ధూళిపాళ్లను అలా దెబ్బకొడతారా…??

dhulipallanaredrakumar-vs-kilari-rosaiah

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. అపజయం ఎరుగని నేత. వరసగా ఐదు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ కోసం నరేంద్ర ఎదురుచూస్తున్నారు. ఇక వరసగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు మారుతూ వస్తుండటం కూడా సానుభూతి అనేది ప్రత్యర్థిపార్టీకి కానరాకుండా పోయింది. అయితే ఇక్కడ ఈసారి ధూళిపాళ్ల నరేంద్ర గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సామాజిక పరంగా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. పొన్నూరు శాసనసభ నియోజకవర్గం పరిస్థితిని చూస్తే టీడీపీకి తిరుగులేని నియోజకవర్గమనే చెప్పాలి.

ఆ ఫ్యామిలీయే….

తెలుగుదేశం పార్టీ అనేకంటే…దూళిపాళ్ల కుటుంబం కూడా వరుస గెలుపులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 1983 నుంచి 2014 వరకూ జరిగిన ఎన్నికల్లో 1989లో మాత్రమే దూళిపాళ్ల కుటుంబం ఓటమి పాలయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టినేని వెంకట్రావు విజయం సాధించారు. 1983 నుంచి మొన్నటి వరకూ మొత్తం ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు దూళిపాళ్ల కుటుంబమే నెగ్గడం విశేషం. గత ఎన్నికల్లో దూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకటరమణపై 7,761 ఓట్ల తేడాతో గెలుపొందారు. దూళిపాళ్ల నరేంద్ర, రావి వెంకటరమణ ఒకే సామాజిక వర్గం కావడంతో ఈసారి వైసీపీ తన ప్లాన్ మార్చింది.

వైసీపీ ప్లాన్ మార్చి…..

ఈసారి పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా కిలారి రోశయ్యను బరిలోకి దించడం వ్యూహాత్మకమేనంటున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఈయనను బరిలోకి దించారంటున్నారు. ఇక్కడ ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు కూడా పడితే కిలారి రోశయ్య గెలుపు సులువేనని చెబుతున్నారు పరిశీలకులు. కిలారి రోశయ్య సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన అల్లుడి గెలుపు కోసం తీవ్రంగానే కృషి చేస్తున్నారు.

వ్యతిరేకతతో పాటు….

వరుసగా ఐదు సార్లు గెలుస్తూ రావడం, అధికారంలోకి వచ్చినా దూళిపాళ్లకు మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం వంటివి ఆయనకు మైనస్ గా చెబుతున్నారు. ఆయన డెయిరీపై పెట్టిన శ్రద్ధ నియోజకవర్గం పై పెట్టింది లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు కులాలే కీలకంగా మారనున్నాయి. దీంతో ఐదు సార్లు అప్రతిహతంగా గెలిచిన దూళిపాళ్లకు విజయం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద వైసీపీ ప్లాన్ మార్చి ఇక్కడ కిలారిని దించడంతో దూళిపాళ్లకు దెబ్బపడుతుందేమోనన్న అనుమానం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో…?

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*