గంటా పార్టీ మారరట..తమ్ముళ్ళు నమ్ముతున్నారా ?
పార్టీ మారను అని ఏ రాజకీయ నాయకుడు అయినా అన్నారంటే కచ్చితంగా ఆయన పార్టీ మారుతున్నట్లే. ఎందుకంటే రాజకీయ నాయకుల పరిభాషలో అవునంటే కాదని అర్ధం. ఇక [more]
పార్టీ మారను అని ఏ రాజకీయ నాయకుడు అయినా అన్నారంటే కచ్చితంగా ఆయన పార్టీ మారుతున్నట్లే. ఎందుకంటే రాజకీయ నాయకుల పరిభాషలో అవునంటే కాదని అర్ధం. ఇక [more]
పార్టీ మారను అని ఏ రాజకీయ నాయకుడు అయినా అన్నారంటే కచ్చితంగా ఆయన పార్టీ మారుతున్నట్లే. ఎందుకంటే రాజకీయ నాయకుల పరిభాషలో అవునంటే కాదని అర్ధం. ఇక ఇప్పటికే అనేకు ముగ్గులు పెట్టేసిన ముదురు నాయకులు ఇచ్చే స్టేట్మెంట్స్ విషయంలో ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాలి. అందులో లాజిక్ తల పండిన పెద్దలకు కూడా ఓ పట్టాన అర్ధం కాదు. గత కొన్నాళ్ళుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద రూమర్లు అలా వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఆయన అధికారంలో ఉన్నపుడు కూడా వదలకుండా మీడియా వెంటపడింది. ఆయన అలా చేస్తారు, ఇలా చేస్తారు అంటూ కధనాలు వండి వడ్డించింది. ఇక ఇపుడు మరీ ఎక్కువగా రాస్తోంది.
గట్టు దాటితే ఒట్టు :
దీంతో మాజీ మంత్రి గారు ఫుల్ క్లారిటీగా వివరణ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉంటాను, పార్టీ మారను అంటూ గంటా శ్రీనివాసరావు పక్కాగా చెబుతున్నారు. అసలు ఎందుకు పార్టీ మారాలి ఇదీ గంటా వారి ప్రశ్న. తనకు ఆ అవసరం లేదని, అధికారం పై మక్కువ కూడా లేదని ఆయన కామెంట్స్ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి ప్రతిపక్షంలో ఉంటే చాలు అంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావు ఈ విధంగా చెప్పడం వల్ల టీడీపీకి గుండె గుబులు తగ్గుతుందా. కంగారు పడకుండా ఇకపై హ్యాపీగా ఉండొచ్చా. అంటే చెప్పలేమనే వారే ఎక్కువ.
తమ్ముళ్ళకు కలవరమే :
ఎందుకంటే గంటా శ్రీనివాసరావు కు గతంలో పార్టీలు మారిన చరిత్ర ఉంది. ఆయన అప్పుడు నేనెందుకు పార్టీ మారాలి అని అనుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నారు అంటే బయట ఎక్కడా వర్కౌట్ కాలేదా లేక కొన్నాళ్ళు వ్యూహాత్మకంగా మౌనంగా ఉండాలనుకుంటున్నారా. కొత్త డౌట్లు ఇలా పుట్టుకువస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికైతే గంటా పార్టీ మారను అన్నారు. అధికారం ఓ వైపు లేదు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పరిస్థితి అసలు బాగులేదు. చంద్రబాబు ఒకపుడులా చురుకుగా రాజకీయం చేసే వయసులో లేరు. ఇవన్నీ ఆలోచించినపుడు మాత్రం గంటా శ్రీనివాసరావు లాంటి తెలివైన రాజకీయ నాయకులు ముందు చూపుతోనే వ్యవహరిస్తారు. మరి గంటా తాను మారాను, ఇక మారను అంటున్నారు. కానీ మరి టీడీపీలో ఇంకా కలవరం మాత్రం తగ్గడంలేదు.