
అవును… పోలింగ్ జరిగిన తర్వాత ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొద్డో గొప్పో క్లారిటీ వచ్చింది. కొన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండగా, మరికొన్ని చోట్ల టీడీపీ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో మాత్రం ఇంకా లెక్క తేలడం లేదు. అలాగని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. టీడీపీకే ఇక్కడ విజయావకాశాలు ఉన్నాయని మరికొందరు, సైలెంట్ ఓటింగ్ దగ్గుబాటికే అనుకూలంగా ఉంటుందని మరికొందరు చెబుతుండటం విశేషం.
పెట్టని కోట అయినా….
పర్చూరు నియోజకవర్గం దగ్గుబాటి కుటుంబానికి కంచుకోట. ఆయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈసారి రాజీకీయాలకు దూరంగా ఉందామనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన తన కుమారుడు హితేష్ చెంచురామ్ రాజకీయ భవితవ్యం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భార్య పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ ఏమాత్రం సంకోచించకుండా వైసీపీలో చేరిపోయారు. కానీ హితేష్ పోటీకి అమెరికా పౌరసత్వం అడ్డురావడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావునే వైసీపీ అధిష్టానం బరిలోకి దింపింది.
ప్రచారంలోనూ వెనుకంజ…
పర్చూరు నియోజకవర్గం వాస్తవానికి దగ్గుబాటికి కొట్టిన పిండి. అందరూ పరిచయస్థులే. గత రెండు ఎన్నికల్లోనూ అదే తరహాలో విజయం సాధించారు. అయితే ఈసారి ఆయన గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో కూడా దగ్గుబాటి దూకుడు ప్రదర్శించలేదు. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు చేయలేదన్న వార్తలు పోలింగ్ అనంతరం నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రచారం కూడా కేవలం రాత్రివేళల్లో గ్రామ పెద్దలను కలవడమే ఆయన చేశారు. ఓటర్ల వద్దకు నేరుగా దగ్గుబాటి వెళ్లలేదన్నది వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా నివేదికలు అందాయి. దీంతో ప్రచారంలోనే దగ్గుబాటి వెనకబడి పోయినట్లు తెలుస్తోంది.
టీడీపీ అభ్యర్థి ముందు….
దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచి, వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే కీలక పదవి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సామాజిక కోణంలో, చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకు జగన్ ఆయనకు పెద్ద పదవే ఇస్తారన్నద పార్టీలో మొదటి నుంచి విన్పిస్తున్న టాక్. అయితే దగ్గుబాటి ఈ ఎన్నికలో పెద్దగా కష్టపడలేదంటున్నారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు దగ్గుబాటికి చెమటలు పట్టించారు. ఆర్థిక, ప్రచారం విషయాల్లో దగ్గుబాటి కంటే ఏలూరి సాంబశివరావు ముందువరసలో ఉన్నారట. ఏలూరి ముందు దగ్గుబాటి తేలిపోయారట. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీ చెప్పలేకపోవడానికి కారణం దగ్గుబాటి స్వయంకృతాపరాధమేనంటున్నారు.
Leave a Reply