియోజకవర్గానికి చేసే పనుల పేరిట ఓట్లు తెచ్చుకోవడం కష్టమే. వ్యక్తిగత సంక్షేమ పథకాలు, అందులోనూ నగదు రూపంలో ఇచ్చేవాటిపైనే ప్రజల మొగ్గు కనిపిస్తోంది. తెలంగాణలో అధికారపార్టీ స్వీపింగ్ విక్టరీకి అదే కారణం. దీనినే ప్రతిబింబింప చేయాలని తెలుగుదేశం యోచిస్తోంది. అభివృద్ధి పేరు చెప్పడానికే తప్ప ఎన్నికల గోదాలో పెద్దగా పనిచేయదనే అంచనాకు వచ్చేసింది టీడీపీ అధిష్ఠానం.

సెంటిమెంటు..సొమ్ములు…

ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశాలనే మరోసారి ప్రజాతీర్పునకు ప్రాతిపదిక చేయాలనుకుంటోంది తెలుగుదేశం. ఈనేపథ్యంలోనే ప్రత్యేక హోదా, యాంటీ మోడీ సెంటిమెంటును ప్రధానాంశం చేస్తున్నారు. దీనిపై కూడా ఒక అంచనా సర్వే నిర్వహించారు. బీజేపీ, మోడీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోంది. అందుకే వైసీపీని మోడీతో ఎంతగా జత కట్టగలిగితే అంతగా టీడీపీకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ జోడీని కూడా ప్రజల్లో చర్చనీయం చేయాలనుకుంటున్నారు. డబ్బు అనేది మరో ప్రధానాస్త్రం. ఏదో రకంగా మేనేజ్ చేసి ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ సొమ్ము కనీసం పదివేల రూపాయలు అయినా ఎన్నికలకు ముందుగా పడేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఆర్థికంగా రక్షణ కల్పించేలా తెలంగాణ తరహాలో రైతుబంధును ఆచరణలోకి తెచ్చేందుకు నిర్ణయమైపోయింది. అమలుకు అవసరమైన నిధుల సమీకరణపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోంది. బ్యాంకులు, ప్రయివేటు ఆర్థిక సంస్థల ద్వారానైనా ఇందుకు అవసరమైన నిధులను రాబట్టాలని యత్నిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 37844 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*