ఆ సలహాలు ఇక చాలు అన్నట్టేనా….?

దేవులపల్లి అమర్

ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్ కు ఇటీవల మరో పదవి కూడా దక్కింది. విద్యుత్ రంగంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో ఏపీ జెన్ కో కి కూడా దేవులపల్లి అమర్ సేవలు ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ఎండి గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అమర్ అనుచరుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ఆయనకు అభినందనలు కూడా దక్కలేదు. అమర్ కి అదనపు పదవి దక్కడం పొగ బెట్టడమే అనే ప్రచారం ఊపందుకుంది. అమర్ వ్యవహార శైలి మీద మొదటి నుంచి ఏపీ ప్రభుత్వంతో పాటు, అక్కడి మీడియా, అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

జర్నలిస్ట్ నాయకుడిగానే….

దేవులపల్లి అమర్ గత కొన్నేళ్లుగా జర్నలిస్ట్ గా ఉండటం కంటే జర్నలిస్ట్ నాయకుడిగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. సాక్షిలో ఉద్యోగిగా ఉన్నా ఆయన ఐజేయు కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీడబ్ల్యుజె రెండుగా విడిపోయినా ఆంధ్రాలో సైతం ఆయన హవా బలంగా ఉంది. గత ఏడాది నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త అక్రిడేషన్ల జారీ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మెజారిటీ జిల్లా కమిటీల్లో సభ్యులను అమర్ సూచించిన వారికే చోటు దక్కింది. నిజానికి ఏపీ జర్నలిస్ట్ సంఘాల్లో గత ఐదేళ్లలో అవాంఛనీయ ధోరణి, అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరించడం సాధారణంగా మారింది. ఏపీడబ్ల్యుజె యూనియన్ నాయకులు టీడీపీతో అంట కాగారు. చంద్రబాబుకి మద్దతుగా పోరాటాలు, దీక్షలు చేశారు. చంద్రబాబు సొంతంగా ఓ యూనియన్ ని పెంచి పోషించడంతో ప్రధాన యూనియన్ కూడా టీడీపీ ముందు తలొగ్గింది. ఇందుకు కారణాలు ఏమిటన్నది జర్నలిస్ట్ వర్గాల్లో అందరికి తెలిసినవే.

టీడీపీకి అనుబంధంగా….

యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు. జిల్లా యూనిట్లు కూడా చాలా వరకు వారి చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది నవంబర్ లో కమిటీల ఏర్పాటు సమయంలో గతంలో టీడీపీ అనుకులంగా వ్యవహరించిన వారికే అక్రిడిటేషన్ల కమిటీల్లో చోటు దక్కాయి. ముందు వెనుక ఆలోచించకుండా సమాచార శాఖ అధికారులు , జాతీయ మీడియా సలహాదారు సిఫార్సుల ఆధారంగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇది కాస్త వివాదాస్పదం అయ్యింది. అదే సమయంలో అక్రిడిటేషన్ల వ్యవహారంలో యూనియన్లతో పని లేకుండా నేరుగా ప్రభుత్వమే జర్నలిస్టులను గుర్తించాలి అని కొన్ని సంఘాలు, పాత్రికేయులు సమాచార శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మీద ఫిర్యాదులు రావడంతో కమిటీని ఉపసంహరించుకోవడం, దానిపై కొందరు కోర్టును ఆశ్రయించడం జరిగాయి.

జర్నలిస్ట్ సంఘాల జోక్యంతో….

వివాదం పరిష్కారం అయ్యే వరకు పాత వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జూన్ 30తో వాటి గడువు ముగియడంతో కొత్త కార్డుల మంజూరు, పొడిగింపు వ్యవహారాలపై గత నెల 29న సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అదే రోజు మంత్రి పేర్ని నాని అనుచరుడు మచిలీపట్నం లో హత్యకు గురవ్వడంతో ఆయన ఆ సమావేశానికి హాజరు కాలేదు. కీలకమైన అధికారులు, సలహాదారులు పాల్గొన్న సమావేశంలో పాత కమిటీని కొనసాగించాల్సిందిగా అమర్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సంక్షేమ పథకాలు, గుర్తింపు వ్యవహారంలో జర్నలిస్ట్ సంఘాల జోక్యం ఎందుకనే అంశం కూడా చర్చకు వచ్చింది. జర్నలిస్ట్ సంఘాల వ్యవహార శైలి, కొన్ని చోట్ల అక్రిడేషన్ల అమ్మకాలు, కమిటీల్లో ఉండే వారి మితిమీరిన జోక్యం వంటి అంశాలపై చర్చ జరిగింది.

సీఎం అసంతృప్తిగా ఉండబట్టే…..

ఈ సమయంలో ప్రభుత్వ వైఖరికి భిన్నంగా దేవులపల్లి అమర్, కమిటీల్లో యూనియన్ల పాత్ర ఉండాల్సిందే అని, పాత కమిటీ కొనసాగించాలి అని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. యూనియన్ల వ్యవహార శైలి, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అమర్ వ్యవహరించడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. నిజానికి సలహాదారులు నియామకం విషయంలోనే అమర్ తో పాటు మరొకరి నియామకానికి ముఖ్యమంత్రి సానుకూలంగా లేకున్నా., కొందరు నచ్చ చెప్పినట్టు ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచిన సమయంలో వారంతా లక్షల రూపాయలు జీతలుగా పొందిన వారు కావడం, వారి వైఖరి మీద సందేహాలున్నా సీఎం చూసి చూడనట్టు పోయారు. తాజా పరిస్థితుల్లో వారి నియామకాలకు తగిన పని చేయకపోవడం ప్రతి నెల మూడున్నర లక్షల వేతనం పొందుతూ ఏ మాత్రం పని చేయకపోవడం సీఎంకు సైతం అసంతృప్తి కలిగించినట్టు సమాచారం. అదనపు పని కల్పించడం ద్వారా అసలు ఏమి పని చేయడం లేదని గుర్తు చేయాలన్నది ఈ నిర్ణయం వెనుక అంతర్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దేవులపల్లి అమర్ తన జోడు పదవుల్లో కొనసాగుతారా…, నెలనెల మూడున్నర లక్షల రూపాయల తన యూనియన్ కోసం వదులుకుంటారా అన్నది చూడాలి.

– ఏపీలోని ఓ సీనియర్ జర్నలిస్ట్

About telugupost 1 Article
39 Willow Dr, Delmar, NY USA 12054
Contact: Website

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*