దగ్గుబాటి ఎఫెక్ట్ మామూలుగా ఉండదా?

daggubati venkateswarao ysjaganmohanreddy

దగ్గుబాటి వెంకటేశ్వరరావును మామూలుగా అంచనా వేయడానికి వీలులేదు. ప్రకాశం జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి ఇది సులువుగా అర్థమవుతుంది. ఎలాంటి హడావిడి చేయరు. అయితే చాపకింద నీరులా ఆయన రాజకీయాలను నడపగలరు. ఎన్టీఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకోగలిగారు. ఆరోజుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు జిల్లాకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి వచ్చినట్లే. అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన వర్గం ఆయనతోనే ఉందా? తిరిగి దగ్గుబాటి కుటుంబానికి అక్కడి ప్రధాన సామాజికవర్గం అండగా నిలుస్తుందా? అన్నదే సందేహం.

సాదా సీదాగా కన్పిస్తారుకాని….

దగ్గుబాటి వెంకటేశ్వరరావు పైకి సాదాసీదాగా కన్పిస్తారే కాని… ప్రజల మనస్సులను అంచనా వేయడంలో దిట్ట. అటువంటి వెంకటేశ్వరరావు ఈసారి బరిలోకి దిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. తన కుమారుడు హితేష్ కు అమెరికా పౌరసత్వ సమస్య ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ లోగా ఆ సమస్యను పరిష్కరించుకుంటేనే హితేష్ రాజకీయ అరంగేట్రం ఉంటుంది. లేకుంటే దగ్గుబాటే స్వయంగా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అయితే ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్లు పర్చూరు నియోజకవర్గం వైసీపీలో ముసలం పుట్టిందనడం సరికాదన్నది అక్కడ స్థానికంగా ఉన్న వారికి మాత్రమే తెలుసు. బయట ప్రపంచానికి తెలియక పోవచ్చు. ఎందుకంటే పర్చూరుకేంద్రంగా దశాబ్దాల పాటు రాజకీయం నెరిపిన వ్యక్తి.

ఓడించే సత్తా….

ఎన్టీఆర్ పెద్దల్లుడిగా మాత్రమే కాదు.. ఆయన తండ్రి దగ్గుబాటి చెంచురామయ్య వారసత్వంగా ఆ నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తి డీవీఆర్. అయితే గత ఎన్నికల్లో ఓటమిపాలయిన గొట్టిపాటి భరత్ ను పక్కన పెట్టి అక్కడ రావి రామనాధం ను ఇన్ ఛార్జిగా నియమించింది. నిజానికి రామనాధం పార్టీ కోసం పనిచేస్తున్నా ప్రజల్లో పట్టు లేదని అందరికీ తెలుసు. పార్టీని ఏదో నడిపించాడు తప్ప మాస్ లీడర్ కానే కాదు. అందుకే వైసీపీ అధినాయకత్వం దగ్గుబాటిని రంగంలోకి దించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్ట్రాంగ్ అభ్యర్థి కావడంతోనే ఆయనను ఓడించ సత్తా ఒక్క దగ్గుబాటి కుటుంబానికి మాత్రమే ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించే జగన్ ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డిని వినియోగించి దగ్గుబాటిని తన గూటికి రప్పించుకున్నారు.

మూడు నియోజకవర్గాల్లోనూ….

దగ్గుబాటి కేవలం పర్చూరు నియోజకవర్గానికే పరిమితం చేయాల్సిన నేత కాదు. ఆయన ప్రభావం ఒక్క పర్చూరులోనే కాదు. అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో కూడా బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ టార్గెట్ లో ఈ మూడు నియోజకవర్గాలున్నాయి. అద్దంకి లో గత ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ పార్టీని విడిచి టీడీపీలోకి వెళ్లిపోయారు. అలాగే చీరాలలో నాయకత్వం బలహీనంగా ఉంది. దీంతో జగన్ ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించాలంటే దగ్గుబాటి తోడు జగన్ కు అవసరం. ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల్లోనూ దగ్గుబాటి తనదైన మార్కు చూపించి టీడీపీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం. అందుకే దగ్గుబాటిని ఏరికోరి తెచ్చుకున్నారు జగన్.

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*