
గుట్టు విప్పుతారేమోనని అంతా ఆశగా ఎదురు చూశారు. అయినా కన్ఫ్యూజన్ మిగిల్చారు. ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్లు బయటపెట్టేశారు. వైసీపీకి అనుకూలంగా ఉండే సంస్థలు, టీవీలు, పేపర్లు ఏపీలో పంఖా గాలి వీచిందని స్పష్టంగా తేల్చి చెప్పేశాయి. అందులోనూ సీట్ల పరంగా భారీ సంఖ్యనే కట్టబెట్టాయి. రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ , టీడీపీకి అనుకూలంగా ఉండే పేపర్లు, చానళ్లు టీడీపీకి పట్టం గట్టేశాయి. అటు ఇటు అన్ని చానళ్లు, పత్రికలు చూసినవారికి గందరగోళం మరింతగా పెరిగింది. పార్టీల వారీ చీలిపోయిన ప్రసారమాధ్యమాలు, సర్వే సంస్థల నిజస్వరూపం మాత్రం బట్టబయలైంది. స్సాన్సర్డ్ సర్వేల రూపురేఖాలక్షణాలూ తేటతెల్లమయ్యాయి. అయితే సర్వేలు చేసిన సంస్థలు సాకులను అట్టే పెట్టుకోవడం విశేషం. షరతులు వర్తిస్తాయన్నట్లుగా ఎగ్జిట్ , పోస్టు పోల్ సర్వేలను ప్రకటించాయి. కొంతసేపు హడావిడి సృష్టించినప్పటికీ ఓటర్లలో ఆసక్తి మాత్రం తగ్గిపోయింది. భిన్నమైన ఫలితాలే కాకుండా సర్వేల్లో భారీ వ్యత్యాసాలు కనిపించడంతో శాస్త్రీయత లేదనే విషయం సామాన్య ఓటరుకు సైతం అర్థమైపోయింది. అందుకే మీడియాపై ఉండే గౌరవం తగ్గడమే మినహా ఎగ్జిట్ ఫలితాలు క్లారిటీ ఇవ్వలేకపోయాయి.
కేంద్రంపై స్పష్టత…
జాతీయ సర్వేల్లో దాదాపు అన్ని సంస్థలూ తిరిగి ఎన్డీఏకే అధికారమంటూ స్పష్టత నిచ్చేశాయి. ఉత్తరాది మళ్లీ బీజేపీని అందలమెక్కించబోతోంది. అక్కడున్న రాజకీయ సమీకరణలు, తీసుకునే శాంప్లింగ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని తోసిపుచ్చలేం. యూపీఏ, ఇతర ప్రాంతీయపక్షాలు అధికారానికి చాలాదూరంలోనే ఉండిపోతాయని సర్వే సంస్థలు పసిగట్టాయి. అంతేకాకుండా ఎన్డీఏ కూటమి అధికారం కోసం ఇతర తటస్థ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదనే సంగతిని బయటపెట్టాయి. ఇది విపక్షాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే పరిణామమే. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమపై ఆధారపడాల్సిందేనని కలలు గన్న పార్టీల ఆశలు గల్లంతయ్యే వాతావరణం కనిపిస్తోంది. జాతీయంగా చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి వారు ఆ చాన్సు కోల్పోతున్నారనే చెప్పాలి. యూపీఏ కూటమి కనీసం 200 సీట్ల దరిదాపుల్లోకి వస్తేనే కేంద్రంలో అధికారం కోసం పోటీపడే అవకాశం దక్కుతుంది. ఎగ్జిట్ సర్వేల్లో ఎక్కడా ఆ చాన్సు కనిపించలేదు. మొత్తమ్మీద మళ్లీ మోడీయే ప్రధాని అన్న విషయాన్ని తొంభైశాతం సర్వేలు ఆవిష్కరించేశాయి.
ప్రాంతీయ పార్టీల పాత్రేమిటి?
ఈసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే దక్షిణభారతం పెద్దగా పాత్ర పోషించే అవకాశాలుండవు. కేరళ,తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుల్లో బీజేపీ సాధించే సీట్ల సంఖ్య దాదాపు శూన్యమే. కర్ణాటకలో మాత్రమే బీజేపీకి సీట్లు వస్తాయని ఎగ్జిట్ సర్వేలు పేర్కొంటున్నాయి. యూపీఏ కూటమి కానీ, కాంగ్రెసు మద్దతుతో ప్రాంతీయపార్టీలు కాని ఆధిక్యం సాధించగలిగితే దక్షిణభారతం కేంద్రంలో చాలా కీలకపాత్ర పోషించేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడా యూపీఏ బలం 150 కి మించడం లేదు. దాంతో డీఎంకే, తెలుగుదేశం, టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, జేడీఎస్ వంటి పార్టీలు తమ రాష్ట్రాల్లో ఎంత బలం చాటుకున్నప్పటికీ వాటి అవసరం కేంద్రానికి ఉండదు. ఈ రాష్ట్రాలు తమకు అవసరమైన ప్రత్యేక డిమాండ్లను సాధించుకునే అవకాశాలూ కోల్పోయినట్లే. ఏపీ ప్రత్యేక హోదా, ఆర్థిక సంఘానికి సంబంధించిన నిబంధనలపై పోరాటం, దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్న వైనాలపై ఈ రాష్ట్రాల పోరాటం సన్నగిల్లుతుంది. అయితే ఇప్పటికీ ఈ ప్రాంతంలోని పార్టీలు మాత్రం ఎన్డీఏ పూర్తిస్థాయి ఆధిక్యం సాధించదని నమ్ముతున్నాయి.
ఎగ్జాక్ట్ పోల్స్ గా…
ఇప్పుడు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఎగ్జాక్ట్ ఫలితం ప్రతిబింబించే రిజల్టుగా ఎంతవరకూ పరిగణనలోకి తీసుకోవచ్చనే సందేహాలు తలెత్తుతున్నాయి. గడచిన పదిహేను సంవత్సరాల్లో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో 70 శాతం వైఫల్యాలున్నాయి. 2004లో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కానీ గురి తప్పింది. 2009 లో కాంగ్రెసుకు కష్టకాలమని చెప్పాయి. కానీ 2004 కంటే ఎక్కువ సీట్లతో యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పాటైంది. 2014లో మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎగ్జిట్ పోల్స్ తప్పుదారి పట్టాయి. ఓవరాల్ గా చూస్తే కనీసం 50శాతం కూడా సక్సెస్ కాని ఎగ్జిట్ పోల్స్ ను నమ్ముకుని కలలు కనడమేమిటనే వారూ ఉన్నారు. అందులోనూ ఎగ్జిట్ పోల్స్ ను మధ్యాహ్నం 2 గంటల సమయానికి ముగించేసి ఫలితాల మదింపుపై పడిపోతుంటారు. దానివల్ల మూడుగంటల తర్వాత జరిగే పుష్ పోలింగ్ ఓటర్ల ప్రభావం వీటిల్లో కనిపించదు. అందులోనూ శాంపిల్ సైజు సైతం చాలా తక్కువగా నాసిరకంగా ఉంటుంది. వర్గాల వారీ ఓటర్ల వర్గీకరణ ఉండదు. ఫలితంగానే పలుసార్లు ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సర్వే సంస్థలు బొక్కబోర్లా పడుతుంటాయి. అందుకే ఫలితాలను తమకు నచ్చినట్లు అనువర్తింపచేసుకుంటూ… ఈనెల 23 వ తేదీ వరకూ ఓటర్లు, పార్టీలు వేచి చూడాల్సిందే.
-ఎడిటోరియల్ డెస్క్
Leave a Reply