ఎర్ర జెండా పట్టుకుంటారా…!

kishore chandra dev likely to join cpm

విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటారని టాక్ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకున్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై చర్చ సాగుతోంది. కురుపాం సంస్థానాధీశుడు అయిన కిశోర్ చంద్రదేవ్ దాదాపు అర్ధ శతాబ్ద కాలం కాంగ్రెస్ రాజకీయాల్లోనే గడిపారు. ఆయన ఆ పార్టీలోనే నాలుగు మార్లు లోక్‌స‌భ‌, ఒకమారు రాజ్య సభకు ఎన్నికయ్యారు. రెండు మార్లు కేంద్రమంత్రిగా పనిచేయడమే కాదు, ఎన్నో పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా వ్యవహరించారు. సీడబ్లూసీలో మెంబర్ గా కూడా దీర్ఘకాలం సేవలు అందించారు. సోషలిస్ట్ భావాలు కలిగిన కిశోర్ చంద్రదేవ్ బీజేపీ పొక‌డను తీవ్రంగా వ్యతిరేకిస్తారు

ప్రాంతీయ పార్టీలంటే విముఖం

అదే సమయంలో ఆయన ప్రాంతీయ పార్టీల తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తారు. ఈ దేశానికి జాతీయ పార్టీలే శరణ్యం అన్నది ఆయన సిధ్ధాంతం. ఇపుడు చూస్తే కాంగ్రెస్ ని వదిలి వచ్చేశారు. మరో పెద్ద జాతీయ పార్టీ బీజేపీని నిండా ద్వేషిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలలో చేరనని అంటున్నారు. మరి ఆయన పయనమెటూ అన్న చర్చ వచ్చినపుడు ఆసక్తికరమైన సమధానాలు వస్తున్నాయి. కిశోర్ చంద్రదేవ్ సీపీఎం పార్టీలో చేరుతారని సన్నిహితులు చెబుతున్నారు. దానికి కారణం వామపక్ష భావజాలం అంటే ఆయనకు ఇష్టమని, కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఎన్నో మార్లు ఆ పార్టీ విధానాలను కిశోర్ వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించడంలో కిశోర్ కామ్రేడ్స్ తో పోటీ పడేవారు. గిరిజన హక్కుల పరిరక్షణలోనూ ఆయనది వారి మాటే.

అదీ లెక్కట

కిశోర్ కి సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో స్నేహ బంధం ఉంది. అదే విధంగా ఏపీలో వామపక్షలు, జనసేన కలసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా అరకు పార్లమెంట్ నుంచి సీపీఎం తరపున కిశోర్ పోటీ చేస్తే సీపీఐతో పాటు, జనసేన మద్దతు కూడా ఉంటుంది. సొంత బలం కూడా తోడై గెలుపు ఖాయమని కిశోర్ భావిస్తున్నారుట. కిశోర్ వంటి వారిని జనసేన కూడా అహ్వానించినా ఆయన ప్రాంతీయ పార్టీలో చేరడం ఇష్టం లేకనే సున్నితంగా తిరస్కరించారట. మొత్తానికి చూసుకుంటే కిశోర్ కొత్త కామ్రేడ్ అవుతారని ఉత్తరాంధ్రలో టాక్ నడుస్తోంది. అదే జరిగితే అద్భుతమేనని అంటున్నారు. పార్టీ విస్తరణ లేక, చేరికలు లేక ఉన్న ఎర్ర సైన్యానికి ఈ చేరిక కొత్త నెత్తురుని ఇస్తుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి.

 

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*