
అమరావతి కేంద్రంగా వైఎస్సాఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్టోబర్ నుంచి పని చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి దగ్గర వైసీపీ కార్యాలయం రెడీ అవుతుంది. కార్యాలయం పక్కనే జగన్ నివాసం కూడా సిద్ధం అవుతుంది. అన్ని అనుకున్నట్లు సాగితే వైసిపి అధినేత జగన్ అక్టోబర్ లో తన కార్యాలయం, ఇంటినుంచి కార్యకలాపాలు మొదలు పెడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీకి 10 కిలోమీటర్ల దూరంలో వున్నాయి.
ఇప్పటివరకు లోటస్ పాండ్ నుంచే …
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా వైసిపి కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు పార్టీ అధినేత నివాస కేంద్రం భాగ్యనగర్ నుంచే కొనసాగుతూన్నాయి. ఓటుకు నోటు కేసు తరువాత ముందు చంద్రబాబు ఆ తరువాత లోకేష్ పూర్తిగా అమరావతికి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ రాజధాని నిర్మాణ బాధ్యతలు సవాల్ గా తీసుకున్న చంద్రబాబు హైదరాబాద్ వీడి ఇక అంతా వచ్చేయాలని ఆదేశించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించిన బాబు అమరావతి కేంద్రంగానే అన్ని అనుకున్న తరుణంలో హైదరాబాద్ లో తన పాత ఇల్లు స్థానంలో అత్యాధునిక హంగులతో భారీ నిర్మాణం చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. బాబు ఇంటిపై అనేక ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రిటైర్ అయ్యాక బాబుకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ లోనే నివాసం ఉంటారని అంతా ధ్వజమెత్తారు.
జనసేన కూడా …
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏడాది చివరికి తమ పార్టీ కార్యకలాపాలను అమరావతి కేంద్రంగానే మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన కూడా గుంటూరు జిల్లా లోనే రెండెకరాల స్థలంలో కార్యాలయం ఇల్లు నిర్మిస్తున్నారు. మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీ కార్యాలయాలు పూర్తి అయి పని మొదలు పెడితే అమరావతిలో రాజకీయ సందడి బాగా పెరగనుంది. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ అన్ని పార్టీల కార్యాలయాలు అధినేతల ఇళ్ళు ప్రారంభం అయితే అమరావతికి కళ వచ్చినట్లే మరి.
Leave a Reply