కాంగ్రెస్ లో కొత్త పోకడ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి పక్కనపెడితే… అభ్యర్థుల ఎంపిక వ్యవహారం గతంలో ఎన్నడూ లేనంత పకగ్భందీగా జరుగుతున్నట్లు కనపడుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఢిల్లీలో జరిగేది. ఢిల్లీలో పైరవీ చేసుకోగలిగిన వారికే టిక్కెట్లు దక్కేవి. దీంతో తమ గాడ్ ఫాదర్ల ద్వారా ఢిల్లీలో టిక్కెట్ కోసం ప్రయత్నించేవారు నేతలు. అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా భక్తచరణ్ దాస్, సభ్యులుగా జ్యోతిమణి సెన్నిమలై, శర్మిష్ఠ ముఖర్జీను నియమించారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వీరు ఎన్నికల రెండు నెలల క్రితమే పని ప్రారంభించారు. అయితే, ఇటువంటి కమిటీలు గతంలో కూడా కాంగ్రెస్ వేసేది. కానీ గతంలో వీరి ముందు బలప్రదర్శన, ఇతర ప్రయత్నాల ద్వారా టిక్కెట్లు తెచ్చుకునే వారు. కానీ, ఈసారి ఈ కమిటీ ముందు ఆశావహుల పప్పులేం ఉడకలేవు.

ఒక్కొక్కరి ఇంటర్వ్యూ…

మొదట ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున పేర్లను డీసీసీ నుంచి తెప్పించుకున్న ఈ కమిటీ వారిని ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడింది. టిక్కెట్ ఆశిస్తున్న వ్యక్తి బలాబలాలను అంచనా వేసింది. తర్వాత ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరి చొప్పున లిస్టును సిద్ధం చేసి పార్టీ పెద్దల ముందు ఉంచింది. ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా తీసుకున్న ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికకు గతంలో ఎన్నడూ లేనంత కసరత్తు చేసింది. నియోజకవర్గాల్లో పరిస్థితులను అంచనా వేస్తూ ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. గతంలో లాగా రాష్ట్ర నేతల ప్రమేయం పెద్దగా లేకుండానే అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేసింది.

చొరవ తీసుకుంటున్న భక్త చరణ్ దాస్

ఒడిషాకు చెందిన ఎంపీ భక్త చరణ్ దాస్ అధ్యక్షతన ఈ కమిటీ బాగా పనిచేస్తుందనే కాంగ్రెస్ సీనియర్ నేతలే అంటున్నారు. టిక్కెట్లు దక్కని వారిలో అసమ్మతి రేగుతుందని అంచనా వేసిన ఆయన ముందుగానే ఆశావహులను ఢిల్లీకి పిలిపించారు. ఒక్కో నియోజకవర్గానికి చెందిన ఆశావహులను పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు పార్టీకి ఎంత కీలకమో చెప్పి కచ్చితంగా కలిసి పనిచేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఆశావహుల వద్దకు భక్త చరణ్ దాస్ నేరుగా వచ్చి వారిని బుజ్జగించారు. మొత్తానికి సమయం ఎక్కువగానే తీసుకున్న అభ్యర్థుల ఎంపిక మాత్రం పక్కా చేస్తున్నారని, అన్ని విధాలుగా విశ్లేషించి సరైన అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తున్నారని రాష్ట్ర స్థాయి నాయకులు అంటున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*