
మూడు దశాబ్దాల నుంచి ఒకే పార్టీలో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలతో వైరం ఉన్నా ఆమె విజయావకాశాలకు ఏమాత్రం కొదవలేదు. అయితే ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ఆమె రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. గల్లా అరుణకుమారి. మూడు దశాబ్దాలపాటు కాంగ్రెస్ లో కొనసాగారు. తన తండ్రి రాజగోపాలనాయుడు ఇచ్చిన స్ఫూర్తితో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. తొలినాళ్లలో ఓటమి ఎదురయినా ఆమె చలించలేదు. 1994లో నారా చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడిపై ఓటమి చవి చూసిన తర్వాత గల్లా ఇంకా చంద్రగిరి నియోజకవర్గంలో కసితో పనిచేశారు. కార్యకర్తల వెన్నంటే ఉన్నారు. దీంతో ఆ తర్వాత నుంచి ఆమెకు విజయాల మీద విజయాలు వరించాయి.
వరుస విజయాలతో….
గల్లా అరుణకుమారి వరుసగా 1999, 2004,2009 ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. చంద్రగిరి నియోజకవర్గమైన మంత్రిగా అన్ని నియోజకవర్గాలపై గల్లా పట్టు సాధించారు. జిల్లాలో చీమ చిటుక్కుమన్నా గల్లా కు తెలియాల్సిందే. అయితే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో గల్లా కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో అరుణకుమారి ఓటమి చెందగా, జయదేవ్ ఎంపీగా గెలుపొందడం ఆ కుటుంబంలో కొంత ఊరట కలిగించింది.
స్వయంగా బాబుతో కోరి…..
చంద్రగిరి నియోజకవర్గంపై మంచి పట్టున్న గల్లా అరుణకుమారికి ఇన్ ఛార్జి పదవిని అప్పగించారు చంద్రబాబు. అప్పటి నుంచే గల్లాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒక వైపు ఓటమి బాధ, మరోవైపు సొంత పార్టీ నేతలనుంచి సహకారం కొరవడటం ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె తనను చంద్రగిరి ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని స్వయంగా చంద్రబాబుకు విన్నవించారు. మొదట్లో నిరాకరించిన చంద్రబాబు ఆమె గట్టిగా పట్టుపట్టడంతో ఆమెను తొలగించి పులివర్తి నానిని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రస్తుతం గల్లా అరుణకుమారి పులివర్తి నానిని గెలిపించాలంటూ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఓడించాలని ఇప్పటి నుంచే ఆమె ప్రచారం మొదలుపెట్టారు.
సహకరించని టీడీపీ నేతలు……
పులివర్తి నానికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నా పార్టీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడం చికాకు కల్గిస్తున్నాయట. తాను సదుద్దేశ్యంతో మద్దతు పలుకుతున్నా టీడీపీ నేతలు అర్థం చేసుకోవడం లేదంటూ ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నారు. దీంతో చంద్రబాబును త్వరలో కలసి తాను తన కుమారుడు పోటీ చేసే గుంటూరు పార్లమెంటులో పనిచేస్తానని, చంద్రగిరి నియోజకవర్గాన్ని పట్టించుకోనని చెప్పేయనున్నారని సమాచారం. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో గల్లాకు మంచి పట్టు ఉండటంతో చంద్రబాబు ఆమెను అక్కడి నుంచి తప్పిస్తారని నమ్మకం లేకున్నా ఆమె అయితే సంతోషంగా మాత్రం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గల్లా అరుణకుమారి ఇప్పటికే రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించినా పార్టీ అభ్యర్ధి కోసం పనిచేస్తారా? లేక కొడుకు కోసం ప్రచారానికి వెళతారా? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply