
పొగడ్తకు కూడా విలువ ఉంటుంది. అది కోరేది కూడా వేరేది ఉంటుంది. అందునా రాజకీయ నాయకులు ఊరకే ప్రశంసలు కురిపించరు కదా. ఓ వైపు ఎన్నికల రుతువు మొదలైన వేళ ప్రతి గొంతులోనూ అదే గానం వినిపిస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ ఉన్నట్లుండి అన్నగారి జపం చేయడం ప్రారంభించారు. తమ కుటుంబానికి, ఎన్టీయార్ కి మధ్య ఎంతో అనుబంధం ఉందని కూడా గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి దాడి అంటే అన్న గారికి వల్లమాలిన ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరి ఇదంతా ఇపుడు ఎందుకని తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా చర్చించుకుంటున్నారు.
పిలుపు కోసమేనా….
విశాఖకు ఆ మధ్యన వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకోకుండా దాడి వీరభద్రరావుని కలసి కుశల ప్రశ్నలు అడిగిన సంగతి విదితమే. దాడి మా పార్టీ వాడేనని మీడియా ముందే ప్రకటించిన చంద్రబాబు తొందరలో కలుద్దామంటూ హామీ కూడా ఇచ్చేశారు. కానీ ఆ పిలుపు మాత్రం ఇంతవరకూ రాలేదు. దాంతో దాడి కుటుంబం రాజకీయ దారి ఎటో తెలియక తల్లడిల్లుతోంది. ఇంకో వైపు తమకు చిరకాల ప్రత్యర్ధిగా ఉన్న ఇదే అనకాపల్లికి చెందిన మరో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ టీడీపీలోకి వస్తున్నారన్న వార్తలు వారికి నిద్ర పట్టనీయడంలేదు అంటున్నారు. దశాబ్దాల తరబడి రాజకీయ పోరాటం చేసిన కొణతాల టీడీపీలో చేరితే తమకు అక్కడ ఏముంటుందన్న బెంగ కూడా పట్టి పీడిస్తోంది. కొణతాలకు ఆయన వియ్యంకుడు, అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఉన్నారు. తమకు అలాంటి సిఫార్సులు కూడా లేవు అంటూ దాడి ఫ్యామిలీ మదన పడుతోంది.
బాబు చెవిన పడేనా…?
ఈ నేపధ్యంలోనే దాడి కుమారుడు, రేపటి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న రత్నాకర్ అన్న గారి భజన ప్రారంభించారని అంటున్నారు. మరి తెలుగుదేశం నేతలు దాని ఆలకించి అయినా పార్టీలో చేరేందుకు అవకాశంతో పాటు టికెట్ కూడా ఇస్తారేమోనని పాత విషయాలను నెమరువేశారని అంటున్నారు. నిజానికి దాడికి ఇపుడు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందని అంటున్నారు. ఆయన్ని ఆ మధ్యన పవన్ కూడా పిలిచారు. అయితే టీడీపీలో ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుచరులు వత్తిడి తెస్తున్నారట. అలాగని బాబు పిలుపు కోసం వేచి ఉంటే ఇతర పార్టీలలో కూడా తలుపులు వేసేస్తారేమోనని కలవరపడుతున్నారు. ఇక టీడీపీలో చేరినా టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఉండనే ఉంది. కొణతాలకు అనకాపల్లి ఎంపీ టికెట్ కన్ ఫర్మ్ చేశారని టాక్ నడుస్తోంది. ఎటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. పార్టీలో చేరి ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయడానికేనా ఈ చేర్చుకోవడాలు అన్న సందేహాలు కూడా దాడి అనుచరుల్లో పెరిగిపోతున్నాయట. మొత్తానికి మాజీ మంత్రి కుటుంబం గతంలో ఎన్నడూ లేని రాజకీయ వత్తిడితో సతమవుతోందని అంటున్నారు.
Leave a Reply