
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరో సమస్య ముంచుకొస్తోంది. చిత్తూరు జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 21వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మే 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించనున్నారు.
ఎమ్మెల్సీ పదవి ఎవరికి?
అయితే గాలి ముద్దు కృష్ణమ నాయుడి మృతితో ఖాళీ అయిన పదవిని ఎవరికివ్వాలన్న దానిపై చంద్రబాబు సందిగ్దంలో పడ్డారు. గాలి వారసుడిగా ఆయన కుమారుడు భానుప్రకాష్ కు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి భానుప్రకాష్ ను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమ జీవించి ఉన్నప్పుడే నగరి టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నప్పటికీ, నియోజకవర్గ బాధ్యతలను భానుప్రకాష్ చూసుకునే వారు. టీడీపీ కార్యకర్తల బాగోగులను కూడా భానుప్రకాష్ దగ్గరుండి చూసేవారు. దీంతో భానుప్రకాష్ ను రాబోయే ఎన్నికల్లో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే గాలి ముద్దు కృష్ణమ మరో కుమారుడు జగదీష్ కూడా ఎమ్మెల్సీ పదవి తనకు కావాలంటున్నారు.
తమకు ఇవ్వాలంటున్న…….
అయితే ఎమ్మెల్సీ పదవి ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గాలి కుటుంబంలో ఒకరికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వనున్నారు కాబట్టి, తమకు ఎమ్మెల్సీ పదవి కావాలని చిత్తూరు జిల్లాలో ఆశావహులు అనేకమంది కోరుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. ఇటు మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా కూడా అభ్యర్థించారు. కాని టీడీపీలో సీనియర్ నేత మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకే ఇవ్వాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది. గాలి కుమారుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి దక్కొచ్చంటున్నారు. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
Leave a Reply