వైసీపీ ఉచ్చును తొలగించుకున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో మరోసారి పడదలచుకోలేదని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. వైసీపీని తమను ఉచ్చులోకి లాగుతుందన్న విషయాన్ని చంద్రబాబు ఎట్టకేలకు గ్రహించారు. అందుకే ఆయన రాజీనామాలపై తన మనసులో మాటను బయటకు చెప్పేశారు. పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చుంటే ఎవరు పోరాటం చేస్తారని ప్రశ్నించారు. రాజీనామాల వల్ల హోదా వస్తుందా? అని ఆయన ఎదురుదాడికి దిగారు. అంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా తన పార్టీకి చెందిన ఎంపీలు మాత్రం రాజీనామా చేయబోరని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

వైసీపీ ట్రాప్ లో పడ్డారంటూ….

ఇప్పటికే చంద్రబాబు వైసీపీ ఉచ్చులో పడిపోయారన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులను తప్పించడం, ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలడం అంతా వైసీపీ చెప్పినట్లే నడిచిందన్న వ్యాఖ్యలు టీడీపీలోనే విన్పిస్తున్నాయి. వైసీపీ డిమాండ్ చేయడం….చంద్రబాబు అమలు చేయడం రొటీన్ గా మారిందని టీడీపీ సీనియర్ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకోవడం కూడా జరుగుతుంది. జగన్ ప్రకటించిన తర్వాత అడుగులు వేస్తున్నారని, ఇది సరికాదని ఒకరిద్దరు సీనియర్లు చంద్రబాబు ఎదుట కూడా అనడం గమనార్హం.

రాజీనామాల వల్ల ఉపయోగం లేదని….

ఈ నేపథ్యంలో మరో సారి జగన్ ట్రాప్ లో పడేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. ఈ నెల6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని, 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలుచేస్తే కేంద్రం దిగివస్తుందని జగన్ ప్రతిచోటా చెబుతున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ టీడీపీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు గట్టిగా ఉన్నట్లు కన్పిస్తోంది. రాజీనామాలతో ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం తేల్చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈవిషయాన్ని వెల్లడించారు.

వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయం….

వైసీపీ నాటకాలన్నీ ప్రజలకు తెలుసునన్న చంద్రబాబు రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఎవరు పోరాటం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డాయని కూడా చెప్పారు. వైసీపీతో జత కడితే తమకు ఇబ్బంది లేదని భావించిన బీజేపీ ఏపీకి అన్యాయం చేసేందుకు సిద్ధమయిందన్నారు. వైసీపీలా తెలుగుదేశం పార్టీ లోపాయి కారీ పార్టీ కాదని, తాము ఏపీ హక్కులు సాధించేంత వరకూ నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. జాతీయ నేతలు కూడా తన పోరాటానికి మద్దతిచ్చారని చంద్రబాబు తెలిపారు. మొత్తం మీద చంద్రబాబు మాత్రం ఎంపీల చేత రాజీనామాలు చేయిండానికి ఇష్టపడటం లేదు. ఇందుకు కారణం జగన్ అన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 27687 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*