‘న్యాయం’ మీరే చెప్పాలి…?

అమరావతి

వివాదాస్పద అంశాల విషయంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ఈ దేశ న్యాయస్థానాలే రక్షిస్తున్నాయని చెప్పాలి. అమరావతి, మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అత్యంత కీలకమైన దశలో ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిపాలన వికేంద్రీకరణకు చట్ట రూపం ఇచ్చింది. ప్రతిపక్షాలు అన్నిరకాలుగా దీనిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఎవరూ వెనక్కి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో మధ్యేమార్గంగా న్యాయస్థానమే ఈ వివాదానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వానికి ఉన్న అధికారాలు, తాజా చట్టాల రాజ్యాంగ బద్ధతపై న్యాయస్థానాలు స్పష్టత నిస్తే దీనికొక ముగింపు వస్తుంది. పార్టీల గందరగోళానికి ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ అంత తొందరగా అది సాధ్యమవుతుందా? అంటే ప్రశ్నార్థకమే.

న్యాయ సమీక్షల కోర్టులో…

రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ కు తొలి నుంచీ గండమే. మదరాసు నుంచి విడిపోక ముందే ఆ నగరంపై మక్కువతో , ఆ ప్రాంత అభివృద్ధిలో తమ వాటాను డిమాండ్ చేస్తూ ఏపీకి కేటాయించాలని 1950 ప్రాంతాల్లోనే నాయకులు డిమాండ్ చేశారు. కానీ సఫలం కాలేకపోయారు. తర్వాత కర్నూలు రాజధాని, ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ ఏర్పాటు, హైదరాబాద్ కు తరలింపు వంటివన్నీ చకచకా జరిగిన పరిణామాలు. తెలంగాణ నుంచి విడిపోవాల్సి వచ్చిన సందర్భంలోనూ హైదరాబాద్ పై పట్టుపట్టారు. ఫలించలేదు. చివరికిప్పుడు అమరావతి, మూడు రాజధానులు ముందుకొచ్చాయి. నిజానికిది రాజకీయపరమైన నిర్ణయమే. అమరావతి ఏక రాజధానిగా అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నిర్ణయించింది. మూడు కావాలంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కోరుకుంటోంది. రెంటికీ పెద్దగా తేడా లేదు. అయితే పునర్విభజన చట్టం, రైతులతో భూముల ఒప్పందాలు, హైకోర్టు ఏర్పాటు అంశాల్లో కొంత సంక్లిష్టత ఉండటంతో పార్టీలు న్యాయసమీక్ష కోరుతున్నాయి. న్యాయవాదులు పాత కేసుల దుమ్ము దులుపుతున్నారు. ఇప్పటికే రాజధానికి సంబంధించి అనేక కేసులు కోర్టుల్లో ఉన్నాయి. చట్టం రూపుదాల్చిన తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో మరిన్ని కేసులు పెరగనున్నాయి. మరోవైపు ప్రభుత్వం కేవియట్ ఏర్పాట్లలో పడింది. గతంలో ప్రభుత్వం హైకోర్టుకు ఒక విషయంలో హామీ ఇచ్చింది. శాసన ప్రక్రియ పూర్తయ్యేవరకూ రాజధానిని తరలించబోమని చెప్పింది. ఇప్పుడు చట్టమే వచ్చేసింది కాబట్టి సాంకేతికంగా చూస్తే తన వాదనకు కట్టుబడి నట్లే చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీల ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత రైతులకు తెలిసి వస్తున్నాయి. అందువల్ల న్యాయపోరాటంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు.

చేతులెత్తేసినట్టేనా….?

పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. కానీ ఆమేరకు ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. తటస్థ పాత్రకే సామాన్యుడు పరిమితమై పోయాడు. దీంతో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు చేతులెత్తేయక తప్పని స్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు కదిలింది. మూడు రాజధానులపై టీడీపీ నిరసనలు, ఆందోళనలకు పిలుపునిస్తే.. ముఖ్యమంత్రి చిత్రపటానికి వైసీపీ పాలాభిషేకాలు చేస్తూ సమస్యను తటస్థం చేసేసింది. సీఆర్డీఏ రూపంలో ఉన్న రాజధాని అభివృద్ధి సంస్థ స్థానంలో అమరావతి నగర అభివృద్ధి అథారిటీని అమల్లోకి తెచ్చేసింది. చంద్రబాబు నాయుడు వంటి నేతలు అసెంబ్లీ రద్దు చేసి తేల్చుకుందామంటూ సవాళ్లు విసిరినా ప్రభుత్వ పక్షం నుంచి పెద్దగా స్పందన కనిపించే వాతావరణం లేదు. మిగిలిన రాజకీయ పార్టీల ప్రకటనల్లో సైతం నిస్సహాయతే కనిపిస్తోంది. బీజేపీకి మిత్రపక్షమైన జనసేన సైతం తన వైఖరిని తేల్చేసింది. ఈ రాజధానుల విషయంలో తన పాత్ర పెద్దగా ఉండబోదని పరోక్షంగా స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంలో ఆ రెండు పార్టీలే కొంప ముంచాయంటూ జనసేన తన పాత్రను కుదించుకుంది. మరోవైపు కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇదెలాగూ సాధ్యం కాదు కాబట్టి జనసేన రాజకీయంగా తనకు ఇబ్బంది కాకుండా, బీజేపీతో పొత్తుకు అసౌకర్యం కలగకుండా సేఫ్ గేమ్ ఆడాలని నిశ్చయించుకున్నట్లు తేటతెల్లమైపోయింది.

రాష్ట్రపతి, కేంద్రం వద్దకు…

కేంద్ర ప్రభుత్వం వద్దకు ప్రతినిధి బృందాన్ని పంపాలని ప్రతిపక్షాలు, అమరావతి పరిరక్షణ సమితి యోచన చేస్తున్నాయి. రాష్ట్రపతిని కలిసే ప్రయత్నంలోనూ ఉన్నాయి. నిజానికి ఇది రాజకీయ పార్టీల కంటి తుడుపు చర్య. అమరావతి విషయంలో జోక్యం చేసుకోదలచుకుంటే కేంద్రం గవర్నర్ ద్వారా ఇప్పటికే చట్టాన్ని తొక్కిపట్టి ఉండేది. అందులోనూ ఫిబ్రవరిలో పార్లమెంటు సాక్షిగానే రాష్ట్ర రాజధానుల విషయం మా పరిధిలోది కాదని చెప్పేసింది. ఇవన్నీ స్పష్టమైన సంకేతాలే. కేంద్రం రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి పరోక్షంగా మద్దతునిస్తోందని ఎవరికైనా అర్థమైపోతుంది. లాంఛనంగా, ఆనవాయితీగా కేంద్ర పెద్దలను కలిసి ఫిర్యాదు చేయవచ్చునేమో కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. న్యాయసమీక్ష, రాజకీయ పోరాటం వంటి అంశాలపైనే పెద్దగా ఫోకస్ చేయడం వల్ల రైతులకు న్యాయం జరగదు. వారిని దీర్ఘకాలం మభ్యపెట్టినట్లవుతుంది. అందువల్ల రైతులకు ఏం చేస్తే వారికి తీవ్ర నష్టం వాటిల్లకుండా బయటపడగలరో ఆ కోణంలో పార్టీలు యోచన చేస్తే మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగ బద్ధం కాదనే కేసు ఇంకా సుప్రీం కోర్టులో ఆరేళ్లుగా నడుస్తూనే ఉంది. మరోవైపు రెండు రాష్ట్రాలూ పనిచేసుకుంటూ పోతున్నాయి. అందువల్ల మరీ ఎక్కువగా న్యాయసమీక్షతో ప్రయోజనాలు వచ్చేస్తాయనే భ్రమలకు పోకుండా వాస్తవిక ధోరణితో ప్రభుత్వంతో సంప్రతింపులు జరపడమే మేలైన మార్గం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 29302 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*