
ఏపీలో ఈ ఎన్నికల్లో కొన్ని హాట్ హాట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ? గెలుస్తుంది అన్నది స్టేట్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో మంత్రులుగా ఉన్న వారు, సీనియర్ నేతలు, విపక్ష పార్టీ కీలక నేతలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో విపక్ష పార్టీల నుంచి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పుడు అక్కడ గెలుపోటములు ఎలా ? ఉంటాయో అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇలాంటి హాట్ హాట్ నియోజకవర్గాల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం ఒకటి. టిడిపిలో వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ రావు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి దెందులూరులో వరుస విజయాలు సాధిస్తున్న ప్రభాకర్ వరుసగా మూడోసారి పోటీలో ఉన్నారు.
ఎవరు ఎదురు చెప్పినా….
ఈసారి వైసీపీ నుంచి కొఠారు అబ్బయ్య చౌదరి రూపంలో ప్రభాకర్‌కు బలమైన ప్రత్యర్థి రంగంలో ఉన్నారు. ప్రభాకర్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక విప్ పదవి రావడంతో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో విపక్ష పార్టీ నేతలను తీవ్రంగా అణచివేయటం ఒక ఎత్తు అయితే… ఇటు సొంత పార్టీ నేతలు సైతం తీవ్రమైన అవమానాలకు గురి చేశారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇటు ఐదేళ్లలో నియోజకవర్గంలో తనకు అడ్డు వచ్చిన అధికారులపై దాడులకు దిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పార్టీ లో ఎంత సీనియర్ నేతలు అయినా ప్రభాకర్‌కు ఎదురు చెప్పే ధైర్యం లేక నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. వీళ్లంతా ఈ ఎన్నికల్లో ప్రభాకర్‌కు యాంటీగా పనిచేశారు.
ఒక ఓటు అబ్బయ్యకు.. ఒక ఓటు మాగంటికి..!
దెందులూరు నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోనూ పార్టీ ఏదైనా…. పెత్తనం మాత్రం ఈ సామాజిక వర్గానిదే. ఈ ఎన్నికల్లో ఈ సామాజికవర్గంలో మూడు వంతుల మందికి పైగా కీలక నేతలంతా ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పని చేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన టిడిపి కీలక నేతలు కూడా కొన్ని గ్రామాల్లో ప్రభాకర్ చేతిలో అవమానాలకు గురయ్యారు. వీరంతా ఎంపీ ఓటు మాగంటి బాబుకి వేయమని… ఎమ్మెల్యే ఓటు మాత్రం ప్రభాకర్‌కు వేయవద్దని పార్టీ క్యాడర్‌కు చెప్పడం ద్వారా పరోక్షంగా వైసీపీకి సహకరించారు. గత రెండు ఎన్నికల్లోనూ దెందులూరు నియోజకవర్గంలో టిడిపి పరంగా క్రాస్ ఓటింగ్ జరుగలేదు. ఈ ఎన్నికల్లో చింతమనేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కమ్మ సామాజిక వర్గం తమ అనుచరులతో చాలా వరకు మాగంటికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయించింది.
మాగంటికి ఎక్కువ ఓట్లు వస్తే….?
అయితే ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావం ఎంతవరకు ఉందన్నది ప్రస్తుతానికి పూర్తిగా తెలియకపోయినా దీనిపై భారీ ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ కంటే మాగంటి బాబుకు ఎక్కువ ఓట్లు వస్తే రగడ చేయటానికి చింతమనేని కాచుకొని కూర్చుని ఉంటాడు. రేపటి ఫలితాల్లో ప్రభుత్వం వచ్చి… చింతమనేనికి మాగంటి కంటే ఓట్లు తగ్గితే ఏయే గ్రామాల్లో తనకు ఓట్లు తగ్గాయి, ఆ గ్రామాల్లో తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై చింతమనేని తీవ్రంగా విరుచుకు పడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
Leave a Reply