
గుంటూరు జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో చూస్తే ఒక్క 1989లో మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎనిమిది ఎన్నికల్లో ఏడు సార్లు ఇక్కడ తండ్రి కొడుకులే గెలుపొందడం విశేషం. దివంగత మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ 1994 నుంచి 2014 వరకు ఓటమి అనేదే లేకుండా వరసగా ఐదు విజయాలు సాధిస్తూ వస్తున్నారు. నరేంద్ర గత ఎన్నికల్లో గెలుపుతో ఐదు సార్లు గెలిచారు.
డబుల్ హ్యాట్రిక్ కోసం……
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని విధంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని ప్రయత్నాల్లో ఉన్నారు. 2004లో నాడు గుంటూరు జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ గాలికి 18 నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోతే ఒక పొన్నూరులో మాత్రం వైఎస్ గాలిని తట్టుకుని నరేంద్ర విజయం సాధించారు. నియోజకవర్గంలో పొన్నూరు మున్సిపాలిటి, పొన్నూరు రూరల్, పెదకాకాని, చేబ్రోలు మండలాలు ఉన్నాయి. సామాజిక సమీకరణల పరంగా చూస్తే అగ్రవర్ణాల్లో కమ్మ, కాపు ఓటర్లు ప్రభావం చూపుతారు. పొన్నూరు పట్టణంలో మైనారిటీ ఓటర్లు కూడా కీలకంగా ఉన్నారు. బీసీలతో పాటు ఎస్సీ ఓటర్లు కూడా గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. నరేంద్ర గెలుపునకు ప్రతిసారి అదృష్టం తోడు అవుతుంది. 2004లో ఇక్కడ సరైన అభ్యర్థి లేక వైఎస్ ఎస్సీ వర్గానికి చెందిన మన్నవ రాజా కిషోర్‌ను బరిలోకి దింపగా ఆయన నరేంద్రకు సరైన పోటీ ఇవ్వలేక విజయం సాధించలేకపోయారు.
అప్పుడు చెమటలు పట్టినా…..
2009లో ఎన్నారై మారుపూడి లీలాధరరావు నరేంద్రకు చెమటలు పట్టించి ఆయన్ను ఓటమి అంచుల వరకూ తీసుకుని వెళ్లినా గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణకు ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో నరేంద్ర మరో సారి సులువుగానే గెలిచారు. ఐదు ఎన్నికల్లోనూ ఐదుగురు ప్రత్యర్థులు మారడం కూడా నరేంద్రకు కలిసి వచ్చింది. ఇక నాలుగున్నర ఏళ్లల్లో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రహదారుల అభివృద్ధి, డెల్టాలో కాల్వల నిర్మాణం లాంటి పనులు కొంత వరకు జరిగాయి. అయితే పార్టీ అధికారంలోకి రాక ముందు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో యాక్టీవ్‌గా ఉన్న నరేంద్ర ఇటీవల చాలా చాలా డల్‌గా ఉంటున్నారు. దీనికి కారణం మంత్రి పదవి రాలేదన్న బాధతో పాటు చంద్రబాబు వద్ద ప్రయార్టీ లేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. సంఘం డైరీ చైర్మన్ విషయంలో చంద్రబాబు నరేంద్రను తీవ్రంగా విభేదించడంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అన్నది వాస్తవం.
ప్రభుత్వం ఉన్నా ప్రయారిటీ లే…..
ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా నరేంద్రకు పెద్ద ప్రయార్టీ లేదు. వరుసగా రెండున్నర దశాబ్దాల పాటు నరేంద్ర ఎమ్మెల్యేగా ఉండడం, అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేకపోవడం గత నాలుగున్నర ఏళ్లల్లో పార్టీ అధికారంలో ఉన్నా నరేంద్ర నియోజకవర్గంలో అభివృద్ధి, కార్యకర్తలను సంతృప్తి పరిచే విషయంలో అంచనాలు అందుకోలేకపోవడం, నరేంద్ర కజిన్ తీరుతో కూడా నియోజకవర్గంలో ఆయనపై గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ నరేంద్రకు రెండో సారి ప్రత్యర్థిగా ఎదురు అవుతున్నారు. ఈ పరిణామాలు అన్ని నరేంద్రకు కాస్త కొత్తగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిన రావి వెంకటరమణ నాలుగేళ్లుగా నియోజకవర్గంలోనే తిరిగారు. అంతే కాకుండా గుంటూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సానుభూతి పవనాలు కూడా ఆయనకు కలిసి వచ్చేలా ఉన్నాయి.
జనసేన మద్దతు లేకపోవడం కూడా…..
దీంతో పాటు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న జనసేన ప్రభావం సైతం పొన్నూరులో బలంగా ఉండే చాన్సులు ఉన్నాయి. నియోజకవర్గంలో 35వేల పై చిలుకు ఓట్లు కాపు సామాజిక వర్గానివి ఉండడంతో జనసేన గెలుపు సంగతి ఎలా ఉన్నా ప్రధాన పార్టీల్లో ఎవరో ఒకరిని ఓడించే సత్తా మాత్రం ఆ పార్టీకి ఉంది. గత ఎన్నికల్లో జనసేన సపోర్ట్ ఉన్నా ఎన్నికలకు ముందు పరిణామాలు నరేంద్రుడికు కలిసి వచ్చినా ఆయన కేవలం 7000 ఓట్లతో విజయం సాధించారు. ఈ సపోర్ట్ ఇప్పుడు నరేంద్రకు లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో ఆయనపై వ్యక్తిగతంగా ఉన్న పరిణామాలతో పాటు గత ఎన్నికలకు ముందున్న సానుకూలతలు ఇప్పుడు నరేంద్రకు మైనస్‌గా మారనున్నాయి. మరి వీటిని నరేంద్ర ఎలా అధిగమిస్తారో చూడాలి. ఇక రావి వెంకటరమణ గతంలో ప్రత్తిపాడులో ఐదు సార్లు గెలిచిన మాకినేని పెదరత్తయ్యను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఐదు సార్లు గెలిచిన నరేంద్రను కూడా ఓడించి ఆయన గుంటూరు జిల్లా చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంటారా ? లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు బట్టీ చూస్తే పొన్నూరులో నరేంద్ర ఏటికి ఎదురీదుతున్నట్టే స్పష్టం అవుతుంది.
Leave a Reply