వివాదాల నేతకు విక్టరీ ఎంత దూరం..?

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం దెందులూరు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు చుట్టూ విస్తరించి ఉన్న దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాలతో పాటు ఏలూరు రూరల్‌ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. దెందులూరు పేరు చెపితే మనకు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్‌రావు పేరే గుర్తుకు వస్తుంది. నిత్యం వివాదాలతో సహవాసం చేసే కాంట్రవర్సి కింగ్‌గా పేరున్న చింతమనేని దెందులూరులో 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. సామాజిక సమీకరణల పరంగా చూస్తే నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రధాన పార్టీలు కమ్మ సామాజికవర్గానికే సీట్లు కేటాయిస్తుండగా ఆ సామాజికవర్గం వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు.

ఒక్క 1994లో మినహా…..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఈ మూడున్నర దశాబ్దాల్లో ఒక్క 1994లో కాంగ్రెస్‌ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలు ఇక్కడ కమ్మ సామాజికవర్గానికే సీట్లు కేటాయిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ నుంచి ఎన్టీఆర్‌ సమీప బంధువు గారపాటి సాంబశివరావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85లో గారపాటి సాంబశివరావు ఇక్కడ వరుసగా రెండు సార్లు గెలిచారు. 1989లో జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాశించిన మాజీ మంత్రి మాగంటి రవింద్రనాథ్‌ చౌదరి విజయం సాధించగా, ఆ తర్వాత ఆయన హఠాత్‌ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి వరలక్ష్మీదేవి విజయం సాధించి ఆమె కూడా మంత్రిగా పని చేశారు. తిరిగి 1994, 99 ఎన్నికల్లో సాంబశివరావు గెలిచారు. 2004లో ర‌వీంద్ర‌ తనయుడు మాగంటి వెంకటేశ్వరరావు గెలిచి మంత్రిగా పని చేశారు.

వివాదాలతో సహవాసం చేస్తున్నా…..

నియోజకవర్గంలో విశిష్ట‌త ఏంటంటే మాగంటి ఫ్యామిలీలో తల్లి, తండ్రితో పాటు కుమారుడు బాబు సైతం ఎమ్మెల్యేగా గెలిచారు. వీరు ముగ్గురు మంత్రులుగా కూడా ప‌నిచేశారు. విచిత్రం ఏంటంటే వీరు ముగ్గురి చేతుల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి సాంబశివరావు ఓడిపోయారు. 2009లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్‌రావు విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ ఆయన వరుసగా రెండో సారి గెలిచారు. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లల్లో జరిగిన అభివృద్ధిని చూస్తే ప్రభాకర్‌ నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్నా, సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని విమర్శలు ఉన్నా… నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్నారు. నియోజకవర్గంలో చిన్న సామాన్య కార్యకర్త నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండడంతో పాటు అభివృద్ధి విషయంలో రాజీపడని మనస్థత్వం ప్రభాకర్‌ది.

విలక్షమైన లీడర్ గా…..

ఈ క్రమంలోనే జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే ప్రభాకర్‌ విలక్షణమైన వ్యక్తిగా కనిపిస్తారు. ప్రభాకర్‌పై రకరకాల ఆరోపణలతో ఆయన మీడియాలోనూ, స్టేట్‌ వైడ్‌గా ఎలా జనాల నోళ్ల‌లో నానుతారో నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలోను కాస్త అటూ ఇటుగా అదే విధంగా నానుతుంటారు. వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు నాలుగురు సమన్వయకర్తలను నియమించిన జగన్‌ చివరకు ఈ నలుగురినీ కాదని ఎన్నికలకు ముందు అప్పటి వరకు తణుకు ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును తీసుకొచ్చి ఇక్కడ ప్రభాకర్‌పై పోటీకి దింపారు. అసలే ప్రభాకర్‌ దూకుడు ముందు ఆగలేని కారుమూరి స్థానికేత‌రుడు కావడం, సామాజిక సమీకరణలు సెట్‌ కాకపోవడంతో ఆయనపై ప్రభాకర్‌ సులువుగానే వరుసగా రెండో సారి విజయం సాధించారు.

జగన్ వ్యూహంతో…..

రెండో సారి గెలిచి విప్‌ అయ్యాక ప్రభాకర్‌ ఆగడాలు, దూకుడు మితి మీరడంతో సొంత సామాజికవర్గంతో పాటు బీసీల్లో గెలుపు, ఓటమిలను శాశించే కొన్ని కులాలు, కొల్లేరులో మరో సామాజికవర్గం ఆయనపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇక్కడ వైసీపీ అధినేత జగన్‌ వేసిన ఎన్నారై వ్యూహం కొంత వరకూ సత్ఫలితాలను ఇచ్చింది. 2009లో ప్రభాకర్‌ చేతిలో ఓడిపోయిన కొటారు రామచంద్రరావు తనయుడు యూరప్‌, యూకే వైసీపీ కన్వినర్ కొఠారు అబ్బయ్య చౌదరికి జగన్‌ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లోనూ దాదాపుగా ఆయనకే టిక్కెట్ ఖ‌రారు చేశారు. ఈ నేపథ్యంలో యువకుడు, ఉన్నత విద్యావంతుడు అయిన అబ్బయ్య చౌదరి వివాదాలకు దూరంగా ఉండడంతో పాటు, సౌమ్యుడు కావడం, ప్రభాకర్‌ సామాజికవర్గానికే చెందిన వ్యక్తి కావడంతో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు.

పర్సనల్ ఇమేజ్ తో……

ప్రభాకర్‌ తీరుతో విసికిపోయిన ఆయన సొంత సామాజికవర్గ మనుషులే కాకుండా ఇతర కులాలను కొంత వరకూ ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న న్యూట్రల్‌ జనాల్లో కూడా అబ్బయ్య చౌదరి తన వ్యక్తిత్వంతో, ప్రశంగాలతో చొచ్చుకుపోవడం విశేషం. వాస్తవంగా చూస్తే కొంత వరకూ తన ప‌ర్స‌న‌ల్‌ ఇమేజ్‌ను కూడా అబ్బయ్య చౌదరి తక్కువ టైమ్‌లోనే క్రియేట్ చేసుకోవ‌డం అంటే…. అది కూడా ప్రభాకర్‌ లాంటి ఒక శక్తిని ఢీ కొట్టి రోజురోజుకు బలంగా ఎదుగుతున్నాడంటే సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. అయితే నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి కేడర్‌ టీడీపీలో బలంగా ఉంది. పార్టీ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీగా ఉండేవారి సంఖ్య టీడీపీలో వందల సంఖ్యలో ఉంటే వైసీపీలో వేళ్ల మీద లెక్కపెట్టే వారు కూడా లేకపోవడం మైనస్‌.

దీన్నిబట్టే విజయావకాశాలు…..

నియోజకవర్గంలో ప్రస్తుతం నాలుగు మండలాల పరిస్థితి చూస్తే రెండు మండలాల్లో వైసీపీకి ఎడ్జ్‌ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మరో రెండు మండలాలు టీడీపీకి కాస్త ఫేవర్‌గా ఉన్నాయి. టీడీపీకి ఫేవర్‌గా ఉన్న ఆ రెండు మండలాల్లో ఆ పార్టీ మెజారిటీని తగ్గించడాన్ని బట్టీ వైసీపీ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల నియోజకవర్గ కేంద్రం అయిన దెందులూరులో బహిరంగ సభ పెట్టి ప్రభాకర్‌కు సవాళ్లు రువ్వడం ఆ సవాళ్లుకు ప్రభాకర్‌ కౌంటర్‌ ఇవ్వడం జరిగిన సంగతి తెలిసిందే. ప్రభాకర్‌ను ఎలాగైన ఓడిస్తానని జనసేన అధినేత శపథం చేసిన సంగతి తెలిసిందే. వాస్తవంగా చూస్తే దెందులూరు నియోజకవర్గంలోజనసేన ప్రభావం నామ‌మాత్రమే. మరి పవన్‌ ఇక్కడ ప్రత్యేక స్ట్రాట‌జీ ప్లే చేసి అభ్యర్థి ఎంపికలో ఏదైన ట్విస్ట్‌ ఇస్తే అది ప్రభాకర్‌ మీద కొంత వరకూ ప్రభావం చూపే ఛాన్స్‌ ఉంది. వైసీపీ అధినేత జగన్‌ సైతం ప్రభాకర్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి జగన్‌, పవన్‌ ఈక్వేషన్లు, వ్యూహాలు దెందులూరులో ప్రభాకర్‌ను ఎంత వరకూ ఓడిస్తాయో ? లేదా తిరిగి ప్రభాకర్ హ్యాట్రిక్‌ కొడతారా ? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 19220 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*