
ఢిల్లీ లో ఆమరణ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎంపీల జోకులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ ఎంపీలు జోకుల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎంపీల జోకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకపక్క సీఎం రమేష్ సీరియస్ గా దీక్షను కొనసాగిస్తుంటే ఈ జోకులేమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను కలవడానికి ముందు ఈ జోకులు వేసుకున్నారు ఎంపీలు. మురళీ మోహన్ మాట్లాడుతూ తాను ఐదు కేజీలు తగ్గుదామనుకుంటున్నానని, అందుకు వారం రోజులు దీక్ష చేస్తానని నవ్వుతూ చెప్పారు.
ఆయన్నెందుకన్న కనకమేడల…..
అలాగే జేసీ దివాకర్ రెడ్డి కల్పించుకుని అవంతి శ్రీనివాస్ అయితే స్ట్రాంగ్ అని ఆయనను దీక్షకు దించుతామన్నారు. ‘‘ఆయనను ఎందుకు? ఒకరోజుకే రాంమనోహర్ లోషియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది’’అని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈ సరదా సంభాషణలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఎంపీల వివరణ కోరారు చంద్రబాబు. తాము మాట్లాడిన మాటల్లో కొన్నింటిని కట్ చేసి అతికించి పోస్ట్ చేశారని మురళీమోహన్ వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై విచారణ జరుపుతామని, సీఎం రమేష్ దీక్షను హేళనగా చేసేటట్లుగా మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. మొత్తం మీద ఎంపీల జోకులు పార్టీకి తలనొప్పిగా మారాయి.
Leave a Reply