రాష్ట్రం ప‌క్షాన గ‌ళ‌మెత్తిన గ‌ల్లా…ప్ర‌సంగంలోని ముఖ్య అంశాలు

గల్లా జయదేవ్

పార్ల‌మెంటు వేదిక‌గా అవిశ్వాసం తీర్మానం సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి జ‌రిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ గ‌ళ‌మెత్తారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తీరు, త‌మ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు అమ‌లు కాక‌పోవ‌డం, మోదీ ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం, ప్ర‌త్యేక హోదా వంటి అన్ని అంశాల‌పై ఆయ‌న లెక్క‌ల‌తో స‌హా లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నించారు. రాష్ట్రాన్ని విభ‌జించి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే, ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా బీజేపీ ద్రోహం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌ధాని హోదాలో ఇచ్చిన హామీలు సైతం అమ‌లు కాక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు….

* మొద‌టిసారి ఎంపీగా ఎన్నికైనా ఈ అవ‌కాశం క‌ల్పించిన పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, కేశినేని నానికి కృత‌జ్ఞ‌త‌లు.

* ఇది మెజారిటీ, మొరాలిటీకి మ‌ధ్య జ‌రిగే యుద్ధం. ఇది ధ‌ర్మ‌యుద్ధం. దీనిని బీజేపీ, టీడీపీ మ‌ధ్య పోరుగా కాకుండా ఏపీ ప్ర‌జ‌ల ధ‌ర్మ పోరాటంగా చూడాలి.

* కొత్త రాష్ట్రం తెలంగాణ కాదు…కొత్త రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. అశాస్త్రీయంగా జ‌రిగిన విభ‌జ‌న వ‌ల్ల ఏపీకి అన్నివిధాలుగా న‌ష్టం జ‌రిగింది. ఆస్తులు, మిగులు బ‌డ్జెట్ తెలంగాణ‌కు ద‌క్కితే, అప్పులు, లోటు బ‌డ్జెట్ ఆంధ్ర‌కు మిగిలింది.

* రెవెన్యూ జెనెరేష‌న్ పూర్తిగా కోల్పోయాం. అశాస్త్రీయంగా జ‌రిగిన విభ‌జ‌న‌కు కాంగ్రెస్ తోపాటు విభ‌జ‌న బిల్లుకు స‌హ‌క‌రించిన బీజేపీ కూడా అంతే కార‌ణం. త‌క్కువ జ‌నాభా ఉన్న తెలంగాణ‌కు ఎక్కువ రిసోర్సెస్ ఇచ్చారు. ఎక్కువ జ‌నాభా ఉన్న ఆంధ్ర‌కు త‌క్కువ ఇచ్చారు. విభ‌జ‌న‌తో 90 శాతం జాతీయ సంస్థ‌లు తెలంగాణ‌కు వెళ్లిపోయాయి.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రోత్ రేట్ ద‌క్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువే ఉన్నా త‌ల‌స‌రి ఆదాయం మాత్రం త‌క్కువ ఉంది.

* కాంగ్రెస్ పార్టీ బిడ్డ‌ను కాపాడి త‌ల్లిని చంపింద‌ని, తాను బిడ్డ‌తో పాటు త‌ల్లిని కూడా కాపాడ‌తాన‌ని మోదీ చెప్పారు. నాలుగేళ్లు ఎదురుచూస్తున్నా ఆయ‌న త‌ల్లిని కాపాడ‌టంలేదు. మీరు ఇచ్చిన హామీలపై మీకు బాధ్య‌త లేదా..?

* గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి వంటి వారిని కాపాడుతున్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు టిక్కెట్లు కేటాయించారు. మీరు మాట మార్చ‌డాన్ని ఆంధ్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో వారు స‌రైన తీర్పు చెబుతారు.

* పార్ల‌మెంటులో ప్ర‌ధాని ఇచ్చిన హామీనే అమ‌లు కాక‌పోతే ప్ర‌ధాని మాట‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఎలా ఉంటుంది.

* 14వ ఫైనాన్స్ క‌మిష‌న్ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు, కానీ, క‌మిష‌న్ ఛైర్మ‌న్, ఇద్ద‌రు స‌భ్యులు స్వ‌యంగా తాము అటువంటి రిక‌మండేష‌న్ చేయ‌లేద‌ని చెప్పారు.

* తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి సాక్షిగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని స్వ‌యంగా ప్ర‌క‌టించి మోసం చేశారు. (ఈ స‌మ‌యంలో ఇత‌ర టీడీపీ ఎంపీలు వెంక‌టేశ్వ‌ర స్వామి చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు).

* ఒక‌వేళ ఫైనాన్స్ క‌మిష‌న్ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌వ‌ద్దంటే మ‌రి 11 రాష్ట్రాల‌కు కొన‌సాగిస్తూ ఎలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది మ‌మ్మ‌ల్ని మోసం చేయ‌డం కాదా..? ఇలాంటి అబ‌ద్ధాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం మానుకోవాలి.

* బిహార్‌, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రులు కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చారు.

* ప్యాకేజీ బ‌దులు హోదా కావాల‌ని ముఖ్య‌మంత్రి యూట‌ర్న్ తీసుకున్నార‌ని బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన అంటున్నార‌ని, కానీ హోదా ద్వారా వ‌చ్చే అన్ని స‌దుపాయాలూ ప్ర‌త్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తామ‌ని కేంద్రం చెప్పి మోసం చేసింది.

* ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా జీఎస్‌టీ త‌ర్వాత ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్సెంటీవ్స్ ఉండ‌వ‌ని ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ జీఎస్‌టీ త‌ర్వాత‌ ప్ర‌త్యేక హోదా క‌లిగిన రాష్ట్రాలకు ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్సెంటీవ్స్ య‌ధావిధిగా కొన‌సాగుతున్నాయి. ఇది మోసం కాదా..?

* మూడేళ్ల‌లో రాష్ట్రంలో వెన‌క‌బ‌డిన ఏడు జిల్లాల‌కు కేవ‌లం 1,050 కోట్లు మాత్ర‌మే ఇచ్చారు. అదే బుంద‌ల్‌ఖాండ్‌కి ఐదు వేల కోట్లు ఇచ్చారు. రాష్ట్రానికి ఇచ్చిన‌ 1,050 కోట్ల‌లో 946 కోట్లు ఖ‌ర్చు పెట్టాం, కానీ పెట్ట‌లేద‌ని బీజేపీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోంది.

* వెన‌క‌బ‌డ్డ జిల్లాల అభివృద్ధి కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేటాయించిన 350 కోట్లు మ‌ళ్లీ వెన‌క్కుతీసుకున్నారు.

* రాష్ట్ర ఏర్ప‌డిన మొద‌టి ప‌ది నెల‌ల రెవెన్యూ లోటు 16,078 కోట్లు. ఇది కేంద్రమే ఇవ్వాలి. కానీ కేవ‌లం 3700 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది వాస్త‌వం కాదా.

* ఏపీని ఈశాన్య రాష్ట్రాల్లా కేంద్రం చూస్తుంది కానీ ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోల్చ‌డం లేదు. ఇది ఎలా న్యాయం..?

* రాష్ట్రానికి 13,472 కోట్లు ఇచ్చామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ, నూత‌న రాజ‌ధాని నిర్మాణానికి 43 వేల కోట్లు కావాల్సి ఉండ‌గా వెయ్యి కోట్లు మాత్ర‌మే ఇచ్చారు. మేము మొత్తం 1 ల‌క్షా 54 వేల కోట్లు అడుగుతుంటే కేవ‌లం 13,472 కోట్లు మాత్ర‌మే ఇచ్చారు. ఆశించిన దాంట్లో మూడు శాతం నిధులు ఇస్తే హామీలు అమ‌లు చేసిన‌ట్లా..?

* చ‌ట్టంలో చెప్పిన‌వి, క‌చ్చితంగా ఇవ్వాల్సిన నిధులు త‌ప్పిస్తే కేంద్రం రాష్ట్రంపై ద‌య‌తో ఒక్క రూపాయి కూడా అద‌నంగా ఇవ్వ‌లేదు.

* ఐదేళ్ల‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి 43 వేల కోట్లు కావాలి, కానీ కేవ‌లం 1500 కోట్లు ఇచ్చారు. మేము మాత్రం 1583 కోట్లు ఖ‌ర్చు చేసి కేంద్రానికి యూసీలు కూడా ఇచ్చాం.

* గుజ‌రాత్లో స‌ర్దార్ ప‌టేల్ విగ్ర‌హానికి రూ.3500 కోట్లు, మ‌హారాష్ట్ర‌లో శివాజి విగ్ర‌హానికి రూ.3000 ఖ‌ర్చ‌వుతుంటే, రాజ‌ధాని నిర్మాణానికి 1500 కోట్లు ఇస్తే ఎలా స‌రిపోతుంది..?

* ప్ర‌ధాని స్వంత రాష్ట్రం గుజ‌రాత్‌లో నిర్మిస్తున్నడోలేరా సిటీని ఢిల్లీ, షాంఘై కంటే గొప్ప‌గా ప్ర‌పంచ‌స్థాయిలో నిర్మించాల‌నుకుంటున్న‌ప్పుడు అమ‌రావ‌తిని ప్రపంచ‌స్థాయిలో నిర్మించుకోవాల‌ని ఆశ‌ప‌డ‌టం త‌ప్పా..? ఢిల్లీని మించిన రాజ‌ధాని నిర్మ‌ణానికి స‌హ‌క‌రిస్తామ‌ని మోదీ కూడా చెప్పారు.

* కేవ‌లం గుంటూరులో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీకి వెయ్యి కోట్లు ఖ‌ర్చ‌య్యాయి. 1500 కోట్ల‌తో ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మాణం ఎలా సాధ్యం.

* మేము ప్ర‌ధాని చెప్పిన‌ట్లుగా ప్ర‌తి మ‌నిషి ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు వేయ‌డం లేదెందుకు అని అడ‌గ‌డం లేదు. మాకు రావాల్సిందే అడుగుతున్నాం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*