
టీడీపీలో అత్యంత హాట్ టాపిక్, హాట్ నాయకుడు ఉన్నాడంటే.,. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయన నోరు విప్పినా.. అడుగు తీసి అడుగు వేసినా.. ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ తిరుగు తూనే ఉంటుంది. ఎంత మంది ఎన్ని హితబోధలు చేసినా.. ఆఖరుకు అధినేతే ఆగ్రహించి… క్లాస్ పీకినా.. ఆయన మారరు. ఇప్పుడు అచ్చు.. ఇలాంటి నాయకుడే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోకవర్గంలో కనిపిస్తున్నాడంటూ.. సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. నోటిదురదను దేవుడైనా తీర్చలేడనే .. సామెతను ఈ నాయకుడు నిరూపిస్తున్నాడు. దీంతో ఈయన పెడుతున్న సభలకు, పాల్గొంటున్న సమావేశాలకు.. జనాలు ఎందుకు వచ్చామా? అని అనిపించుకునే రేంజ్‌కు దిగజారిపోతున్నాడు.
బాబు సొంత నియోజకవర్గంలో….
మరి ఆ నాయకుడు ఎవరు? కథేంటో చూద్దాం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు అత్యంత బలమైన నియోజకవర్గంగా ఉండి.. వరుస విజయాలతో దూసుకుపోయిన నియోజకవర్గం చిత్తూరు జిల్లా చంద్రగిరి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి.. వైసీపీ జెండాను పాతారు. అంతేకాదు.. ఈయన ఇప్పుడు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. చాలా వేగంగా స్పందించడం.. ఎలాంటి వారినైనా తమ్ముడూ.. అన్న.. అంటూ కలిసి పోవడం ఆయన మాస్ ఇమేజ్ను మరింతగా పెంచింది. సాధారణ వస్త్రధారణతో నిత్యం ప్రజలలో ఉండే .. చెవిరెడ్డి అంతే వేగంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబునే ఆయన లక్ష్యంగా చేసుకుని అటు అసెంబ్లీలోను, ఇటు బయట కూడా చెలరేగిపోతున్నారు.
చెవిరెడ్డి విమర్శలతో…..
ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబుకు చెవిలో జోరీగ మాదిరిగా చెవిరెడ్డి మారిపోయారు. ఇదిలా ఉంటే చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ పాగా వేసేందుకు టీడీపీ, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు. దీంతో ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చెవిరెడ్డిని ఓడించాలని కసి పెంచుకున్నారు చంద్రబాబు. దీంతో తరచుగా ఈ నియోజకవర్గం విషయాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తూ.. నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, ఇక్కడి నాయకులు బాబు మాటలు చెవినెక్కించుకోకుండా.. పార్టీని పుట్టిముంచే పని పెట్టుకున్నారు.
అంతా వ్యాపారాలతోనే…..
ఇక్కడ నాయకులు ప్రజల్లో ఉండరు. సెటిల్మెంట్లు, వ్యాపార వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలు.. వెరసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇక, తాజాగా ‘ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి నేను గాంధీని కాదు. రెండు చెంపలూ పగలకొడతాం. నేను తలచుకుంటే నియోజకవర్గంలో ఒక్క వైసీపీ ఫ్లెక్సీ కూడా ఉండదు. మా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటా. వారి జోలికి వస్తే ఊరుకోను’ అని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నాని వైసీపీ నాయకులను హెచ్చరించడం మరింత దుమారానికి దారితీసింది. ఇది టీడీపీకి ప్లస్ కాకపోగా.. “రేపు మేం ప్రశ్నించినా.. మేం విమర్శించినా.. ఇంతేనా?!“ అంటూ ఇక్కడ టీడీపీ నాయకుల తీరుపై విమర్శల పరంపర కొనసాగుతోంది. మరి ఇలా అయితే.. చంద్రగిరిలో ఎలా తమ్ముడూ.. !! అంటున్నారు విశ్లేషకులు.
Leave a Reply