
గల్లా అరుణకుమారి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాను ఏలిననేత. మంత్రిగా ఆమె తన నియోజకవర్గంతో పాటు జిల్లాను కూడా శాసించారు. కాని రాష్ట్ర విభజనతో ఆమె సీన్ రివర్స్ అయింది. అయినా తెలివిగా అధికార పార్టీలోకి వచ్చిన గల్లా అరుణకుమారి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన కుమారుడు గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు పార్లమెంటు సభ్యుడుగా గెలవడంతో కొంత ఉపశమనం పొందారు. గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
షాకింగ్ న్యూసే…..
అయితే గల్లా తాజా నిర్ణయం తెలుగుదేశం పార్టీని ఉలిక్కిపడేలా చేసిందంటున్నారు. గల్లా అరుణకుమారి చంద్రగిరి ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా అధినేత చంద్రబాబు వద్దనే చెప్పేశారు. చంద్రబాబు సముదాయించినా గల్లా శాంతించలేదు. తనకు ఇక రాజకీయాలు చేసే ఓపిక లేదని, తనను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించి వేరే వారిని నియమించాలని ఆమె చంద్రబాబు వద్ద చెప్పేసి వచ్చినట్లు తెలిసింది. ఇది చంద్రబాబు సయితం ఊహించని పరిణామమే. చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఎన్నికల సమయంలో గల్లా అరుణ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు వెంటనే చిత్తూరు జిల్లా నేతలతో సమీక్షించినట్లు తెలుస్తోంది.
వయోభారం కారణం కాదంటున్న…..
అయితే గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు మాత్రం వయో భారం వల్లనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని చెబుతున్నా అది నమ్మశక్యంగా లేదు. రాజకీయాలు వయసుతో పనిలేదు. 70 వయసు దాటిననేతలు ఏపీ రాజకీయాల్లో ఇప్పటికీ కీలకంగానే ఉన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలు వయసు మీదపడినా యువకులతో పోటీ పడుతూ ఆయన పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరును ఈ సందర్భంగా కొందరు ఉదహరిస్తున్నారు. గల్లా కేవలం కుంటిసాకులే చెబుతున్నారని, టీడీపీ అధినాయకత్వం మీద అసంతృప్తితోనే ఇన్ ఛార్జి పదవి నుంచి వైదొలిగారంటున్నారు.
గల్లా హ్యాట్రిక్ విజయాలే…..
గల్లా అరుణ కుమారి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నాలుగువేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. గత ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 1,00,924 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా గల్లా అరుణకుమారి 96,406 ఓట్లు సాధించారు. 1999,2004, 2009 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అయితే గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోవడానికి కారణం పదిహేనేళ్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేయడమేనన్న విశ్లేషణ కూడా ఉంది. ఈసారి తన విజయం ఖాయమని భావిస్తున్న గల్లాకు సొంతపార్టీ నుంచి సహకారం అందకపోవడంతో ఆమె తాను ఇన్ ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుతో చెప్పారంటున్నారు. మొత్తం మీద అధినేతపై అసంతృప్తితోనే గల్లా పార్టీకి దూరమయ్యారన్న వార్తలు వస్తున్నాయి.
Leave a Reply